తెలంగాణ

కాళేశ్వరం కనుమరుగు.. ప్రాణహిత-చేవెళ్లకే పట్టం..!

క్రైమ్ మిర్రర్, కాలేశ్వరం :- కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కనుమరుగు కాబోతోందా…? ఆ ప్రాజెక్టును పూర్తిగా పక్కనపెట్టేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం భావిస్తోందా..? అంటే అవుననే అనిపిస్తోంది. దాదాపు లక్ష కోట్ల రూపాయలతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును సైడ్‌ చేసి… ప్రాణహిత-చేవెళ్లను మళ్లీ పట్టాలెక్కించాలని రేవంత్‌ సర్కార్‌ ఆలోచిస్తోంది. అందుకు లైన్‌ క్లియర్‌ చేసుకుంటుంది. అన్నీ వర్కౌట్‌ అయితే… త్వరలోనే ప్రాజెక్ట్‌ పనులు కూడా ప్రారంభంకానున్నాయి.

Read also : తప్పు తెలుసుకున్నా.. ఆ పొరపాటు మళ్లీ చేయనన్న జగన్‌!

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భారీగా అవినీతి జరిగిందని… ఎన్నికల ముందు నుంచి ఆరోపిస్తోంది కాంగ్రెస్‌ పార్టీ. అధికారంలోకి వచ్చాక ఊరుకుంటుందా.. ఆ ప్రాజెక్ట్‌లో జరిగిన అక్రమాల విచారణ జరిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో నాణ్యత లోపం ఉందని… ప్రధానమైన మూడు బ్యారేజ్‌లు దెబ్బతిన్నాయని అంటోంది సర్కార్‌. మిగిలిన బ్యారేజీలు కూడా సేఫ్‌ కాదని… రిపేర్లకు డబ్బులు పెట్టినా వృథానే అని భావిస్తోంది. అందుకే.. ఆ ప్రాజెక్టును పక్కనపెట్టి ప్రాణహిత-చేవెళ్లను నిర్మిస్తామని ప్రకటించింది. బ్యారేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. రివైజ్డ్‌ డీపీఆర్‌ తయారుచేయాలని చెప్పారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్‌ నిర్మాణంపై త్వరలోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడతానని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి కూడా ప్రకటించారు. రేవంత్‌రెడ్డి మహారాష్ట్ర పర్యటనకు షెడ్యూల్‌ సిద్ధం చేయాలని కూడా అధికారులను ఆదేశించారు మంత్రి ఉత్తమ్‌.

Read also : గులాబీ గలగల.. అత్యంత ధనిక పార్టీ అదే!

తుమ్మిడిహెట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తులో బ్యారేజ్‌ నిర్మాణం చేపట్టాలనుకోగా… మహారాష్ట్ర ప్రభుత్వం 148 మీటర్ల ఎత్తులో కట్టుకునేందుకు అంగీకరించిందని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే చెప్పారు. అయితే… మళ్లీ ఆ ప్రభుత్వంతో మాట్లాడి 149 లేదా 150 మీటర్లను ఒప్పిస్తామన్నారు. తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజీ నిర్మాణం పూర్తయితే.. ఆదిలాబాద్‌ జిల్లాలో రెండు లక్షల ఎకరాల వరకు నీరు అందించవచ్చని చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి. ఈ ప్రాజెక్టు కోసం కొత్తగా డీపీఆర్‌ సిద్ధం చేసి… మహారాష్ట్ర నుంచి అనుమతులు తీసుకోవాలని భావిస్తోంది.

Read also : శ్రీశైలం వెళ్తున్నారా.. అయితే ఇవి తప్పక పాటించాల్సిందే?

148 మీటర్ల ఎత్తులో బ్యారేజ్‌ నిర్మాణం జరిగితే… తుమ్మిడిహెట్టి నుంచి నెన్నెల మండలం మైలారం వరకు 71 కిలోమీటర్లు నీటిని తీసుకెళ్లొచ్చు. అది కూడా విద్యుత్‌ అవసరం లేకుండా. అక్కడ చిన్న లిఫ్ట్‌ ఏర్పాటు చేసుకుంటే… ఎల్లంపల్లికి నీరు చేర్చొచ్చు. ఎల్లంపల్లి లెవల్‌ 128 మీటర్లు. దీంతో.. ప్రాణహిత నీటిని అక్కడి పెద్ద ఖర్చు లేకుండా తరలించొచ్చు. ఇదే ప్రభుత్వం ఆలోచన. ఇరిగేషన్‌ ఎక్స్‌పర్ట్స్‌ కూడా అదే చెప్తున్నారు. కాల్వలు తీస్తే.. చాలా నీటిని తరలించొచ్చని. పైగా గతంలోనే 70శాతానికి పైగా కాల్వలు పూర్తయ్యాయి. మిగిలిన 30 శాతం పూర్తిచేస్తే చాలని అంటున్నారు. అంటే.. అతి తక్కువ ఖర్చుతో ప్రాణహిత నీరు ఎల్లంపల్లి వరకు చేరుతుందన్నది వారి అంచనా. అక్కడి నుంచి నీటిని… సాగు, తాగు అవసరాల కోసం జిల్లాలకు తరలించొచ్చన్నది ప్రణాళిక. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే త్వరలోనే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్‌ పట్టాలెక్కడం ఖాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button