
కేఏ పాల్… ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు. ఆయన గురించి… ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందరికీ తెలిసే ఉంటుంది. వింత చేష్టలతో… విచిత్ర ప్రవర్తనలతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అదే చేశారు. టర్కీ వెళ్లేందుకు ముంబై ఎయిర్‌పోర్టుకు వెళ్లిన కేఏ పాల్ నానా హంగామా చేశారు. అసలు కేఏ పాల్ టర్కీ ఎందుకు వెళ్లాలనుకున్నారు…? ఆయన్ను ఎయిర్‌పోర్ట్ అధికారులు ఎందుకు అడ్డుకున్నారు…?
కేఏ పాల్… ఎప్పుడు మాట్లాడినా తాను ప్రపంచమంతా తిరుగుతానని… అన్ని దేశాధ్యక్షులతో తనకు మంచి పరిచయాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. ఈ క్రమంలో భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు కేఏ పాల్. చెప్పినట్టుగానే నిన్న టర్కీ బయల్దేరారు. కానీ… ఎయిర్‌పోర్టు సిబ్బంది అడ్డుకున్నారు. తన దగ్గర వీసా, విమాన టికెట్లు, పాస్‌పోర్ట్ అన్నీ ఉన్నా ఎందుకు అడ్డుకున్నారని వారితో వాగ్వాదానికి దిగారు కేఏ పాల్. నానా హంగామా చేశారు. ముంబై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు కేఏ పాల్, ఎయిర్‌లైన్స్ సీఈవోకి కూడా కంప్లెయింట్ ఇచ్చారు. తనను అడ్డుకున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇంతవరకు బాగానే ఉంది… అసలు.. కేఏ పాల్ టర్కీ ఎందుకు బయల్దేరారో తెలుసా..? భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గించేందుకట. ఈ విషయంపై తాను ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్, అమెరికా సెనేటర్లతో మాట్లాడానని చెప్పారు. ఇప్పుడు టర్కీ అధ్యక్షుడితో కూడా మాట్లాడేందుకు… ఆయన బయల్దేరారట. పాకిస్తాన్‌కు టర్కీ డ్రోన్లు సరఫరా చేస్తోంది. ఆ డ్రోన్లతో భారత్‌పై దాడి చేస్తోంది పాకిస్తాన్. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌తో మాట్లాడి.. పాకిస్తాన్‌కు డ్రోన్లు సరఫరా చేయకుండా ఆపుతానని.. అందుకోసమే చర్చల కోసం వెళ్తున్నట్టు చెప్పారు కేఏ పాల్. కానీ… తాను వెళ్లకుండా ఎయిర్‌పోర్టు సిబ్బంది అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం సాయంత్రమే రెండు దేశాలు సీజ్ ఫైర్‌కు అంగీకరించిన విషయం కేఏ పాల్‌కు తెలిసి ఉండకపోవచ్చు. అందుకే ఆయన టర్కీ బయలుదేరి ఉండొచ్చు. మొత్తంగా.. ముంబై ఎయిర్‌పోర్టులో కేఏ పాల్ చేసిన హంగామా… అంతా ఇంతా కాదు.