Haryana Woman Doctor Detained: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కారు బ్లాస్ట్ కేసులో రోజు రోజుకు దిగ్భ్రింతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తు చేస్తున్నా కొద్దీ పలువురు డాక్టర్లతో ఈ ఘటనకు లింకులు ఉన్నట్లు బయటపడుతోంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి హర్యానాకు చెందిన లేడీ డాక్టర్ ప్రియాంక శర్మను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే జైషే మహ్మద్, అన్సార్ గజ్ వత్ ఉల్ హింద్ అనే ఉగ్రసంస్థలతో సంబంధమున్న అదీల్ అహ్మద్, ముజమ్మిల్ షకీల్, షాహిన్ అనే ముగ్గురు డాక్టర్లు ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. వారిలో ఒకరైన అదీల్ అహ్మద్ తో ప్రియాంక శర్మకు పరిచయం ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
జమ్మూకాశ్మీర్ లో ప్రియాంక శర్మ అరెస్ట్
ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న టెర్రర్ డాక్టర్లు ఇచ్చిన కీలక సమచారం మేరకు జమ్ముకాశ్మీర్ అనంత్ నాగ్ లో హాస్టల్ లో ఉంటున్న ప్రియాంక ను అరెస్ట్ చేశారు. ఆమె మొబైల్ ఫోన్, సిమ్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. మొబైల్, సిమ్ కార్డు ద్వారా మరింత సమాచారం తెలిసే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి దాదాపు 200 మంది కాశ్మీర్ వైద్యుల మీద పోలీసులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లోని కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో చదువున్న కశ్మీర్ విద్యార్థులపైనా నిఘా కొనసాగిస్తున్నారు.
డాక్టర్ ఉమర్ నబీ సహచరులపై నిఘా
అటు ఢిల్లీలో పేలుడుకు కారణమైన ఐ20 కారు నడిపిన వ్యక్తిని డాక్టర్ ఉమర్ నబీగా నిఘా సంస్థలు గుర్తించాయి. అతడితో సంబంధమున్న మరో ఐదుగురు వైద్యులను అదుపులోకి తీసుకున్నారు. వారందరికీ ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు విచారణలో గుర్తించారు. వారితో కలిసి చదువుకున్న, పని చేస్తున్న ఇతర వైద్యులపైనా అధికారులు నిఘా పెట్టారు. ఉగ్ర కుట్రలో ఫరీదాబాద్ అల్ ఫలా యూనివర్సిటీ సిబ్బంది పాత్ర ఉండడం, నిందితులకు సంబంధించిన మరో కారు కూడా అక్కడే లభ్యం కావడంతో క్యాంపస్ ను భద్రతా బలగాలు తమ ఆధీనంలోక తీసుకున్నాయి. అక్కడే చదివిన మరో ఇద్దరినీ ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.





