తెలంగాణ

మిస్టర్ రెడ్డి.. నోరు మూసుకో.. కిషన్ రెడ్డి ఉగ్రరూపం

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు నుంచే అడుగడుగునా అబద్ధాలు చెప్పడం, అనేక రకాల అమలు చేయలేని హామీలు ఇవ్వడం, 6 గ్యారంటీలు 420 సబ్ గ్యారంటీలతో ఆశచూపి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని అమలుచేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో, పాలనలో వైఫల్యంతో, చేతకానితనంతో, అప్పులు తీర్చేందుకు అప్పులు చేస్తూ.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అథ:పాతాళానికి తొక్కేశారు.

పైకి మాత్రం గురివింద గింజ లాగా.. తన అసమర్థతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.ప్రజల దృష్టిని తమ ప్రభుత్వ వైఫల్యాలనుంచి మళ్లించే ప్రయత్నంలో.. కేంద్ర ప్రభుత్వం మీద, బీజేపీ మీద, మోదీ గారి మీద అర్థంపర్థం లేని విమర్శలు చేస్తున్నారు.తెలంగాణలో ఇచ్చిన హామీలకు రేవంత్ తోపాటుగా.. రాహుల్ గాంధీ, సోనియాగాంధీ పూర్తి బాధ్యత వహించాలి.

మైనార్టీ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ పేర్లతో ఆయా వర్గాలను మోసం చేశారు. అధికారంలోకి వచ్చి.. దేన్ని కూడా డెడికేషన్‌తో అమలు చేయలేదు. బీసీల కోసం లక్ష కోట్లు ఇస్తామన్నారు. ఈ రెండేళ్లలో 40వేల కోట్లు ఖర్చుపెట్టాలి కదా.. మరి అవన్నీ చేశారా?అవేవీ చేయకుండా.. ఢిల్లీ బాటపట్టి, అర్థంలేని విమర్శలు చేస్తున్నారు. ఈ 18 నెలల్లో ఢిల్లీ ప్రదక్షిణ తప్ప తెలంగాణకు ఒరగబెట్టిందేమీ లేదు. బీసీ సామాజిక కులాలకు, బీసీ డిక్లరేషన్‌లో.. అనేక రకాల హామీలు ఇచ్చి.. దేన్ని కూడా అమలుచేయలేదు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ అద్దాలమేడలో కూర్చుని ఇతరులపై రాళ్లు రువ్వే ప్రయత్నం చేస్తున్నారు.

బీసీలకు సామాజిక సాధికారత కల్పించే ప్రయత్నంలో.. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు అని తెలంగాణ సమాజం అర్థం చేసుకుంది. మోదీ గారిని గద్దెదించేందుకు రేవంత్ రెడ్డి శిలాశాసనం రాస్తున్నామన్నారు.. మీరు అధికారంలో ఉన్న 3 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలో గెలిచినా.. రాహుల్ గాంధీ ఏం చెప్పినా చేసేందుకు నేను సిద్ధం.తిరిగి గెలిపించుకునే సత్తా కాంగ్రెస్‌కు, రాహుల్ గాంధీకి లేదు. వరుసగా 3 పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయారు. వివిధ రాష్ట్రాల్లో అడ్రస్ లేకుండా పోయింది. అలాంటిమీరు.. మోదీ గారికి సవాల్ విసరడం అంటే సూర్యుడిపై ఉమ్మేసినట్టే.. అలా చేస్తే మీ మీదే పడుతుందనే విషయం గుర్తు పెట్టుకోవాలి.

తెలంగాణలో ఇప్పటికే ప్రజలు మరణ శాసనం రాశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు ప్రజలు పశ్చాత్తాపం పడుతున్నారు. జంతర్ మంతర్ సభ.. సోనియా కుటుంబాన్ని పొగడటానికి, మోదీ గారిని తిట్టేందుకే పెట్టుకున్నారు. సభ కోసం ఎన్నో ప్రగల్భాలు పలికారు. పార్టీ పెద్దలందరూ వస్తారన్నారు. కానీ చివరకు ఢిల్లీలో కూడా పార్టీ ముఖ్యనాయకులెవరూ కనీసం కన్నత్తి కూడా చూడలేదు. 31 నిమిషాల ఉపన్యాసంలో.. సోనియా కుటుంబాన్ని పొగిడేందుకు.. మోదీ గారిని తిట్టేందుకే ఎక్కువ సమయం కేటాయించారు.

