తెలంగాణలో ప్రేమకు ప్రతీకగా నిలిచే అరుదైన ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. భార్య మరణాన్ని తట్టుకోలేక ఆమె జ్ఞాపకార్థం విగ్రహం ఏర్పాటు చేయించిన ఒక వృద్ధుడు, తన జీవితాంతం ఆమెకు తోడుగా ఉండాలనే భావంతో బతికుండగానే తన విగ్రహాన్ని కూడా తయారు చేయించి పక్కనే ఏర్పాటు చేయించడం అందరినీ భావోద్వేగానికి గురి చేస్తోంది. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. భార్యపై తనకున్న ప్రేమను సమాజానికి తెలియజేయాలనే ఉద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయం చాలామందిని ఆలోచింపజేస్తోంది.
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చిప్పరాళ్లబండ తండాకు చెందిన భూక్య నాను నాయక్ అనే 90 సంవత్సరాల వృద్ధుడు ఈ ప్రత్యేకమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆయనకు దస్లీ అనే మహిళతో వివాహమై దాదాపు 70 సంవత్సరాలు దాంపత్య జీవితం సాగింది. జీవితాంతం ఒకరికొకరు తోడుగా జీవించిన ఈ దంపతుల మధ్య ఉన్న అనుబంధం ఎంతో గాఢంగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. అయితే ఏడాదిన్నర కిందట దస్లీ తీవ్ర అనారోగ్యంతో మృతి చెందడంతో నాను నాయక్ తీవ్రంగా కలత చెందాడు.
భార్య భౌతికంగా లేకపోయినా ఆమె జ్ఞాపకం ఎప్పటికీ నిలిచిపోవాలని భావించిన నాను నాయక్ తన వ్యవసాయ భూమిలో దస్లీ విగ్రహాన్ని ఏర్పాటు చేయించాడు. దాదాపు రూ.3 లక్షల వ్యయంతో ఈ విగ్రహాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. జీవితాంతం ఆమెతోనే గడిపిన నాను నాయక్ ఇకపై కూడా ఆమెకు దూరం కాకూడదనే భావనతో మరో ప్రత్యేక నిర్ణయం తీసుకున్నాడు.
తాను ఎప్పటికైనా భార్య దగ్గరకు చేరుతానని భావించిన నాను నాయక్ బతికుండగానే తన విగ్రహాన్ని కూడా తయారు చేయించాడు. తన భార్య దస్లీ విగ్రహం పక్కనే తన విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రస్తుతం దానికి గుడ్డ కప్పి ఉంచాడు. తాను మరణించిన తర్వాత మాత్రమే ఆ గుడ్డను తొలగించి విగ్రహాన్ని ఆవిష్కరించాలని తండా ప్రజలను కోరుతున్నాడు. బతుకులోనూ, మరణంలోనూ చివరకు విగ్రహాల్లోనూ ఆమెకు తోడుగా ఉండాలనే తన మనసులోని కోరికను ఈ విధంగా వ్యక్తం చేస్తున్నాడు.
ప్రస్తుతం నాను నాయక్ ప్రతిరోజూ తన భార్య విగ్రహం దగ్గరకు వెళ్లి కొంతసేపు అక్కడే కూర్చుంటాడు. ఆమెను తలుచుకుంటూ భావోద్వేగానికి లోనవుతూ కన్నీరుమున్నీరుగా రోదిస్తుంటాడని స్థానికులు చెబుతున్నారు. ఈ దృశ్యం చూసినవారు భార్యపై ఆయనకున్న ప్రేమను చూసి కదిలిపోతున్నారు.
నాను నాయక్‌కు మొత్తం ఆరుగురు సంతానం ఉన్నారు. అందులో ఐదుగురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. అయితే పిల్లలకు భారం కాకూడదనే ఉద్దేశంతో తనకు వచ్చే నెలసరి పెన్షన్ డబ్బులోంచి కొంత భాగాన్ని ఉపయోగించి ఈ విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు నాను నాయక్ తెలిపారు. ఇరుగుపొరుగు వారి సూచనల మేరకు తన విగ్రహాన్ని కూడా తయారు చేయించుకున్నట్లు చెప్పారు.
తాను మరణించిన తర్వాత తన కారణంగా ఎవరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని నాను నాయక్ వెల్లడించారు. తన విగ్రహానికి కట్టిన గుడ్డను తాను చనిపోయిన తర్వాత తొలగిస్తే తనకు ఆత్మశాంతి కలుగుతుందని తండావాసులు, బంధువులకు కూడా తెలియజేస్తున్నారు.
అంతేకాకుండా నేటి తరం యువతకు కూడా ఆయన ఒక సందేశం ఇచ్చారు. చిన్న చిన్న కారణాలకే గొడవలు పెట్టుకుని విడిపోవడం సరికాదని, భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. తమ దాంపత్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని యువత సహనం, ప్రేమతో జీవించాలని కోరుతూ తన మనసులోని భావాలను వ్యక్తం చేశారు.
ALSO READ: ఎండా కాలంలో ఉల్లిపాయలు తినొచ్చా.. తింటే ఏం జరుగుతుంది?
