తెలంగాణ

రాష్ట్ర వ్యాప్తంగా జోరు వానలు, టెక్మాల్‌ లో 19.1 సెం.మీ వర్షపాతం

Telangana Rains: రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని హైదరాబాద్‌ లో కుండపోతగా వానలు పడుతున్నారు.   లింగంపల్లి, మియాపూర్‌, కుత్బుల్లాపూర్‌, గచ్చిబౌలి, మాదాపూర్‌, కొండాపూర్‌, రాయదుర్గం, జూబ్లీహిల్స్‌, అమీర్‌ పేట, నాంపల్లి, దిల్‌ సుఖ్‌ నగర్‌, ఎల్బీనగర్‌, హయత్‌ నగర్‌, మేడ్చల్‌, శామీర్‌ పేట్‌ తదితర ప్రాంతాల్లో రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు, రాజపేట, మోటకొండూర్‌, తుర్కపల్లి, బొమ్మలరామారంలో వర్షం కురుస్తోంది. భువనగిరి మండలం నందనంలో భారీ వర్షం కురిసింది. సింగిరెడ్డిగూడెం రైల్వే అండర్‌ పాస్‌ బ్రిడ్జి వద్ద భారీగా వర్షపు నీరు నిలిచింది.

నీట మునిగిన కామారెడ్డి

ఇక వికారాబాద్ జిల్లాలోని కోట్‌ పల్లి ప్రాజెక్టు అలుగుపోయడంతో భారీగా వరద ప్రవహిస్తోంది. చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. దోమకొండ, బీబీపేట, మాచారెడ్డి, బిక్కనూర్‌, పాల్వంచ, పిట్లం, నిజాంసాగర్‌, భిక్కనూరు, లింగంపేటలో వర్షం పడుతోంది. ఎల్లారెడ్డి మండలం లక్ష్మాపూర్‌ వద్ద కల్వర్టు తెగింది. దాంతో రోడ్డు దెబ్బతిని ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. కామారెడ్డి భారీ వరదలకు నీట మునిగింది. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌, మిరుదొడ్డి, తొగుట, దుబ్బాక, దౌల్తాబాద్‌ లో వర్షం కురుస్తోంది. మంజీరా నదికి భారీగా వరద రాబోతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మెదక్‌ జిల్లా టెక్మాల్‌ లో అత్యధికంగా 19.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌లో 18 సెం.మీ, సంగారెడ్డి జిల్లా నిజాంపేట్‌ లో 16.48 సెం.మీ, యాదాద్రి జిల్లా భువనగిరిలో 14.93 సెం.మీ, మహబూబ్‌ నగర్‌ లోని భూత్పూర్‌ లో 9 సెం.మీ వర్షపాతం నమోదైంది.

ఇవాళ కూడా భారీ వర్షాలు

అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో ఇవాళ విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button