తెలంగాణరాజకీయం

టీఆర్పీకి మైలేజ్‌ దక్కేనా? తెలంగాణలో మల్లన్న పార్టీ ప్రయోగమేనా?

  • బహుజన వాదంతో ప్రజల ముందుకు మల్లన్న!

  • పార్టీ ఆశయాలు, లక్ష్యాలను ఛేదించడంపై గురి

  • తెలంగాణలో రాజ్యాధికారం టీఆర్పీకి సాధ్యమయ్యే పనేనా?

  • పార్టీని తెలంగాణ ప్రజలు ఆదరించే అవకాశాలున్నాయా?

  • ప్రధాన రాజకీయ పార్టీల హవాను టీఆర్పీ తట్టుకోగలదా?

  • వచ్చే ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయగలరా?

  • రాజకీయాల్లో స్థిరత్వంలేని మల్లన్న ముందు ఎన్నో ప్రశ్నలు!

క్రైమ్‌మిర్రర్‌, హైదరాబాద్‌: తెలంగాణలో కొత్త పొలిటికల్‌ పార్టీ పురుడుపోసుకుంది. చింతపండు నవీన్‌ కుమార్‌… అదేనండి తీన్మార్‌ మల్లన్న చెప్పినట్టుగానే…. రాజకీయ పార్టీ పెట్టేశారు. పార్టీ పేరును ప్రకటించి… చేయబోతున్న పోరాటాలు, చేరుకోవాల్సిన లక్ష్యాలను స్పస్టంగా చెప్పారు. ఇంతకీ ఆయన పార్టీ పేరేంటి…? పార్టీ పెట్టిన ఉద్దేశమేంటి…? ఆ పార్టీ… ప్రజలకు ప్రయోజనకరంగా మారుతుందా…? లేక ప్రయోగంగా మిగిలిపోతుందా…?

తెలంగాణ రాజ్యాధికార పార్టీ… ఇదే తీన్మార్‌ మల్లన్న పెట్టిన కొత్త రాజకీయ పార్టీ. బహుజన వర్గాల హక్కు కోసం పోరాడతానంటూ హామీ ఇచ్చారు మల్లన్న. హైదరాబాద్‌ తాజ్‌బంజారా హోటల్‌లో సమావేశం నిర్వహించి పార్టీ పేరును ప్రకటించారు. పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ నేతలు, మేథావులు, ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్రంలోని బీసీలు, ఎస్సీ-ఎస్టీలు, మైనార్టీలు, పేదలకు… రాజ్యాధికారం అందించడం, సామాజిక తెలంగాణ సాధించడమే తమ లక్ష్యమని చెప్పారు తీన్మార్‌ మల్లన్న. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలు… బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని ఆయన ఆరోపించారు. బీసీలు స్వతంత్రంగా రాజకీయ శక్తి ఏర్పడాలన్నదే తన ఆశయమన్నారు.

పార్టీ జెండాను ఎరువు, ఆకుపచ్చ రంగులతో డిజైన్‌ చేయించారు. ఎరువు పోరాటానికి చిహ్నం కాగా… ఆకుపచ్చ రైతులకు సూచిక. మధ్యలో కార్మిక చక్రం, అందులో పిడికిలి ఉంది. ఇది బీసీల ఐక్యత, శ్రామికుల శక్తిని సూచిస్తుందని తెలిలిపారు. అలాగే కార్మిక చక్రం చుట్టూ… వరి కంకుల గుర్తులు పెట్టారు. ఇక.. జెండా పైభాగంలో… ఆత్మగౌరవం, అధికారం, వాటా నినాదాలను ముద్రించారు. ఈ పార్టీకి ఏఐ అంటే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను.. స్పోక్స్‌పర్సన్‌గా నియమించారు. మన దేశంలో ఇలా చేసిన మొట్టమొదటి పార్టీ ఇదే.

ఇక విషయానికి వస్తే… ఈ పార్టీ ఎంత మేర విజయం సాధిస్తుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితిలో పార్టీని నడపడం… నెగ్గుకురావడమంటే ఒక సవాలే. తీన్మార్‌ మల్లన్న పొలిటికల్‌ జర్నీ చూస్తే… ఎక్కడ స్థిరత్వం లేదు. ఆయన ఒక జర్నలిస్ట్‌, ఆ తర్వాత రాజకీయ, సామాజిక కార్యకర్తగా మారారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయారు. బీసీల ఐక్యత, రాజ్యాధికారం అంటూ.. 2023లో తెలంగాణ నిర్మాణ పార్టీ పెట్టాలని ప్రయత్నించారు. కానీ అది కుదరలేదు. 2023లో కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2025 మార్చిలో కాంగ్రెస్‌ సర్కార్‌ చేపట్టిన కులసర్వే రిపోర్ట్‌పై విమర్శలు చేసి… దాని ప్రతులను దహనం చేశారు. అందుకుగాను కాంగ్రెస్‌ పార్టీ మల్లన్నను సస్పెండ్ చేసింది. ఆ తర్వాత… 2025 ఆగస్టు నుంచి బీసీ యూనైటెడ్‌ ఫ్రంట్‌ అంటూ ప్రకటనలు చేశారు. అదీ జరగలేదు. ఇప్పుడు… తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) పేరుతో ముందుకువచ్చారు. ఇప్పుడైనా… ఇందులో స్థిరంగా ముందుకు సాగుతారా..? చెబుతున్న ఆశయాలు, లక్ష్యాలు బాగానే ఉన్నాయి.. వాటిని సాధించేవరకు నిలబడి పోరాడుతారా…? అన్నది వేచిచూడాలి.

తెలంగాణలో ఇప్పుడున్న అతిపెద్ద పార్టీలు బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌… వీటితో పోటీపడి మరో పార్టీ నెగ్గుకురావడమంటే అంత ఈజీ కాదు. కేడర్‌ నిర్మాణమే అతిపెద్ద సవాల్‌. పైగా తరచూ పార్టీలు మారడం.. ఎక్కడా స్థిరంగా పోరాడిన దాఖలాలు లేకపోవడం మైనస్‌ కావొచ్చు. అయితే… తీన్మార్‌ మల్లన్న ప్రజలతో మమేకమయ్యే తీరు, తన అభిప్రాయాలను గట్టిగా ప్రజల ముందు తెచ్చే విధానం ఆయనకు పాజిటివ్‌గా మారొచ్చు. బహుజన వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యమని ఆయన ప్రకటించారు. తెలంగాణలో మెజారిటీ ఓటు బ్యాంకు అయిన బీసీలు ఆయనకు కలిసిరావొచ్చు. అంతేకాదు.. యువ ఓటర్లలో ఆయనకు మంచి ఫాలోయింగ్‌ ఉంది. పైగా… బహుజన హక్కులు, సామాజిక న్యాయం వంటి అంశాలపై బలంగా పోరాడగలిగితే గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ఇది ఇప్పట్లో సాధ్యంకాకపోవచ్చు. 2028 ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం కష్టమే. ఒకవేళ బరిలోకి దిగితే… ఓట్లు చీలి… ప్రతిపక్షాలకు లాభం చేకూరే ఛాన్స్‌ ఉంది. కానీ… భవిష్యత్‌లో బీసీల తరపున పోరాడి వారందరినీ ఏకం చేయగలిగితే… తీన్మార్‌ మల్లన్న పార్టీ విజయం సాధించే అవకాశాలు లేకపోలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button