
-క్యాతన్‌పల్లి 22 వార్డుల్లో పోటీకి సిద్ధం
-పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలే మా బలం : మంతెన సంపత్ కుమార్
రామకృష్ణాపూర్,(క్రైమ్ మిర్రర్):-రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో జనసేన పార్టీ పోటీకి సిద్ధమైందని ఆ పార్టీ ఉమ్మడిజిల్లా కో-ఆర్డినేటర్ మంతెన సంపత్ కుమార్ వెల్లడించారు. ఆదివారం క్యాతనపల్లిలో జిల్లా జనసేన నాయకులు అర్చనపల్లి చరణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్యాతనపల్లి మున్సిపాలిటీలోని మొత్తం 22 వార్డుల్లో జనసేన అభ్యర్థులను బరిలోకి దింపుతున్నట్లు తెలిపారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా జనసేన పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఇప్పటికే పార్టీ క్యాడర్, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రచారానికి సిద్ధంగా ఉన్నారని, గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. సింగరేణి కోల్‌బెల్ట్ ప్రాంతమైన క్యాతనపల్లిలో జనసేనకు ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తోందని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో ‘గాజు గ్లాసు’ గుర్తుపై ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. క్యాతన్‌పల్లితో పాటు రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా జనసేన అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నట్లు తెలిపారు. స్థానిక అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన అజెండాగా ముందుకు సాగుతామని నాయకులు వెల్లడించారు. ఈ ఎన్నికల ద్వారా క్యాతనపల్లి మున్సిపాలిటీలో రాజకీయ మార్పుకు నాంది పలుకుతామని పిలుపునిచ్చారు.
Read also : ఘనంగా ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు
Read also : తారక రామారావు వర్ధంతి.. సీఎం ట్వీట్ వైరల్?





