
-
అనుమతులు లేకుండా అక్రమ వ్యాపారం
-
నాంపల్లి మండలం వడ్డేపల్లిలో వ్యాపారుల ఇష్టారాజ్యం
-
ఓ వ్యక్తిని ముందుంచి నలుగురి దందా
-
కోట్లలో దండుకుంటున్న వైనం
-
మక్కపల్లిలోని వే బిల్లులు చూపిస్తూ నాంపల్లిలో వ్యాపారం
క్రైమ్ మిర్రర్, నల్గొండ: నాంపల్లి మండలం పరిధిలో పలుగురాళ్ల వ్యాపారం రోజురోజుకీ విస్తరిస్తోంది. అనుమతుల్లేకుండా పలుగురాళ్లను తొలగించి, అమ్ముకుంటూ కోట్ల రూపాయలు వెనుకేసుకుంటున్నారు. అనుమతులు ఓ చోట తీసుకొని మరోచోట మైనింగ్ చేస్తూ పర్యావరణానికి హాని కలిగిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం విస్తుగొలుపుతోందని పలువురు విమర్శిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే మక్కపల్లి ప్రాంతం అనుమతులు తీసుకొని, వాటిని సాకుగా చూపుతూ నాంపల్లి మండలంలో భారీ స్థాయిలో అక్రమ పలుగురాళ్ల రవాణా జరుగుతోంది. అసలు అనుమతులు ఒక ప్రాంతానికి మాత్రమే మంజూరు అయినా, వాటిని కాపీ చేసుకుంటున్నారు. వాటినే వేరే ప్రాంతాల్లోనూ వాడటం కోసం వే బిల్స్ తయారు చేసి లక్షలాది రూపాయలను వ్యాపారులు వెనుకేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ అక్రమ రవాణా వెనుక స్థానిక రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యమే. రైతులను మభ్యపెట్టి, “మేమే మీ పక్షం” అన్న నమ్మకంతో, వ్యాపారులు తమ దందాను చెల్లాచెదురుగా కాకుండా వ్యవస్థీకృతంగా నడుపుతున్నారు.
ఇదే కాక, నియోజకవర్గ స్థాయి ఒక పెద్ద నాయకుడి పేరు ఈ రవాణాలో వినిపించడం మరింత సెన్సేషన్‌గా మారింది. ఆయన పేరును వాడుకుని, ప్రభావం చూపుతున్నారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి.
అనుమతులు ముగిసినా అక్రమ మైనింగ్
ఇచ్చిన అనుమతుల గడువు ముగిసినా కూడా ఈ దందా ఆగకపోవడం, అధికారుల సహకారం లేకుండా జరగదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. వెబిల్స్ తయారీ, రవాణా మార్గాల్లో ఎవరూ అడ్డుకోకపోవడం వెనుక అధికారులపై ప్రభావం చూపుతున్న వ్యాపారుల హస్తం ఉందన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. అక్రమ రవాణా ఇంత పెద్ద స్థాయిలో సాగుతుంటే, పోలీస్‌శాఖ, మైనింగ్ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు ఏమి చేస్తున్నారు?” అనే ప్రశ్న స్థానిక ప్రజల్లో మారుమోగుతోంది. ఒకవైపు చట్టపరమైన నిబంధనలు కఠినంగా అమలవుతాయనుకుంటే, మరోవైపు ఈ రాకెట్‌కు పాలిటికల్ & అధికారుల మద్దతు లభిస్తోందన్న ఆరోపణలు బయటపడుతున్నాయి.
రైతులను నట్టేట ముంచుతున్న వ్యాపారులు
ఈ దందాలో అసలు నష్టపోతున్నవారు రైతులే. నిజంగా పలుగు కొనుగోలు చేసుకోవాల్సిన రైతులను మభ్యపెట్టి, మాఫియాలు తమ లాభాలను పెంచుకుంటున్నాయి. “రైతుల పేరుతో లైసెన్స్‌లు, అనుమతులు తీసుకుని, లాభాలు మాత్రం అక్రమ రవాణాదారుల జేబుల్లో పడుతున్నాయి” అనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ రవాణా వెనుక ఉన్న అసలైన పెద్దలు ఎవరు అన్నది ఇంకా మిస్టరీగానే ఉంది. స్థానిక నాయకులు, నియోజకవర్గ స్థాయి నేత, కొంతమంది అధికారుల పేర్లు వినిపిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఎవరిపైనా అధికారిక చర్య జరగకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
అక్రమాలకు స్థానిక నేతల ప్రోత్సాహం
నాంపల్లి మండలంలో పలుగురాళ్ల అక్రమ రవాణా కేవలం వ్యాపారుల దందా మాత్రమే కాదు. స్థానిక నాయకుల ప్రోత్సాహం, అధికారుల సపోర్ట్ లేకుండా ఇంత పెద్ద రాకెట్ సాధ్యం కాదని స్పష్టమవుతోంది. రైతులను మభ్యపెట్టి, అనుమతుల లుపోల్స్ ను వాడుకుంటూ లక్షల రూపాయల అక్రమ రవాణా కొనసాగుతున్న ఈ వ్యవహారంపై ఎప్పుడు, ఎవరిపై చర్యలు తీసుకుంటారు? అన్నది చూడాల్సి ఉంది.
అక్రమ పలుగురాళ్ల మైనింగ్ ఆగేవరకు క్రైమ్ మిర్రర్ నిరంతరం వార్తలు ప్రచురిస్తూనే ఉంటుంది.
నిఘా వ్యవస్థ నిద్రిస్తే… క్రైమ్ మిర్రర్ కాపు కాస్తుంది.