-
దశాబ్దాలుగా కెసిఆర్ పై పోరాటం
-
ఇప్పుడు అనుకోని రీతిలో ఆయన గొడుగు కిందకు
-
ఇద్దరు నేతల కలయిక ఒక భావోద్వేగం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: సుదీర్ఘకాలం కెసిఆర్ పై పోరాడారు సీనియర్ నేత జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ తెలంగాణ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కేసీఆర్ పై గట్టి యుద్ధమే చేశారు. కానీ అనుకోని రీతిలో అదే కెసిఆర్ చెంతకు చేరారు జీవన్ రెడ్డి. కొద్ది రోజుల కిందట కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని వదులుకొని మరి గులాబీ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు ఈ సీనియర్ నేత. ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో కెసిఆర్ ను కలిశారు. ఈ సందర్భంలోనే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దేవుడే నన్ను మీ వద్దకు పంపాడు అంటూ జీవన్ రెడ్డి కెసిఆర్ కు చెప్పారంటే ఆయన ఎంత భావోద్వేగానికి గురయ్యారు ఇట్టే అర్థం అవుతుంది.
-
పక్కన పెట్టిన పార్టీ..
కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాలుగా పనిచేశారు జీవన్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలోనే మంత్రిగా వ్యవహరించారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. ఆ సమయంలోనే ఎమ్మెల్యేగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. అయితే జగిత్యాల నియోజకవర్గంలో దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న తనను పక్కనపెట్టి.. గులాబీ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను ప్రాధాన్యత ఇవ్వడాన్ని తట్టుకోలేకపోయారు. ఎన్నో రకాల అభ్యంతరాలు చెప్పిన సీఎం రేవంత్ వినలేదు. అందుకే విధి లేక ఆయన గులాబీ పార్టీలో చేరిపోయారు. అయితే దశాబ్దం పాటు ఏ పార్టీతోనైతే పోరాటం చేశారో.. ఏ నాయకుడిపై పోరాడారో.. అదే నాయకుడి చెంతకు చేరడాన్ని ఆయన దేవుడిపై నెట్టారు. దానిని దైవ నిర్ణయం గా చెప్పారు.
-
అక్కున చేర్చుకున్న గులాబీ బాస్..
వాస్తవానికి జీవన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక అనేక రకాల కారణాలు ఉన్నాయి. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి వెన్నుముకలా ఉన్న తనను.. తన రాజకీయ జీవితాన్ని ముగించినంత పని చేయడాన్ని ఆయన తట్టుకోలేక పోయారు. ఇటువంటి సమయంలో తన చిరకాల ప్రత్యర్థి అయిన కెసిఆర్ వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీతో పాటు రేవంత్ పై పగ తీర్చుకోవాలని భావించారు. కెసిఆర్ స్వయంగా విందు ఇచ్చి ఆప్యాయంగా పలకరించడం వై జీవన్ రెడ్డి పొంగిపోయారు. పైగా పార్టీలో సెక్రటరీ జనరల్ వంటి అత్యున్నత హోదా లభించవచ్చని హామీ ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ తనను అగౌరవపరిస్తే.. గులాబీ పార్టీ తన విషయంలో గౌరవం ఇచ్చేందుకు సిద్ధపడటం కూడా జీవన్ రెడ్డిని ఆకర్షించింది. తనను అవమానించిన కాంగ్రెస్ పార్టీ కంటే.. అక్కున చేర్చుకున్న కేసీఆర్ నాయకత్వమే మేలు అన్న నిర్ణయానికి వచ్చారు జీవన్ రెడ్డి.
