జాతీయం

Bahubali Rocket: బ్లూబర్డ్‌ బ్లాక్‌-2 ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. నేడే ఎల్వీఎం-3-ఎం6 రాకెట్‌ ప్రయోగం

షార్‌ నుంచి అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్‌ ఉపగ్రహం బ్లూ బర్డ్‌ బ్లాక్‌-2ను ఎల్‌వీఎం3-ఎం6 రాకెట్‌ ద్వారా ప్రయోగించేందుకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఇవాళ ఉదయం 8. 54 గంటలకు ఈ రాకెట్‌ను ప్రయోగించనున్నారు.

ISRO BlueBird Block-2 Satellite Launch: వాణిజ్య ప్రయోగాల్లో ఇస్రో మరో కీలక మైలురాయికి చేరువైంది. తన బాహుబలి రాకెట్‌ ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పేందుకు సిద్ధమైంది. ఎల్వీఎం-3-ఎం6 రాకెట్‌ ద్వారా అమెరికాకు చెందిన కొత్తతరం కమ్యూనికేషన్‌ ఉపగ్రహం  బ్లూబర్డ్‌ బ్లాక్‌-2ని కక్ష్యలోకి చేర్చేందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది. బుధవారం ఉదయం 8.54 గంటలకు చేపట్టే ఈ ప్రయోగానికి తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం షార్‌ వేదిక కానుంది. ఈ ప్రయోగానికి సంబంధించిన 24 గంటల కౌంట్‌డౌన్‌ మంగళవారం ఉదయం 8.54 గంటలకు ప్రారంభమైంది. కౌంట్‌డౌన్‌ పూర్తవగానే బుధవారం ఉదయం 8.54 గంటలకు 6,400 కిలోల బరువున్న బ్లూబర్డ్‌ ఉపగ్రహాన్ని తీసుకుని ఎల్వీఎం-3-ఎం6 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. 15.07 నిమిషాల్లో రాకెట్‌ మూడు దశలు పూర్తికాగానే లో ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనుంది.

ఇస్రో సరికొత్త రికార్డు

అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్‌మొబైల్‌ సంస్థతో కుదిరిన వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఇస్రో ఈ వాణిజ్య ప్రయోగాన్ని చేపడుతోంది. కాగా, భారత భూభాగం నుంచి ఇస్రో రాకెట్‌ ద్వారా ఇంతటి భారీ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చడం ఇదే తొలిసారి. అందుకే ఈ ప్రయోగం విజయవంతమైతే ఇస్రో సరికొత్త రికార్డు నెలకొల్పనుంది. ఇప్పటి వరకూ ఉన్న 4,400 కిలోల ఉపగ్రహ ప్రయోగ రికార్డు మరుగున పడనుంది. వాణిజ్య ప్రయోగాల్లో ఇస్రోకిది మరో కీలక మైలురాయి కాబోతోంది. మంగళవారం ప్రారంభమైన 24 గంటల కౌంట్‌డౌన్‌ నిరంతరాయంగా కొనసాగుతోంది. ఈ సమయంలోనే రాకెట్‌కు ఇంధనాన్ని నింపే కార్యక్రమాన్ని పూర్తిచేసిన శాస్త్రవేత్తలు రాకెట్‌లోని అన్ని దశల పనితీరును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ వి.నారాయణన్‌, షార్‌ డైరెక్టర్‌ ఈఎస్‌ పద్మకుమార్‌ కౌంట్‌డౌన్‌ ప్రక్రియను పరిశీలించారు.

ఇస్రో మీద ప్రపంచం దృష్టి!

భారత గడ్డపై నుంచి ఇంతటి బరువైన ఉపగ్రహాన్ని ప్రయోగించడం ఇదే తొలిసారి. అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్‌ ఉపగ్రహాన్ని ఎల్వీఎం-3 మోసుకెళ్తున్నందున.. ఇప్పుడు ప్రపంచం దృష్టంతా ఇస్రోపైనే ఉంది. కాగా, ఎల్వీఎం-3 ద్వారా చేపడుతున్న మూడో వాణిజ్య ప్రయోగమిది. గతంలో వన్‌వెబ్‌ సంస్థకు చెందిన రెండు వాణిజ్య ఉపగ్రహాలను ఈ రాకెట్‌ కక్ష్యలోకి చేర్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button