
క్రైమ్ మిర్రర్, అమరావతి బ్యూరో : కూటమి సర్కార్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు వైఎస్ జగన్. వైసీపీ నేతలకు కొండంత ధైర్యాన్ని ఇచ్చేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. సరికొత్త యాప్‌ను పరిచయం చేస్తున్నారు. వేధిస్తే వదలొద్దనే సంకేతాలను… పార్టీ క్యాడర్‌లోకి పంపారు. దీంతో… వైసీపీ కార్యకర్తల్లో ఫుల్ జోష్ వచ్చినట్టు అయ్యింది. మా జోలికి వస్తే… అధినేత చూసుకుంటాడన్న ధీమాతో ఉన్నారు జగన్ పార్టీ కార్యకర్తలు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే వైసీపీ నేతలే టార్గెట్‌గా కేసులు నమోదవుతున్నాయి. గత ఐదేళ్లు వైసీపీకి మద్దతుగా ఉంటూ… టీడీపీని, జనసేనను ఉతికారేసిన సినీ నటుడు పోసాని కృష్ణమురళీ మొదలు… ఆ తర్వాత నందిగాం సురేష్, వల్లభనేని వంశీ, కాకాణి, పేర్నినాని, విడదల రజనీ, జోగి రమేష్, ద్వారంపూడి, నల్లపురెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, ఎంపీ మిథున్‌రెడ్డితోపాటు సజ్జల, వైఎస్ జగన్ కోటరీలోని అధికారులతోపాటు ఎవ్వరినీ వదల్లేదు. ఏదో ఒక స్కామ్‌లో కేసులు, అరెస్ట్‌లు చేస్తున్నారు. పోసాని, వల్లభనేని వంశీ జైలుకు వెళ్లి బయటకు వచ్చారు. ఇప్పుడు కాకాణి, మిథున్‌రెడ్డి జైల్లో ఉన్నారు. మిగిలిన వారిపై కేసులు, విచారణలు జరుగుతున్నాయి. ఇన్ని జరుగుతున్నా… వైసీపీ అధినేత జగన్ మాత్రం క్యాడర్‌లో ధైర్యం నింపుతున్నారు. వారికి అండగా ఉంటామని భరోసా కల్పిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం వేధింపులు ఎక్కువవుతుండటంతో… క్యాడర్ డీలా పడకుండా కీలక నిర్ణయం తీసుకున్నారు జగన్. ప్రభుత్వం, అధికారులు, పోలీసులు.. ఎవరి నుంచి వేధింపులు ఎదురైనా ఫిర్యాదులు చేసేందుకు వైసీపీ నేతలు, కార్యకర్తల కోసం మొబైల్ యాప్ తీసుకురావాలని నిర్ణయించారు జగన్. ఆ యాప్‌లో… ఆధారాలతో సహా ఫిర్యాదు నమోదు చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఎక్కడైనా.. ఎప్పుడైనా.. ఎవరైనా సరే వేధింపులకు గురైన.. యాప్‌లో కంప్లెయింట్ చేయొచ్చని చెప్పారు. ఎవరు వేధిస్తున్నారు..? ఎందుకు వేధిస్తున్నారు..? వంటి వివరాలు నమోదు చేయాలన్నారు. వేధింపులకు సంబంధించి ఫొటోలు, వీడియోలు వంటి ఆధారాలు ఉంటే… యాప్‌లో అప్‌లోడ్ చేసే అవకాశం కూడా ఉంటుందన్నారు. ఈ ఫిర్యాదులన్నీ పార్టీ డిజిటల్ లైబ్రరీలో ఉంటుంది… వైసీపీ అధికారంలోకి రాగానే.. అన్యాయంగా కేసులు పెట్టినవారిని… వేధింపులకు గురిచేసిన వారిని.. వదలిపెట్టేదే లేదని చెప్పారు. వేధించిన వారినే కాదు… ఎవరి ప్రోద్బలంతో వేధించారో కూడా కనుక్కుని చర్యలు తీసుకుంటామన్నారు జగన్. వైసీపీ నేతలు, కార్యకర్తలకు అన్యాయం చేసిన వారిని చట్టం ముందు నిలబెడతామన్నారు జగన్.7