
-
అంతరిక్షంలో 18 రోజులు జీవితంలో మరచిపోలేని అనుభవం
క్రైమ్ మిర్రర్, న్యూడిల్లీ : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో 18 రోజుల పాటు గడిపి భూమికి సురక్షితంగా తిరిగొచ్చిన ఇస్రో వ్యోమగామి శుభాన్షు శుక్లా తొలిసారిగా మీడియా ముందు స్పందించారు. భూమికి తిరిగొచ్చిన అనంతరం నాసా, ఇస్రో సంయుక్తంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అంతరిక్షంలో 18 రోజులు నా జీవితంలో మరచిపోలేని అనుభవంగా నిలిచిపోయింది. భూమిని అంతరిక్షం నుంచి చూస్తే, అది ఎంతో సున్నితంగా, అందంగా కనిపించింది. అంతరిక్షంలో ఉండడం నిజంగా అద్భుతమైన అనుభూతి, అని అన్నారు.
అంతరిక్ష కేంద్రంలో శాస్త్రీయ పరిశోధనల్లో భాగంగా మొత్తం 60 రకాల ప్రయోగాలు నిర్వహించామని, ఈ ప్రయోగాల ఫలితాలు భవిష్యత్తులో అంతరిక్ష ప్రయాణాలను మరింత సులభతరం చేయనున్నాయని శుభాన్షు వివరించారు.
శుభాన్షుతో పాటు తిరిగొచ్చిన మరో ముగ్గురు వ్యోమగాములు కూడా తమ అనుభవాలను పంచుకున్నారు. ఇకపై ఏడురోజుల పాటు ప్రత్యేక క్వారంటైన్‌లో ఉండి, ఆరోగ్య పరీక్షలు పూర్తి చేసుకోనున్నట్లు ఇస్రో అధికారులు తెలిపారు. శుభాన్షు శుక్లా విజయవంతమైన ఈ మిషన్ భారతీయ అంతరిక్ష పరిశోధనలో సరికొత్త అధ్యాయంగా నిలుస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.