* శ్రీరామ నవమి నాడే ముందడుగు
* పోటీ చేయబోయే నియోజకవర్గం సైతం ఫిక్స్
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కొత్త పార్టీ ఆవిర్భవించనుందా? కల్వకుంట కవిత కొత్త పార్టీని ప్రకటించనున్నారా? అందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యిందా? శ్రీరామనవమి సందర్భంగా కొత్త పార్టీని ప్రకటించనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. గులాబీ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు కవిత. ఈ తరుణంలో సొంత పార్టీని ప్రకటించేందుకు సిద్ధపడ్డారు. తన తెలంగాణ జాగృతిని.. తెలంగాణ ప్రజా జాగృతిగా మార్చి పొలిటికల్ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేశారు. అయితే అందుకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 27న శ్రీరామనవమి సందర్భంగా పార్టీని ప్రకటిస్తారని సమాచారం. అయితే అందుకు వేదికగా నిజామాబాద్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. శ్రీరామనవమి నాడు ఉదయం ఎనిమిది గంటలకు తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ ప్రకటన చేస్తారని తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ ప్రారంభం అయింది. పార్టీ సింబల్ తో పాటు విధివిధానాలను సైతం ప్రకటిస్తారని సమాచారం. తాను పోటీ చేయబోయే నియోజకవర్గంపై కూడా ఆమె స్పష్టత ఇస్తారని జాగృతి వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణ ప్రజా జాగృతి..
తెలంగాణ జాగృతి పేరిట ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి తనకంటూ ఉనికి చాటుకున్నారు కవిత. తన తండ్రి గులాబీ పార్టీ ద్వారా రాజకీయాలు చేస్తూ వచ్చారు. కానీ ఆ పార్టీ విధానాలను విభేదిస్తూ గళం ఎత్తారు. ఈ క్రమంలోనే ఆమె సస్పెన్షన్కు గురయ్యారు. అయితే తాను స్థాపించిన తెలంగాణ జాగృతిని పొలిటికల్ పార్టీగా తీర్చిదిద్దారు. తెలంగాణ ప్రజా జాగృతిగా ప్రజలకు పరిచయం చేస్తూ సరికొత్త రాజకీయ పార్టీగా తీర్చిదిద్దాలని భావించారు. ఈనెల 27న శ్రీరామనవమి సందర్భంగా నిజామాబాదులో ఉదయం 8 గంటలకు తన పార్టీని అధికారికంగా ప్రకటించనున్నారు. తెలంగాణలో రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కవిత ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
తెలంగాణ అస్తిత్వమే టార్గెట్..
తెలంగాణ అస్తిత్వంతో పాటు అభివృద్ధిని టార్గెట్ చేసుకుని కవిత పార్టీ పని చేయనున్నట్లు సమాచారం. పార్టీని ప్రకటించడమే కాదు తన రాజకీయ వ్యూహాన్ని సైతం కవిత అదే వేదిక నుంచి వెల్లడిస్తారని తెలుస్తోంది. తెలంగాణ జాగృతి పేరిట ఇప్పటివరకు కార్యకలాపాలు చేశారు కవిత. దానిని ప్రజా జాగృతి పార్టీగా మార్చి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు రాజకీయంగా ముందడుగు వేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ పేరుతో పార్టీ నమోదు కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు ఢిల్లీ హైకోర్టులోను వీలైనంత త్వరగా ఎన్నికలు కమిషన్ గుర్తించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ ప్రజా జాగృతి పార్టీలో యువతకు, తెలంగాణ ఉద్యమకారులకు పెద్దపీటవేసేలా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మహిళలకు పెద్దపీట..
ఇప్పటికే తెలంగాణ జాగృతి తనకంటూ ఉనికి చాటుకుంది. తెలంగాణ మహిళా సమాజంలో ప్రత్యేక గుర్తింపు సాధించింది. అందుకే ఇప్పుడు పొలిటికల్ పార్టీ ద్వారా మహిళలకు కూడా పెద్దపీట వేయాలని చూస్తున్నారు కవిత. ఒకవైపు యువత, మరోవైపు మహిళలు,, ఇంకో వైపు ఉద్యమకారులు అన్నట్టు కవిత తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అయితే కవిత ప్రయాణం ప్రారంభించిన నేపథ్యంలో తప్పకుండా గులాబీ పార్టీపై ఆ ప్రభావం ఉంటుంది. కానీ తెలంగాణను సాధించడమే కాదు రెండుసార్లు తెలంగాణను పాలించింది గులాబీ పార్టీ. అయితే మారిన పరిణామాల క్రమంలో ఆ పార్టీ వెనుకడుగు వేసింది. దానిని అందిపుచ్చుకునేందుకు కవిత ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ఎంతవరకు వర్కౌట్ అవుతారో చూడాలి.
