Saturday, February 28, 2026
Homeతెలంగాణకేసీఆర్‌ ఆమరణ దీక్ష.. ఇవాళ్టిటి 16 ఏండ్లు పూర్తి

కేసీఆర్‌ ఆమరణ దీక్ష.. ఇవాళ్టిటి 16 ఏండ్లు పూర్తి

తెలంగాణ చరిత్రలో ఎన్నో ఘట్టాలు కాలగమనంలో చెరిగిపోకుండా నిలిచిపోయాయి. కొన్ని సందర్భాలు కేవలం సంఘటనలు కాదు, సమాజం గుండెల్లో చెక్కబడి శాసనాల్లా నిలిచే మైలురాళ్లు. అలాంటి అపురూప ఘట్టాల్లో కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ప్రధానమైనది. ఆ రోజులు, ఆ వేళలు, ఆ ఉద్యమోద్వేగం ఇవన్నీ కేవలం మాటల్లో చెప్పలేనివి. ఆ సమయంలో రాష్ట్రంలో నెలకొన్న ఉద్రేకం, ప్రజల ఆశలు, యువత రగిలిపోయిన కోపం, టీవీల ఎదుట గడిపిన గంటలు, వార్త కోసం చేసిన ఆత్రుత ఇవన్నీ ఆ ఉద్యమాన్ని ప్రత్యక్షంగా చూసినవారే అర్థం చేసుకోగలరు.

ఆ రోజు ఎవరు ఏమి చెప్పినా.. ఉద్యమ ఫలితాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని ఎవరు ప్రయత్నించినా, 2001లో తెలంగాణ జెండాను ఎగరేసి, ప్రజల మనసుల్లో ఆశ వెలిగించినది కేసీఆర్ అనే విషయం ఎవరూ తిరస్కరించలేరు. పదహారేళ్లపాటు ఎదురైన కుట్రలను ఛేదించి, సీమాంధ్ర పాలకుల దౌర్జన్యాలను ఎదుర్కొని, మొత్తం తెలంగాణ ప్రజలను ఒక్క మాట, ఒక్క లక్ష్యంతో ఏకతాటిపై నడిపించిన ప్రధాన శక్తి కేసీఆర్ నడిపిన ఉద్యమమే. ఆయనతోపాటు వేలాది మంది ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు అందరూ తెలంగాణ కోసమే రగిలిపోయారు.

ఉద్యమం ఉప్పెనలా ఉవ్వెత్తున ఎగసిన సమయంలో, కొన్ని చిన్న సంఘటనలను మీడియా ఎంత పెద్దవిగా చూపించినా, అసలు దిక్సూచీ మార్చిన నిర్ణయం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షేనని చరిత్ర చెబుతోంది. తెలంగాణ ప్రకటనలో ప్రతి అక్షరం కేసీఆర్‌తో జరిగిన చర్చల తర్వాతే వెలువడిందని ఉద్యమాన్ని సమీపంగా అనుసరించినవారికి బాగా తెలుసు. కురియన్ సభలో “The bill is passed” అని ప్రకటించిన క్షణం, కోట్లాది తెలంగాణ ప్రజలు కన్నీళ్లతో స్వరాష్ట్ర పుట్టుకను చూసిన ఆ పవిత్రమైన క్షణానికి పునాది కేసీఆర్ నిరాహార దీక్షే.

ఇవాళ దీక్ష గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్న కొందరు, ఆ సమయంలో ఒక్క అడుగు కూడా వేయలేదు. హిందీలో చెప్పినట్టు — “జో జీతా వోహీ సికిందర్”. తెలంగాణ కోసం గెలిచింది కేసీఆర్ కాబట్టి ఆయనే తెలంగాణ సికిందర్.

నేటి నుంచి 16 సంవత్సరాల క్రితం, నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు వరుసగా 11 రోజులు సాగిన ఆ నిరాహార దీక్ష ఆకాశాన్ని కూడా కదిలించిన ఘట్టం. సిద్దిపేటలో దీక్ష చేయనున్నట్టు కేసీఆర్ ప్రకటించిన రోజు నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ పెరిగింది. ఆయనను అడ్డుకోవాలని ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు, పోలీసులు రహదారులన్నీ మూసివేసి, వాహనాలను నిలిపివేసి, కేసీఆర్‌ను అరెస్టు చేయడం ఇవన్నీ ప్రజల్లో మరింత ఆవేశం రగిలించాయి.

అలుగునూర్ చౌరస్తా కేసీఆర్ అరెస్టుతో క్షణాల్లో ప్రజలు రగిలిపోతున్న హృదయం ఆగ్రహంతో పేలింది. వేలాది మంది రోడ్లపైకి వచ్చి నినాదాలు చేశారు. కేసీఆర్‌ను పోలీసులు చుట్టుముట్టిన క్షణం నుంచి, ఆయనను బస్సులో ఎక్కించి వరంగల్ దారిలో తీసుకెళ్లే క్షణం వరకు రాష్ట్రం మొత్తం ప్రతిక్షణం ఉత్కంఠతో ఉప్పొంగింది. ప్రజలు చెక్‌పోస్టులు చెరిపేసి ముందుకు దూసుకెళ్లారు.

కేసీఆర్‌ను వరంగల్‌కు, తరువాత ఖమ్మంకు తరలించడం, అక్కడే జడ్జి ఇంట్లో విచారణ జరగడం, 14 రోజుల రిమాండ్ విధించడం ఇవన్నీ ప్రభుత్వ యంత్రాంగం ఎంత గందరగోళంగా పనిచేసిందో చెప్పే ఉదాహరణలు. ఇదిలా ఉంటే, కేసీఆర్‌ను అరెస్టు చేసిన వెంటనే ఆయన మొదటి రోజునుండే తన ఆమరణ దీక్ష ప్రారంభమైందని ప్రకటించడం ఉద్యమానికి కొత్త ఊపును ఇచ్చింది.

కేటీఆర్‌ను పోలీసులు అరెస్టు చేయాలని ప్రయత్నించినా, ఆయన చాకచక్యంగా తప్పించుకొని జయశంకర్ ఇంటికి చేరుకొని విద్యార్థులతో కలిసి దీక్ష చేయడం, హరీశ్‌రావు సిద్దిపేటలో దీక్ష ప్రారంభించడం ఇవన్నీ ఆ క్షణాల్లో తెలంగాణ ఒక అగ్నిగుండంలా మారిందని నిరూపించాయి. ఎల్‌బీనగర్‌లో శ్రీకాంతాచారి ఆత్మాహుతి ప్రజల్లో అసహనానికి అగ్రస్థాయిని చేరవేసింది. అందుకే తెలంగాణ సాధన చరిత్రలో ఆ నిరాహార దీక్ష దివస్ ఒక శిలాఫలకం. ఆ దీక్ష తెలంగాణ భవిష్యత్తును మార్చింది. ఆ నిర్ణయం తెలంగాణ ఆత్మను రగిలించింది. ఆ దీక్షే తెలంగాణ పుట్టుకకు బీజం వేసింది.

ALSO READ: Hi అని మెసేజ్ పెట్టినందుకు కోట్లు కొట్టేసింది

RELATED ARTICLES

Most Popular

Recent Comments