తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాదాపు 6 నెలల తర్వాత జూలు విదిల్చారు. పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేసిన కేసీఆర్.. తర్వాత ఎక్కడా మాట్లాడలేదు. సోమవారం నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఉండటంతో ఎమ్మెల్యే,ఎమ్మెల్సీలతో ఎర్రవెల్లి ఫాంహాజ్ లో సమావేశమయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై సభ్యులకు దిశా నిర్దేశం చేశారు కేసీఆర్. పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణ పై పార్టీ సభ్యులకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అసెంబ్లీ లో మండలిలో నిలదీయాలని స్పష్టం చేశారు.
అధికారం లోకి వచ్చి ఏడాది కాలం పూర్తి చేసుకున్న రాష్ట్ర కాంగ్రేస్ ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చామని కేసీఆర్ చెప్పారు. ప్రభుత్వ చేతకాని తనం వల్ల అస్తవ్యస్తంగా మారిన పాలనకు విసుగుచెందిన రాష్ట్ర ప్రజలు తిరగబడుతున్నారని తెలిపారు. తెలంగాణను తెచ్చి పదేండ్లు ప్రగతి పథాన నిలిపిన పార్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా బిఆర్ఎస్ పార్టీ నేతలు ఎక్కడికక్కడ ప్రభుత్వ ప్రజావ్యతిరేక వైఖరులను నిలదీయాలని పార్టీ నేతలకు సూచించారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీని వేదికగా చేసుకుని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గొంతు విప్పాలని, పార్టీ ఎమ్యెల్యేలకు ఎమ్మెల్సీలకు బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు దిశానిర్దేశం చేశారు.
ప్రజా సమస్యలపై చర్చించిన కేసీఆర్..సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణి, మోసపూరిత వైఖరిని నిలదీయాలన్నారు. ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా గొంతు విప్పాలని వివరించారు. ఎన్నికల సంధర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేక చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజలను అణచివేస్తున్నదని దుయ్యబట్టారు.లగచర్ల లో మెడికల్ ఫ్యాక్టరీ పేర తమ భూములు గుంజుకుంటున్నారని రొడ్లమీదికి వచ్చిన గిరిజనుల మీద ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తున్నదని, ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసీఆర్ స్పష్టం చేశారు. మూసీ సుందరీకరణ పేరుతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల నివాసాలను కూలగొడుతున్నదని, ఇది ఎంతమాత్రం క్షమించరానిదన్నారు. హైడ్రా ముసుగులో పేదల ఆవాసాలను బుల్డోజర్లతో నిలువునా కూల్చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఉభయ సభల్లో ఎండగట్టాలన్నారు.
కేసీఆర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే..
” రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చినాం. ఇంకా మనం మాట్లాడకుంటే మంచిదికాదు. ప్రజలు కూడా వూరుకోరు. లేనిపోని ఆశలు కల్పించి ప్రజలను నిలువునా మోసం చేసి ఇప్పుడు ప్రశ్నించినోల్లనే రాష్ట్ర ప్రభుత్వం పగబడుతున్నది. తనను నమ్మి వోట్లేసిన నిరుపేదలను రైతులను గిరిజనులను దళితులను నిర్థ్యాక్షిణ్యంగా వేధిస్తున్నది. ఇదేంది అని అడిగిన వాల్లను కేసులు పెట్టి వేధిస్తున్నది. ప్రజల పక్షాన పోరాడుతున్న బిఆర్ఎస్ నేతలను శ్రేణుల మీద వూ.. అంటే కేసులు పెట్టి భయ భ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నది. త్యాగాలు చేసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను తెర్లు చేయాలని చూస్తున్న కాంగ్రేస్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి. ప్రభుత్వం మీద ఇప్పటికే ప్రజలకు విసుగు పుడుతోంది. అన్నవస్త్రాలకని పోతే వున్న వస్త్రాలు వూసిపోయినట్టయిందని ప్రజలు దు:ఖ పడుతున్నారు.’’ అని తెలిపారు.దళితులను బీసీలను ఏ ఒక్కరినీ వదలకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతివొక్క వర్గాన్ని వంచిస్తున్నదన్నారు. కామారెడ్డి బిసీ డిక్లరేషన్ ఏమయిందాన్నారు.
