ISRO Missions: రతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వరుస ప్రయోగాలతో దూసుకెళ్తోంది. మార్చి 2026 వరకు ఏకంగా ఏడు ప్రయోగాలను చేపట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ నారాయణన్ ప్రకటించారు. 2027లో చేపట్టనున్న మానవసహిత అంతరిక్ష మిషన్ గగన్ యాన్ కు ఏర్పాట్లు చేసుకుంటూనే.. ఈ ప్రయోగాలను ప్లాన్ చేసినట్లు వెల్లడించారు. తాజాగా ఆయన ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఇస్రో మిషన్స్ కు సంబంధించిన పలు కీలక విషయాలు వెల్లడించారు.
2027లో గగన్‌యాన్.. 2028లో చంద్రయాన్-4
2026 మార్చిలోగా ఏడు ప్రయోగాలు చేపట్టనున్నట్లు నారాయణన్ ప్రకటించారు. వాటిలో ఓ కమర్షియల్ కమ్యూనికేషన్ శాటిలైట్ ప్రయోగంతో పాటు పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ మిషన్లు కూడా ఉన్నట్లు తెలిపారు. పూర్తిగా భారతీయ సంస్థలు తయారు చేసిన పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగం వీటిలో ఒక మైల్ స్టోన్ గా నిలవనుందన్నారు. చంద్రుడిపై దిగడమే కాకుండా అక్కడి నుంచి కొన్ని నమూనాలను తీసుకొచ్చే లక్ష్యంతో చేపట్టనున్న చంద్రయాన్-4 మిషన్‌కు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇస్రో చైర్మెన్ తెలిపారు. ఈ ప్రయోగాన్ని 2028లో చేపడతామని వెల్లడించారు.
జపాన్ స్పేస్ ఏజెన్సీతో కలిసి లూపెక్స్ మిషన్
అటు చంద్రుడి దక్షిణ ధ్రువంలో నీటి మంచును అధ్యయనం చేయడం కోసం జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ ప్లోరేషన్ ఏజెన్సీతో కలిసి ఇస్రో సంయుక్తంగా లూపెక్స్ మిషన్ చేపట్టబోతున్నట్లు నారాయణన్ తెలిపారు. రాబోయే మూడేళ్లలో రాకెట్ల ఉత్పత్తిని మూడు రెట్లు పెంచుతామని చెప్పారు. గగన్‌యాన్ మిషన్ 2027 నాటికి చేపట్టే ప్రణాళికలో ఎలాంటి మార్పూ లేదన్నారు. వ్యోమగాములతో కూడిన ఈ యాత్రకు ముందు మూడు మానవరహిత టెస్టింగ్ మిషన్లు ఉంటాయని చెప్పారు. వీటిలో భాగంగా తొలి ప్రయోగాన్ని ఈ ఏడాది పూర్తి చేస్తామన్నారు. మానవసహిత ప్రయాణం 2027లో ఉంటుందని ఇస్ట్రో చైర్మెన్ నారాయణన్ తెలిపారు.





