
అసెంబ్లీలో వైసీపీ తీరును తప్పుబట్టారు ఏపీ స్పీకర్. ఇదేం సాంప్రదాయం అంటూ మండిపడ్డారు. నిన్న శాసనసభలో పోడియంను చుట్టుముట్టడం… పేపర్లు చింపి విసరడం ఏంటని ఫైరయ్యారు. సీఎంగా పనిచేసిన వ్యక్తి చేయాల్సిన పని ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిన్న (సోమవారం) ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఆ సమయంలో తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేసింది. వైసీపీ సభ్యులు నినాదాల మధ్య గవర్నర్ ప్రసంగం మొదలుపెట్టారు. గవర్నర్ ప్రసంగంపై కూడా నిరసన తెలిపారు వైసీపీ సభ్యులు. పోడియంను చుట్టుముట్టారు. ఆ తర్వాత వాకౌట్ చేసి వెళ్లిపోయారు.
ఇవాళ (మంగళవారం) రెండో రోజు సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు… నిన్న సభలో వైసీపీ సభ్యులు ప్రవర్తించిన తీరును తీవ్రంగా తప్పుబట్టారు. నిన్నటి ఘటన చాలా బాధ కలిగించిందని అన్నారాయన. అతిథిగా వచ్చిన గవర్నర్‌ను గౌరవించాల్సి ఉందని… కానీ వైసీపీ సభ్యులు అలా చేయలేదన్నారు. సభా సాంప్రదాయాలను పాటించలేదని మండిపడ్డారు. ప్లకార్డులు పట్టుకుని సభలో రావడం… పోడియంను చుట్టుముట్టడం… పేపర్లు చింపి విసరడం… ఇదేం సాంప్రదాయం అని ప్రశ్నించారు స్పీకర్. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి… తమ సభ్యులతో అలా చేయించడం సరికాదన్నారు. సీనియర్ సభ్యుడైన బొత్స సత్యనారాయణ కూడా ఇది తప్పు అని చెప్పలేదన్నారు స్పీకర్. వైసీపీ సభ్యుల తీరు బాధకలిగించిందని…ఇలాంటి ఘటనలను అందరూ ఖండించాలన్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.
ఇదిలా ఉంటే… అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకూడదని వైసీపీ నిర్ణయించుకుంది. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే.. ప్రజాసమస్యలపై ప్రశ్నించే అవకాశం ఉండదని… అలాంటప్పుడు సమావేశాలకు వెళ్లి ఏం ప్రయోజనమని ప్రశ్నిస్తోంది వైసీపీ. ప్రభుత్వం చేసే అక్రమాలను ప్రశ్నించకూడదనే…. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.