బీసీలకు ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్ల అమలు విషయంలో న్యాయబద్ధంగా చర్చించి ఇచ్చే ప్రయత్నం చేయాలి కానీ.. రేవంత్ రెడ్డి రాజకీయంగా, పాలనలో, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో వైఫల్యం చెందారు. కానీ అవినీతిలో మాత్రం బీఆర్ఎస్ తో పోటీ పడుతోంది.నాడు కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రైవేట్ లిమిటెడ్ సంస్థగా మార్చి హోల్ సేల్ అవినీతి చేస్తే.. కాంగ్రెస్ పార్టీ రిటెయిల్ గా అవినీతికి పాల్పడుతోంది. అవినీతిలో అగ్రస్థానం, అప్పుల్లో అగ్రస్థానంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉంది.

గతంలో తెలంగాణ రాష్ట్రంలో.. స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ బీసీలకు అమలైంది. దాన్ని కేసీఆర్ గారు 27%కు తగ్గించారు. ఆయన 12% ముస్లిం రిజర్వేషన్ ఇచ్చేందుకు అనేక రకాల కుట్రలు కుతంత్రాలు చేశారు. మజ్లిస్ కనుసన్నల్లో 12% బీసీ రిజర్వేషన్లను ముస్లింలకు ఇచ్చే ప్రయత్నం జరిగింది.ఇవాళ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కూడా.. 34% ఉన్న రిజర్వేషన్ ను 32%కు తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. బీసీ జనాభా ప్రాతిపదికన 42% ఉండాల్సిన బీసీ రిజర్వేషన్ కు అన్యాయం చేశారు. సర్వేలోనూ అనేక రకాల తప్పులు చేశారు. బీసీల సంఖ్యను తగ్గించారు. అది కాకుండా అందులో 10% ముస్లింలను చేర్చి.. బీసీలకు అన్యాయం చేస్తున్నారు.

మతపరమైన రిజర్వేషన్లను పెట్టి.. దేశంలో అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారా? ఇదేనా మీ తెలంగాణ మోడల్.. బీసీ సామాజిక వర్గానికి మోసం చేయడమే తెలంగాణ మోడలా?. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో.. గత ఎన్నికల్లో బీసీలకు 50 సీట్లు రిజర్వ్ చేస్తే.. ఇందులో 31 మంది నాన్-బీసీలు గెలిచారు. ఇలాంటి పరిస్థితుల్లో బీసీలకు ఎలా న్యాయం చేస్తారో.. రాహుల్, రేవంత్, కేసీఆర్ సమాధానం చెప్పాలి. బీసీల మెడలు కోసి.. మజ్లిస్ పార్టీ చేతుల్లో పెట్టడం ద్వారా బీసీలకు న్యాయం జరుగుతుందా?

తెలంగాణ రాష్ట్రంలో.. కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా.. మజ్లిస్ చెప్పినట్లే నాటకాలు చేస్తారు. వారు చెప్పినట్లే అసెంబ్లీలో వ్యవహరిస్తున్నారు. వారు చెప్పినట్లే.. తెలంగాణలో పాలిస్తున్నారు.ఇదే విధమైన పరిస్థితి కొనసాగితే.. ఒవైసీ కుటుంబానికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసంర లేదు.నిన్న జనగణన అని సీఎం అంటున్నాడు. అది తూతూ మంత్రంగా నిర్వహించిన సర్వే మాత్రమే. హైదరాబాద్ నగరంలో 25% మంది ఇళ్లలోకి వెళ్లకుండా.. దాన్ని గొప్ప సర్వేగా చెప్పుకోవడం సిగ్గుచేటు. దీన్ని బీసీ సమాజం అర్థం చేసుకోవాలి.

ఆర్డినెన్స్ ను గవర్నర్ గారు ఆమోదించారని అంటున్నారు. ఆమోదించిన తర్వాత మళ్లీ రాష్ట్రపతికి పంపాల్సిన అవసరం ఉండదు. చట్టపరమైన, న్యాయపరమైన అంశాలపై అనుమానాలుంటేనే.. రాష్ట్రపతి సూచనకోసం పంపిస్తారు. అది గవర్నర్ ను అడిగి తెలుసుకోండి. తిరిగి మమ్మల్నే నిరక్షరాస్యులం అంటున్నారు.. అవును.. బీసీలను మోసం చేయడంలో మేం నిరక్షరాస్యులమే. అవినీతి చేయడంలో మేం నిరక్షరాస్యులమే. అక్రమాలు చేయడంలో నిరక్షరాస్యులమే. ఎప్పుడూ మేం ఎవరినీ మోసం చేయం. అవసరాల కోసమో.. పదవుల కోసమో పార్టీలు మారే అలవాటు మాకు లేదు.

