
కేసీఆర్ శాసనసభకు వచ్చారు. గవర్నర్ ప్రసంగం మొత్తం విన్నారు. ఆ తర్వాత ఏంటి..? దబిడి దిబిడేనా..! సభలో రచ్చ రచ్చనే..! అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ఘాటుగా ఉండబోతోందా..? కేసీఆర్ సభకు వస్తే… పదేళ్ల పాలనపై నిలదీయాలని అధికార కాంగ్రెస్ సభ్యులు భావిస్తున్నారు. ఆరు గ్యారెంటీల అమలుపై గట్టిగా నిలదీయాలని బీఆర్‌ఎస్ అస్త్రాలు సిద్ధం చేసింది. ఈ వార్‌లో పైచేయి ఎవరిది…? శాసనసభా వేదికగా జరగనున్న వాగ్ధాటిలో నెగ్గేదెవరు..? ఎవరి వ్యూహం వర్కౌట్ అవుతుంది…? లెస్ట్ వాచ్.
కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి.. బీఆర్‌ఎస్ ప్రతిపక్ష పాత్రకు పరిమితమైన తర్వాత.. ఎప్పుడో ఒకసారి సభలో అలా మెరిసారు బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్. ఆ తర్వాత చాన్నాళ్లకు ఇప్పుడు సభకు హాజరయ్యారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ సభకు రావడంలేదని కాంగ్రెస్ గగ్గోలు పెట్టింది. ఎంతో అనుభవం ఉన్న ప్రతిపక్ష నాయకుడు ప్రజాసమస్యలపై అధికార పార్టీకి సూచనలు కూడా ఇవ్వడంలేదని సీఎం రేవంత్‌రెడ్డి పదే పదే చెప్పారు. ఫామ్‌హౌస్‌లో డైలాగులు వేయడంలో… శాసనసభకు వస్తే అన్నింటిపై చర్చిద్దామని మంత్రులు కూడా అన్నారు. అంతేకాదు.. కొందరు కాంగ్రెస్ నేతలు కేసీఆర్ సభకు రాకపోతే… ఆయన జీతం రికవరీ చేయాలని స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు కూడా చేశారు. ఇప్పుడు కేసీఆర్ సభకు రానే వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్లాన్ ఏంటి…?
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత అయితే ఉంది. రాష్ట్రంలో సమస్యలు పెరిగిపోతున్నాయి. నిజామాబాద్ పసుపు రైతుల ధర్నా కావచ్చు… సాగు, తాగు నీటి సమస్య కావచ్చు.. లేదా కరెంట్ కోతల అంశం కావొచ్చు. ముఖ్యంగా కులగణన అంశం. ఆపై కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు. వీటన్నింటిని బీఆర్‌ఎస్ తమ అస్త్రాలుగా మలుచుకుంది. శాసనసభలో ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని గట్టి నిలదీయాలని పార్టీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు తాను కూడా సభకు వస్తానని కూడా ప్రకటించారు. అన్నట్టుగానే సభకు హాజరయ్యారు. కేసీఆర్ సభకు రావడంతో… గత పదేళ్ల పాలనపై ఆయన్ను కడిగిపారేయాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఏడాది పాలనలో కాంగ్రెస్ వైఫల్యాలను అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో… అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా జరగనున్నాయి. కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు…? ప్రభుత్వం ఎలా కౌంటర్ ఇవ్వబోతోంది..? అన్నది ఆసక్తికరంగా మారింది.