
క్రైమ్ మిర్రర్, పొలిటికల్ బ్యూరో : గులాబీ పార్టీలో సీఎం రమేష్ వ్యాఖ్యలు గుబులు రేపాయా…? ఒక సామాజికవర్గం మొత్తాన్ని బీఆర్‌ఎస్‌కు దూరం చేస్తున్నాయా…? ఈ ఎఫెక్ట్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై పడుతుందా..? ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు గులాబీ పార్టీ ఏం చేయబోతోంది…? అసలు సీఎం రమేష్ ఏమన్నారు..? ఆయన వ్యాఖ్యల వెనుక వ్యూహమేంటి…?
బీజేపీలో బీఆర్‌ఎస్‌ను విలీనం చేసే ప్రయత్నాలు జరిగాయని ఏపీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితతోపాటు… బీఆర్‌ఎస్ నేతలపై ఎంక్వైరీలు ఆపేస్తే.. బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తామంటూ కేటీఆర్ తన దగ్గరకు వచ్చారని సీఎం రమేష్ అన్నారు. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ప్రూఫ్ కూడా ఉందని చెప్పారు. అంతేకాదు… కమ్మ వాళ్లను బీఆర్‌ఎస్ దూరం పెట్టిందని… తుమ్మలను కూడా అందుకే వదిలించుకున్నామని కేటీఆర్ చెప్పినట్టు హాట్ కామెంట్స్ చేశారు సీఎం రమేష్. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో అగ్గి రాజేశాయి. సీఎం రమేష్ వ్యాఖ్యలను కేటీఆర్ ఖండించకపోవడం… గులాబీ పార్టీని మరింత ఇబ్బందుల్లో నెడుతోంది. అయితే… సీఎం రమేష్.. ఇప్పుడే ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు..? అన్నదే ఇక్కడ ప్రశ్న.
జూబ్లీహిల్స్ బైపోల్… త్వరలో జరగబోతోంది. జూబ్లీహిల్స్‌లో కమ్మ ఓటర్లు ఎక్కువ. ఈ సమయంలో… బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఏపీ ఎంపీ సీఎం రమేష్ హాట్ కామెంట్స్ చేశారు. అంటే… జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్ ఓటమిని… ఆయన కోరుకుంటున్నారు. అది ఆయన వ్యక్తిగతమా…? లేక… ఏపీలో కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు కోసమా..? అన్న చర్చ కూడా జరుగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి… చంద్రబాబుకు శిష్యుడని బీఆర్‌ఎస్ పదేపదే ఆరోపణలు చేస్తోంది. అంతేకాదు… సీఎం రమేష్.. ఒక్కప్పుడు చంద్రబాబుకు విశ్వాసపాత్రుడు. దీనికి… జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ… బీఆర్‌ఎస్‌పై సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలకు ఏమైనా లింక్ ఉండొచ్చా..? అన్న అనుమానాలు కొందరికి కలుగుతున్నాయి. ఇందులో నిజం ఉందో లేదో గానీ… ఉపఎన్నిక వేళ.. సందర్భం లేకుండా… బీఆర్‌ఎస్‌ను డ్యామేజ్ చేసే వ్యాఖ్యలు… అది కూడా ఒక ఏపీ ఎంపీ చేయడమే.. కాస్త ఆలోచించాల్సిన విషయం.
ఇది అటుంచితే… సీఎ రమేష్ వ్యాఖ్యలను కేటీఆర్ ఎందుకు ఖండించడంలేదు..? సీసీ ఫుటేజ్ ఉందన్న సీఎం రమేష్.. దాన్ని ఎందుకు బయటపెట్టడం లేదు..? ఈ విషయంలో ఇలా ఎన్నో అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు ఎన్ని ఉన్నా… ఆరోపణలు అంటూ వచ్చాక… విమర్శలను ఎదుర్కోకతప్పదుగా. సీఎం రమేష్ వ్యాఖ్యలను హైలెట్ చేస్తూ… తెలంగాణ మంత్రులు బీఆర్‌ఎస్‌ను టార్గెట్ చేస్తున్నారు. సీఎం రమేష్ ఆరోపణలపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక పోతే.. బీఆర్‌ఎస్ నేతలు కొందరు.. ఈ డ్యామేజ్‌ని కాస్తైనా కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక టికెట్‌ను కమ్మ సామాజిక వర్గం నేతకే ఇస్తామంటున్నారు గులాబీ పార్టీ నేతలు. అంతేకాదు.. ఎన్టీఆర్ తర్వాత కేసీఆర్ హయాంలో కమ్మ సామాజికవర్గానికి ప్రాధాన్యం దక్కిందని చెప్పుకుంటున్నారు. తుమ్మలను వదిలించుకోలేదని… ఓడిపోయినా ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. మొత్తం.. సీఎం రమేష్ ఏ పరమార్థంతో ఈ వ్యాఖ్యలు చేశారో… ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో…? చూడాలి.