
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ కు బిగ్ రిలీఫ్ దక్కింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలో ఈ ముగ్గురు నేతలకు కాళేశ్వరం కమిషన్ ఊరటనిచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ విచారణ దాదాపు పూర్తయింది. వచ్చే వారంలో కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. విచారణ పూర్తి చేసిన కమిషన్.. దాదాపు 400 పేజీల రిపోర్ట్ ను సిద్ధం చేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రతిపాదనల దశ నుంచి మేడిగడ్డ కుంగుబాటు తర్వాత 2023 డిసెంబర్ వరకు జరిగిన ప్రతి అంశాన్ని రికార్డు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఆర్థికమంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్ ను విచారించకూడదని కమిషన్ భావిస్తోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. వీళ్ల ముగ్గురిని కూడా విచారణకు కమిషన్ పిలుస్తుందని భావించారు. అయితే విచారణకు పిలవకుండా లిఖిత పూర్వక స్టేట్ మెట్ తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికను కేవలం రిఫరెన్సులుగా మాత్రమే కమిషన్ పరిగణించినట్లు సమాచారం. కమిషన్ స్వతంత్రంగా దర్యాప్తు చేసిన వివరాలే ఈ రిపోర్టులో కీలకంగా ఉండనున్నాయి. లక్ష కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో మొదటి నుంచీ జరిగిన అన్ని విషయాలు పొందుపరిచినట్లు తెలిసింది.
మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగిపోవడంతో … 2024 మార్చి 12న జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలో కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 14 నెలల పాటు విచారణ కొనసాగింది. 6 సార్లు కమిషన్ గడువును సర్కారు పొడిగించింది. మొదట 100 రోజుల్లో అంటే 2024 జూన్ 20వరకు రిపోర్ట్ ఇవ్వాలని గడువు విధించింది. ఇటీవల మరోసారి గడువును ఈ నెల 31 వరకు పొడిగించింది. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లు, డ్రాయింగులు, బ్యారేజీల స్థలాల మార్పులో గత ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉన్నట్లు కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్‌లో తేలింది. క్షేత్రస్థాయి ఇంజినీర్లకు ఒక విషయం చెప్పి, పైస్థాయి ఇంజినీర్లకు మరో విషయం చెప్పి గందరగోళం సృష్టించారని, తమకు నచ్చినట్లుగా బ్యారేజీల డిజైన్లు, డ్రాయింగులు, నిర్మాణ ప్రాంతాలను మార్చుకున్నారని కమిషన్ దృష్టికి తెచ్చారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కంప్రోల్టర్ అండ్ ఆడిటర్ జనరల్ – కాగ్ లేవనెత్తిన అంశాలు, విజిలెన్స్, ఎన్డీఎస్ఏ రిపోర్టులను కూడా పరిశీలించింది. అయితే వాటిని రిఫరెన్స్ లుగానే తీసుకున్నట్లు తెలిసింది. బ్యారేజీలు, పంప్ హౌజ్ ల నిర్మాణం లోనూ భారీగా అవకతవకలు జరిగాయని కమిషన్ దృష్టికి వచ్చింది. పంప్‌హౌజ్ మోటర్లలో వేల కోట్ల రూపాయాల అవినీతి జరిగినట్లు కంప్లయింట్స్ అందాయి.