ఆంధ్ర ప్రదేశ్రాజకీయం

ప్రక్షాళన జరిగితేనే వైసీపీకి లైఫ్‌ – తుక్కు ఏరకపోతే పార్టీ నిలబడటం కష్టమే..!

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ… 2019 ఎన్నికల్లో ఒక ప్రభంజనం. 151 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అడుగుపెట్టిన పార్టీ. 40ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు షాకిస్తూ… టీడీపీని తుక్కుతుక్కుగా ఓడించిన పార్టీ. అంతులేని ప్రజాదరణ పొందిన పార్టీ. ఆ ప్రజాదరణను చూసి… 30ఏళ్లు అధికారం శాశ్వతం అనుకున్నారు. కానీ ఏమైంది… ఐదేళ్లు తిరిగేసరికి వైసీపీని ప్రజలు కోలుకోలేని దెబ్బకొట్టారు. ఎమ్మెల్యే స్థానాలు 151 నుంచి 11కి పడిపోయాయి. కనీసం ప్రతిపక్ష హోదాకు సరిపడా స్థానాలు కూడా సాధించలేకపోయారు. దీంతో వార్‌ వన్‌ సైడ్‌ అన్నట్టు కూటమి గద్దెనెక్కింది. ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఏంటి..? ఇప్పటికైనా… పార్టీలోని లోటుపాట్లను వైఎస్‌ జగన్‌ గమనిస్తున్నారా…? దారుణ ఓటమికి అసలు కారణాలను పసిగట్టారా…? పార్టీపై ఫోకస్‌ పెట్టి లోపాలను సరిదిద్దుకోకపోతే… వైసీపీకి మనుగడ కష్టమనేది విశ్లేషకుల మాట.

అధికారంలోకి వచ్చాం కదా అని ఇష్టమొచ్చిన నిర్ణయాలు తీసుకోకూడదు. ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాలు తెలుసుకుని.. దానికి అనుగుణంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం గెలుపు… వైసీపీ చేజేతులా చేసుకున్నదే. కనీసం ఇప్పుడైనా చేసిన పొరపాట్లను సరిచేసుకోవాలి. సంక్షేమం ఓకే.. కానీ అభివృద్ధిని పక్కనపెట్టడం సరికాదు. రాష్ట్రాభివృద్ధిని పట్టించుకోకుండా… ప్రజలకు డబ్బులు పంచారన్న విమర్శ వైసీపీపై లేకపోలేదు. ఇక… రాజధాని విషయంలోనూ వ్యతిరేకత మూటగట్టుకుంది. అమరావతిని పక్కన పెట్టి మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చారు జగన్‌. దాని వల్ల.. అమరావతిలో నిర్మాణాలు ఆగిపోయాయి. మూడు రాజధానుల అంశంలో చిక్కులు ఉండటంతో ఆ దిశగా అడుగు ముందుకుపడలేదు. దీంతో.. పదేళ్లు అయినా ఏపీకి అసలు రాజధానే లేకుండా పోయింది. ఈ అంశం కూడా ప్రజలను బాగా ఆలోచింప చేసింది.

Read More : టీడీపీకి కనిపించని శత్రువు పవనే..! – ఈ సత్యం చంద్రబాబు గ్రహించేదెప్పుడో..?

పాలనలో పొరపాట్లు అటుంచితే.. పార్టీలో పరిస్థితి ఏంటి…? జగన్‌ చుట్టూ కోటరీ ఉందని ఎప్పటి నుంచో వస్తున్న విమర్శ. ఇటీవల ఈ తరహా ఆరోపణలు ఎక్కువయ్యాయి. కోటరీ చెప్పిన మాటలు నమ్మి… నమ్ముకున్న నేతలను కూడా జగన్‌ పక్కనపెట్టేశారట. అంతేకాదు ఎన్నికల ముందు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల మార్పు.. ఒక అట్టర్‌ ప్లాప్‌ నిర్ణయం. జగన్‌కు ఆ సలహా ఎవరు ఇచ్చారో.. ఆయన ఎలా తీసుకున్నారో గానీ… అది ఎంత పెద్ద పొరపాటో… ఫలితాల్లో తేటతెల్లమైంది. కనీసం ఇప్పుడైనా… పార్టీపై జగన్‌ ఫోకస్‌ పెట్టాల్సిన అవసరం ఉంది. ముందు కోటరీ దాటి బయటకు రావాలి. జనాదరణ ఉన్న నేతలు ఎవరు…? భజనపరులు ఎవరు..? అన్నది పసిగట్టాలి. మనవాళ్లు ఎవరు..? స్వలాభం కోసం చుట్టూ చేరిన వాళ్లు ఎవరు..? అన్నది జగన్ పసిగట్టాలి.

Read More : ఎన్ని వేరియేషన్లు చూపించాడో – పవన్‌ కళ్యాణ్‌పై వామపక్షాల సెటైర్‌ 

2019 ఎన్నికల్లో క్లీన్‌స్వీప్‌ చేసిన జిల్లాల్లో… ఎందుకు ఓటమి చవిచూడాల్సి వచ్చిందో… జగన్ ఆరా తీయాలి. ఏ నాయకుడి తీరు వల్ల పార్టీకి నష్టం కలుగుతుందో తెలుసుకుని.. వారిని పక్కనపెట్టాలి. పార్టీలోని తుక్కు మొత్తం ఏరేయాలి. నెల్లూరులో ఎమ్మెల్యే అనీల్‌కుమార్‌ యాదవ్‌ నోటి దురుసు… పార్టీకి చాలా నష్టం కలిగించిందని లోకల్‌ టాక్‌. అలాగే.. దువ్వాడ శ్రీనివాస్‌.. కుటుంబాన్ని వదిలి.. మరో మహిళతో ఉంటున్నారు. ఇలాంటి వారి వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తుంది. వీరిని ఇప్పటికే జగన్‌ పక్కనపెట్టినట్టు సమాచారం. వీరిద్దరే కాదు.. ఇలాంటి వారు చాలా మంది వైసీపీలో ఉన్నారు. వారు ఎవరనేది తెలుసుకుని.. పక్కనపెట్టారు. కొత్త నాయకులను ప్రోత్సహించి బరిలోకి దింపాలి. అలా అయితేనే పార్టీకి భవిష్యత్తు… మరోసారి అధికారం చేపట్టే అవకాశం ఉంటాయన్నది విశ్లేషకుల వాదన.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button