రాష్ట్రపతి స్థానంలో ఉన్న మహిళపై తెలంగాణలోని ఓ మహిళా మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. మంత్రి వ్యాఖ్యలపై సోనియా గాంధీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. రాజకీయ వేదికలపై ఇలా దిగజారి.. రాజకీయంగా సంబంధం లేని రాష్ట్రపతి గారి గురించి అలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. ఇది ముమ్మాటికీ దేశంలోని మహిళలకు అవమానకరం.స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇవాళ్టి వరకు బీసీలకు అన్యాయం చేయడంలో కాంగ్రెస్ పార్టీ కక్షపూరిత వైఖరితో వ్యవహరిస్తోంది. 1955లో కాకా కాలేకర్ కమిటీ రిపోర్టును నెహ్రూగారు తొక్కిపెట్టారు. ఇందిరా, రాజీవ్ కలిసి.. మండల్ కమిషన్ రిపోర్టును పదేళ్లపాటు పక్కనపెట్టారు. ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా?

బీజేపీ ప్రభుత్వం బీసీ కమిషన్ కురాజ్యాంగ హోదా కల్పించింది. బీసీలకు ఉన్నత విద్యలో 27 శాతం రిజర్వేషన్లను మోదీ సర్కారు కల్పించింది. కేంద్ర మంత్రి వర్గంలో 27 మంది ఓబీసీలకు, 12 మంది ఎస్సీలకు, 8 మంది ఎస్టీలకు, ఐదుగురు మైనార్టీలకు అవకాశం కల్పించిన ఘనత నరేంద్ర మోదీ గారిది. మోదీ గారిని రేవంత్ రెడ్డి కన్వర్టెడ్ బీసీ అని అంటారు. మరి మీరు కన్వర్టెడ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రివా మరి? ఆయన ఎలాంటి రాజ్యంగబద్ధ పదవిలో లేనప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడే మోదీ గారి కులాన్ని బీసీల్లో చేర్చారు. అదే సమయంలో బీసీల జాబితాలో చేర్చిన విశ్వబ్రాహ్మణ కులాన్ని బీసీల్లో, బంజారాలను ఎస్టీల్లో చేర్చారు. వారిని కూడా కన్వర్టెడ్ కులాాల వారు అని అనగలరా?

‘మోదీని గద్దె దించుతా.. రాహుల్ ను ప్రధానిని చేస్తా’నని పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఘోరంగా ఓడిపోవడం ఖాయం. ముఖ్యమంత్రిగా భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని తెలంగాణ ప్రజలకు సేవ చేయాలే తప్ప స్థాయికి మించి మాటలు మాట్లాడొద్దని సూచిస్తున్నాను.తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది. వచ్చే ఎన్నికల్లో అవినీతి బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ప్రజల ఆశీస్సులతో ఎదగాలని కోరుకుంటున్నాం. రాజకీయంగా ఉన్న సమస్యలు సామరస్యంగా పరిష్కారం కావాలని కోరుకుంటున్నాం. అంతే తప్ప వివాదాలతో ప్రజల్లో ఆందోళన కల్పించే కుట్రలను అడ్డుకుంటాం.నాడు ముస్లింలకు 4% రిజర్వేషన్లనే హైకోర్టు కొట్టేస్తే.. ఇవాళ ఏ విధంగా 10% రిజర్వేషన్లు ఎలా ఇస్తారు?

ఒవైసీ బీసీనా? 31 బీసీ రిజర్వ్‌డ్ సీట్లలో మజ్లిస్ పార్టీ గెలవడం బీసీలకు న్యాయం చేసినట్లా? రాజకీయంగా బీసీల పేరుతో రిజర్వేషన్లు చేసి.. ఇవాళ మతపరమైన రిజర్వేషన్లు ఇస్తే.. చూస్తూ ఊరుకోవాలా? బీసీలకు జరిగే అన్యాయాన్ని బీజేపీ చూస్తూ ఊరుకోదు. ఏ ఎన్నికలు జరిగినా బీసీలకు పెద్దపీట వేసిన ఏకైక పార్టీ బీజేపీ. బీసీలకు వెన్నంటి ఉండే ఏకైక పార్టీ బీజేపీ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button