సాగునీటి రంగాన్ని అస్తవ్యస్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం తన చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి నాటి బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదునాం చేసేందుకు కాళేశ్వరం అంశాన్ని ముందుకు తెచ్చినారన్నారు. వృథాగా సముద్రంలో కలుస్తున్నకాళేశ్వరం జలాలను ఎందుకు ఎత్తిపోస్తలేరని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఉద్యోగుల పరిస్థితి కూడా దారుణంగా తయారయ్యిందని కేసీఆర్ తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ… ‘‘ మన ప్రభుత్వ హయాంలో తెలంగాణ ఉద్యోగులు దేశంలోనే అత్యంత ఎక్కువ జీతాలు తీసుకున్న ఉద్యోగులుగా చరిత్రకెక్కారు. పదేండ్ల కాలంలో వారి జీతాలను 73 శాతం పెంచినాం. కాగా…తమకు వోటేస్తే మిమ్మల్ని అందలమెక్కిస్తామని ఊదరగొట్టి అధికారంలోకి రాగానే ఉద్యోగులకు కాంగ్రేస్ ప్రభుత్వం మొండి చేయి చూపింది. వారికి అందాల్సిన 5 డీయేలకు గాను కేవలం వొక్క డీ.ఏ విదిలించింది. దాన్ని కూడా 17 వాయిదాలల్లో అందిస్తామని సిగ్గులేకుండా ప్రకటించింది. తెలంగాణ ఉద్యోగుల పరిస్తితిని దారుణంగా తయారయిందని విమర్శించారు. ఈ సందర్భంగా కేసీఆర్ వొక సామెతను ఉదహరించారు. ఎనకటికి ఇటువంటి ముఖ్యమంత్రే ఏమీ తెల్వని అమాయకున్ని తీర్థం పోదామని తీస్కపోయిండంట..తీస్కపోయినాయినేమో గుల్లె పండుకుండంట..ఆశపడి ఎమ్మటిపోయినోన్న సలిలో పండబెట్టిండంట’’ అని చెప్పారు. ‘‘తీర్తం పోదాం తిమ్మక్క అంటే నువ్వు గుల్లే నీను సల్లె’’ అనే సామెతను చెప్పి..ఉద్యోగుల పరిస్తితి అట్లనే తయారయిందని తెలిపారు. దాంతో సమావేశంలో నవ్వులు విరిసాయి.
రాష్ట్రంలోని గురుకుల విద్య రోజు రోజుకూ దిగజారుతున్నదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ‘‘ గురుకుల విద్యాలయాలను మనం దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దినాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులను ప్రపంచ స్థాయి లో పోటీ పడి అత్యున్నత చదువులను చదివించాం. అత్యున్నత స్థాయి ఉద్యోగాల్లో వారికి అవకాశాలోచ్చినాయి. బిఆర్ఎస్ హయాంలో కార్పోరేట్ విద్యాలయాలకు మించి ఉన్నత విద్యనందించిన గురుకులాలు ప్రజలనుంచి గొప్పగా ఆదరణ పొందాయి. పోటీ పడి తమ పిల్లలను గురుకులాల్లో చేర్పించారు. గురుకులాలకు పెరుగుతున్న డిమాండును చూసి నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం వేల సంఖ్యలో పెంచింది. వాటిని కళాశాలలుగా అప్ గ్రేడ్ చేసింది. అత్యున్నత స్థాయి విద్యా వసతులను కల్పించడం వల్ల కరోనా వంటి క్లిష్ట సమయాల్లో కూడా తల్లిదండ్రులు వారి పిల్లలను గురుకులాల్లోనే వుండనివ్వాలని కోరుకున్నారు. అక్కడయితేనే రక్షణవుంటుందని భావించారు. ఎండాకాలం సెలవుల్లో కూడా పిల్లలను ఇండ్లల్లకు తీసుకుపోకుండా గురుకులాల్లోనే వుంచి చదివించేవారు. అంతగా ప్రజాదరణ పొందిన గురుకులాలను నేటి కాంగ్రేస్ ప్రభుత్వం అస్తవ్యస్తం చేస్తున్నది. మనం తీర్చిదిద్ది చేతుల్లో పెడితే కూడా సక్కగా నడపడం చేతకావట్లేదు. తినేతిండిని కూడా సరిగ్గా వండి పెట్టలేక పిల్లలకు విషాహారం పెడుతున్నది. పిల్లలు చనిపోతున్న దారుణ దృశ్యాలు మనసును కలిచివేస్తున్నయి. ఇందుక సభ్య సమాజం సిగ్గుపడుతున్నది.
