
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు వైఎస్ జగన్. కాశీనాయన క్షేత్రం విషయంలో… పవన్ ఏం చేయారని సూటిగా ప్రశ్నించారు. కూల్చివేతలు జరుగుతుంటే ఎందుకు ఆపలేదు..? సతాతన ధర్మ పరిరక్షణ అంటే ఇదేనా..? అంటూ విమర్శల వర్షం కురిపించారు.
అన్నమయ్య జిల్లా అటవీ ప్రాంతంలోని కాశీనాయన క్షేత్రంలో కూల్చివేతలు రాజకీయ రగడకు కారణమయ్యాయి. అటవీశాఖా మంత్రి పవన్ కళ్యాణ్ అయినా… కూల్చివేతలకు మంత్రి లోకేష్ సారీ చెప్పడం కూడా వివాదాస్పదమైంది. పైగా పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం.. వ్యతిరేకతకు దారితీసింది. ఇప్పడు ఈ అంశంపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కూడా పవన్‌కు కౌంటర్ ఇచ్చారు. సుదీర్ఘమైన ట్వీట్ చేస్తూ.. ఎన్నో ప్రశ్నలను లేవనెత్తారు జగన్.
వైసీపీ హయాంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసిందని చెప్పారు వైఎస్ జగన్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత… అరాచకం ఎక్కువైందని ఆరోపించారు. కాశీనాయన క్షేత్రంలో జరిగిన కూల్చివేతలు, రాష్ట్రంలోని ఆలయాలు, హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులు ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యాలని అన్నారు. దీన్ని భట్టిచూస్తే… దేవుడు అంటే భయం, భక్తి ఎవరికి ఉందో..? ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లిందో… ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారో… ప్రజలకు అర్థమవుతుందని చెప్పారు జగన్.
అటవీ ప్రాంతంలోని కాశీనాయన క్షేత్రంలో నిర్మాణాల నిలిపివేత, తొలగింపుపై 2023, ఆగస్టు 7ఏన కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఆదేశాలు ఇచ్చినా… ఆ క్షేత్ర పరిరక్షణకు వైసీపీ ప్రభుత్వం నడుంబిగించిందని చెప్పారు జగన్. కాశినాయన క్షేత్రం ఉన్న 12.98 హెక్టార్ల భూమిని అటవీశాఖ నుంచి మినహాయించాలని.. 2023, ఆగస్టు 18న…. అప్పటి కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌గారికి లేఖరాశానని చెప్పారు జగన్. తమ ప్రయత్నాలతో కేంద్రం తన చర్యలను నిలిపేసిందని చెప్పారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో కాశీనాయన క్షేత్రానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోలేదన్నారు. ఆలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాల పరిరక్షణపై తమకు ఉన్న చిత్తశుద్ధికి అదొక నిదర్శమని చెప్పారు జగన్.
ఇక.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలల నుంచే కాశీనాయన క్షేత్రంలో ఏం జరిగిందో రాష్ట్రమంతా చూస్తోందన్నారు జగన్. ఆ క్షేత్రంపైకి బుల్డోజర్లను పంపి నిర్మాణాలు కూల్చివేశారన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో, డిప్యూటీ సీఎం పర్యవేక్షణలో ఉన్న పర్యావరణ, అటవీశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇచ్చిన ఉత్తర్వులతోనే ఈ కూల్చివేతలు జరిగాయని ఆరోపించారు. ఆధ్యాత్మిక క్షేత్రాలపై అధికారులు అహంకారంతో చేసిన దాడులకు ఇవే ఆధారాలని చెప్పారు జగన్. దీనికి కూటమి ప్రభుత్వం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్తారని నిలదీశారు జగన్. కూల్చివేత ఉత్తర్వులు ఇచ్చి, కాశినాయన క్షేత్రాన్ని కూల్చేసి.. ఆ తర్వాత వాతలు పెట్టి వెన్నపూస రాసినట్టు మాటలు చెప్తున్నారని మండిపడ్డారు వైసీపీ అధినేత.