నాటి మన ప్రభుత్వ హయాంలో గురులకులాల బాధ్యునిగా అత్యున్నత సేవలందించిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అభినందనలు తెలుపుతున్నాను. వారితో పాటు మరో నలుగురు సభ్యులతో కమిటీ వేసినాం. గురుకులాల సమస్యలేమిటి..ఎందుకింతగా పిల్లలు, తలిదండ్రులు బాధ పడుతున్నారో తెలుసుకోవాలని స్టడీ చేసి రావాలని నీనే స్వయంగా వారిని ఆదేశించి తోలితే…వారిని ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకోవడం శోచనీయం. ఎంతో కష్టపడి వారు ఒక నివేదకను తయారు చేసి ఇప్పుడే నాకు అందజేశారు. నివేదికలో దిగ్భ్రాంతికరమైన అంశాలున్నాయి. వాటిమీద బిఆర్ఎస్ పార్టీ పోరాట కార్యాచరణ తీసుకుంటుంది.’’ అని తెలిపారు.
అద్భుతంగా తీర్చిదిద్ది, తయారు చేసి సిద్దంగా పెట్టిన గురుకులాలనే సక్రమంగా నడపలేని , పిల్లలకు చదువును అందించడం చేతగాని రాష్ట్ర కాంగ్రేస్ ప్రభుత్వం దేశాన్ని ఉద్దరిస్తానని ప్రగల్భాలు పలుకుతున్నది..దీని మీద అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలె’’ అని సూచించారు.
ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహమార్పు పై కేసీఆర్ గారు స్పందించారు. వారు మాట్లాడుతూ…‘‘తెలంగాణ అస్థిత్వం ప్రజల ఆకాంక్షల గురించి ఏమాత్రం సోయిలేని ముఖ్యమంత్రి కేవలం రాజకీయ స్వార్థంతో కేసీఆర్ మీద కక్షతో ఇటువంటి పిచ్చిపనులకు పూనుకోవడం శోచనీయం.తెలంగాణ తల్లి భావన కేసీఆర్ ది కాదు..యావత్ తెలంగాణ సమాజానిది. దీని గురించి 70 ఏండ్ల కిందనే, దాశరథి రావెల్ల వెంకట్రామారావు వంటి తెలంగాణ కవులు తెలంగాణ తల్లి గురించి కీర్తించారు. ఈ సంగతి ఈ ప్రభుత్వానికి దాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రికి తెల్వదు..కేసీఆర్ పెట్టిండని కేసీఆర్ ఆనవాల్లు లేకుండా చేయాలని మూర్ఖపుతనంతో వ్యవహరిస్తున్నారు. అని మండి పడ్డారు.
తెలంగాణ తల్లి ఏర్పాటు చారిత్రక సందర్బం :
ఈ సందర్భంగా తెలంగాణ తల్లి ఆవిర్భావం చారిత్రక నేపథ్యం గురించి కేసీఆర్ వివరించారు.
వారి మాటల్లోనే….‘‘నాటి నిజాం పాలననుంచి విముక్తి కోసం కమ్యునిస్టులు సాయుథ పోరాటం నడిపిస్తున్న కాలం అది. నైజాం పాలకుల సాంస్కృతిక ఆచారాలు తప్ప, తమ సొంత భాష సంస్కృతి వంటి తెలంగాణ ప్రజల అస్థిత్వానికి ఆనాటి రాజరిక పాలనలో అంతగా చోటులేకుండే. కమ్యునిస్టుల పోరాటం తెలంగాణ ప్రజల్లో చైతన్యాన్ని నింపింది. నిజాం పాలనమీద తిరుగబడ్డ నాటి తెలంగాణ కవి దాశరథి…నా తెలంగాణ తల్లి కంజాతవల్లి…అంటూ కీర్తించారు. అదే విధంగా ‘‘నా తల్లి తెలంగాణ రా.. వెలలేని నందనోద్యానమ్మురా…అంటూ రావెల వెంకట్రావు వంటి గొప్ప కవులు తెలంగాణ తల్లి భావనను ముందుకు తెచ్చారు. వారు చేసిన కృషి తెలంగాణ సాంస్కృతిక అస్థిత్వ భావనల పట్ల ప్రజల్లో సోయిని పెంచింది. తమ భాష గురించి తమ కట్టుబోట్టు గురించిన అవగాహనను ఆవిధంగా నాటి రైతాంగ పోరాటం నేర్పింది.
అదే సందర్భంలో నాటి మద్రాస్ ఉమ్మడి రాష్ట్రంలో భాగమైన ఆంధ్రా ప్రాంతం ప్రత్యేకాంధ్ర కోసం పోరాటాలు నడిపింది.
ఈ నేపథ్యంలో తమకొక అస్తిత్వ చిహ్నం కావాలనే సోయి వున్న ఆంధ్రా ఉద్యమ కారులు తమిళులతో సాగించిన ఉద్యమంలో, ‘ఆంధ్రా మాత అనే భావనను ముందుకు తెచ్చారు. అట్లా ముందుకు వచ్చింది ఆంధ్రా తల్లి భావన. అయితే…అనంతర కాలంలో తెలంగాణను విలీనం చేసుకున్న నాటి ఆంధ్రా నాయకత్వం, ఆంధ్రా మాత’ భావనను వదిలివేసింది. తెలంగాణ తల్లి భావనను విస్మరింపచేసింది. రెండింటినీ పక్కకు పెట్టి, తెలుగు తల్లి అనే భావనను ముందుకు తెచ్చిండ్రు. కుట్రపూరితంగా తెలంగాణ అస్థిత్వాన్ని మరిపించ చూసారు. ‘మా తెలుగు తల్లికి మల్లె పూదండా’ అంటూ ఆంధ్రా నాయకత్వం మనతో కూడా పాటలు పాడించింది.
అనంతర కాలంలో మొదలైన తెలంగాణ ఉద్యమ సందర్భాల్లో, వట్టికోట ఆల్వారు స్వామి, కాళోజీ నారాయణ రావువంటి తెలంగాణ కవులు తెలంగాణ భాష యాసలు సాంస్కృతిక అస్థిత్వాల పట్ల తమ కవిత్వం రచనల ద్వారా ప్రజల్లోభావజాల వ్యాప్తి జరిపారు.
ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకో ముఖ్యవిషయం వున్నది. గమ్మతేందంటే…తెలంగాణను కలుపుకోవాలనే కుట్రలో భాగంగా తెలుగుతల్లి గురించి ప్రచారం చేసిన ఆంధ్రా నాయకత్వం వారి ప్రాంతంలోని 13 జిల్లాల్లో ఎక్కడా వొక్క తెలుగుతల్లి ని కూడా ఏర్పాటు చేసుకోలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటికి కేవలం హైద్రాబాద్ లో వొకటి, మహబూబ్ నగర్ లో వొకటి కేవలం రెండే తెలుగు తల్లి విగ్రహాలుండేవి. అంతగా తెలుగుతల్లి గురించి తపిస్తున్న మీరు విగ్రహాలెందుకు పెట్టుకోలేదని అక్కడి ప్రాంత కవులను రచయితలను నేను నిలదీసిన. దాంతో అప్రమత్తమైనా నాటి ఉమ్మడి పాలకులు తిరుపతిలో తెలుగుతల్లి పేరుతో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కాగా విజయవాడలో వున్న విగ్రహాన్ని చాలామంది తెలుగుతల్లి అనుకుంటారు కానీ ఆ విగ్రహం కృష్ణవేణి. కృష్ణమ్మ నదీ తల్లి విగ్రహం.
అట్లా మలి దశ ఉద్యమ సమయంలో తెలంగాణ అస్తిత్వ సోయి మరోసారి ముందకు వచ్చింది.
ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు తల్లి తెలంగాణకు చేసిన మేలేంది అంటూ వొక సందర్భంలో విలేకరులడిగిన ప్రశ్నలకు నేను ఘాటైన సమాధానం చెప్పిన. నీను వ్యూహాత్మకంగా చెప్పిన ఈ సమాధానం.. తెలంగాణ ప్రజల్లో అస్తిత్వ భావనకు వూపిరి పోసింది. మా ప్రాంతం బాగుకోరే మా క్షేమం కోరే మన తల్లి మనకు వుండాలె అని ప్రజలు ముందుకు వచ్చిన్రు. వొక ప్రాంత ప్రజల అస్థిత్వానికి చిహ్నంగా వుండాల్సిన తల్లి రూపం దివ్యంగా భవ్యంగా భగవత్ స్వరూపంగా వుండాలె కదా…ప్రజలు చూడగానే చేతులెత్తి నమస్కరించుకునే విధంగా వుండాలె. ఇది మన సంప్రదాయం. అట్లా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మలి దశ తెలంగాణ ఉద్యమంలో అనివార్యంగా అస్థిత్వభావన ముందుకు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ తల్లి రూపానికి అంకురార్పణ జరిగింది. అనేక మంది మేధావులు కవులు కళాకారులు వేలాది గంటల పాటు చర్చించి శ్రమించి తెలంగాణ చారిత్రక సాంస్కృతిక సామాజిక నేపథ్యంలోంచి వొక రూపాన్ని తీర్చిదిద్దుకున్నాం. 2007 లో తెలంగాణ తల్లి రూపాన్ని తీర్చిదిద్దుకుని వేలాది ఉద్యమకారులు ప్రజలు పాల్గొని ఏనుగులు వొంటెలతో వొక తిరునాల్లలో దేవత ఊరేగింపు మాదిరిగా తోడ్కొని తెలంగాణ భవన్ లో స్తాపించుకున్నాం. నాటి సమైక్య పాలకుల మరిపింపులో మరిచిపోయిన తెలంగాణ ప్రతీకలను తెలంగాణ ఉద్యమ సమయంలో పునరుజ్జీవింప చేసుకోవడానికి నిలుపుకున్న మాతృరూపమే తెలంగాణ తల్లి. ఇదీ తెలంగాణ తల్లి ఆవిర్బావ చరిత్ర.’’’ అని కేసీఆర్ వివరించారు.
‘‘ ఈ చారిత్రక నేపథ్యం తెలంగాణ సాంస్కృతిక వారసత్వం గురించిన కనీస సోయిలేని నేటి కాంగ్రేస్ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ ఆనవాల్లు లేకుండా చేస్తామనే తలతిక్క ఆలోచనలతో తెలంగాణ అస్తిత్వానికి మచ్చ తెచ్చే ప్రమాదాన్ని తెస్తున్నారు.ఇది వొక పద్దతి పాడులేని ముఖ్యమంత్రి అనుసరిస్తున్న తిర్రి మొర్రి వ్యవహారం. మూర్ఖపు వైఖరికి నిదర్శనం’’ అని దుయ్యబట్టారు.
కాగా ఇదే విషయం పై తనను ప్రభుత్వం ఆహ్వానించడం పై కేసీఆర్ స్పందించారు. ‘‘ నన్ను ఆహ్వానించడం వెనక కోణం ఏదున్నా…వారి ఉద్దేశ్యం ఏదయినా… మన ఇంటికి అతిథులు వస్తే మర్యాదచేస్తం గౌరవిస్తం. అదే పద్దతిలో వచ్చిన మంత్రిని వారి వెంట వచ్చిన వారికి భోజనం పెట్టి సాదరంగా గౌరవించి పంపినం. ఇది తెలంగాణ సంప్రదాయం.’’ అని వివరించారు.
కేసీఆర్ ఆనవాల్లు చెరపాలనుకోవడం మూర్ఖత్వం :
కేసీఆర్ ఆనవాల్లు లేకుండా చేస్తానని విర్రవీగుతున్న ముఖ్యమంత్రి.. యాదాద్రి పవర్ ప్లాంట్ ను ప్రారంభించారని, అది కేసీఆర్ వేసిన ఆనవాలు అని తెల్వదా అని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల కరెంటు కష్టాలను తీర్చడానికి నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం దార్శనికతతో నిర్మాణం ప్రారంభించిన యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రారంభం కావడం పట్ల కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. అటు ఎన్టీపీసీ ఇటు యాదాద్రితో మొత్తంగా 2400 మెగావాట్ల విద్యుత్తు అదనంగా అందుబాటులోకి వచ్చిందన్నారు. కనీసం ఇప్పుడైనా రైతులకు ప్రజలకు నిరంతరాయ నాణ్యమైన విద్యుత్తును అందించలేకపోవడం శోచనీయమన్నారు.
వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయడం పై అసెంబ్లీలో నిలదీయాలి : రాష్ట్రంలో అస్తవ్యస్తంగా మారిన వ్యవసాయ రంగం రైతు సంక్షేమం పట్ల కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నాటి ఉద్యమ సమయంలో.. ‘పల్లె పల్లెనా పల్లేర్లు మొలిసే..’ అని శోకం పెట్టిన నాటి ఉమ్మడి రాష్ట్రంలోని తెలంగాణ వ్యవసాయ రంగ దురవస్తను బిఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్ల అనతి కాలంలో దూరం చేసిందని కేసీఆర్ తెలిపారు. రైతును రాజును చేసే దిశగా వ్యవసాయం దాని అనుబంధ రంగాలను లక్షలాది కోట్ల రూపాయలతో తీర్చిదిద్దిన ఘనత దేశంలో కేవలం బిఆర్ఎస్ ప్రభుత్వానిదేనని వివరించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ….తెలంగాణ వ్యవసారంగం స్తిరీకరించబడాలె,,పరిపుష్టం కావాలె అనే విధానపరమైన నిర్ణయంతో రాష్ట్రంలో వ్యవసాయాభివ్రుద్ది రైతాంగ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశాం. రాష్ట్రంలోని ప్రతి వొక్క ఎకరం సాగులోకి తేవాలనే దార్శనికతతో, తెలంగాణ రైతు వ్యవసాయాన్ని వదలకుండా, ఖశ్చితంగా పంట పండించాలంటే రైతు కందించే ప్రోత్సాహకమే రైతుబంధు అని, అందుకోసమే ఎటువంటి పరిమితులను విధించకుండా, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త అశోక్ గులాటి వంటి పెద్దల సూచనలతోనే.. రైతుబంధు పథకాన్ని అమలు చేశాం.’’ అని తెలిపారు. అటువంటి రైతుబందును ఇంకా పెంచుతాం అని రైతులకు ఆశలు పెట్టి వున్నదాన్ని ఎగ్గొడుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీయాలని కేసీఆర్ సూచించారు.
‘‘ వ్యవసాయాన్ని స్థిరీకరించడానికి పటిష్టమైన విధానాల అమలు చేశాం. అందులో ముఖ్యమైనవి…ఉచితంగా పంట పెట్టుబడి అందించడం.,ఉచితంగా విద్యుత్తును అందించడం…ఉచితంగా సాగునీరు అందించడం..పండిన పంటలను ప్రభుత్వమే బాధ్యత వహించి గిట్టుబాటు ధరకు సేకరించడం…రైతులకు బీమాను అమలు చేయడం..మార్కెటింగ్ వ్యవస్థలను బలోపేతం చేయడం..రైతు వేదికలను నిర్మించడం…క్లస్టర్లను ఏర్పాటు చేసి వాటికనుగుణంగా ఏఈవో లను నియమించడం..కల్తీ విత్తనాలను అరికట్టడం..సకాలంలో ఎరువులను అందించడం…రుణమాఫీ చేసి రైతును ఆర్థింకంగా భారం తగ్గించడం, వంటి…రైతు ధీమా రైతుబీమా కార్యక్రమాల ద్వారా రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని స్థిరీకరించాం. తద్వారా తెలంగాణ వ్యవసాయం రంగం రైతు సంక్షేమ రంగంలో తెలంగాన దేశానికే తలమానికంగా నిలిచింది. అట్లా కడుపుల సల్ల కదలకుండా పిల్లా పాపలతో సుఖంగా బతుకుతున్న రైతులకు లేని పోని ఆశలు కల్పించి వాల్లను ఇవ్వాల రాష్ట్ర ప్రభుత్వం గోసపెడుతున్నద’’ని విమర్శించారు.