
నేరాభియోగాలున్న నేతలను పదవుల నుంచి తొలగించేందుకంటూ బీజేపీ తెచ్చిన ఆ బిల్లు వెనుక… అసలు మతలబు ఏంటి…? ప్రతిపక్షాల పనిపట్టడమా…? తల ఎగరేసే మిత్రపక్షాలను కంట్రోల్‌లో పెట్టడమా..? లేక… ఒక్క దెబ్బకు రెండు పిట్టలంటారే.. అందుకోసమా. రాజకీయ నేరస్తులను తగ్గించేందకే ఆ బిల్లు తెస్తున్నామని బీజేపీ వాదిస్తున్నా… ప్రతిపక్షాలు మాత్రం వారి అసలు ఉద్దేశం వేరంటూ… గగ్గోలు పెడుతోంది. కానీ.. ఏం లాభం… రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవా అన్నట్టు.. అధికారం చేతుల్లో ఉంది కదా… వారు చెప్పిందే వేదం.. వారు చేసిందే చట్టం.. అన్నట్టు తయారైంది పరిస్థితి. ఇంతకీ… ఆ కొత్త బిల్లు వెనుకున్న అసలు ఉద్దేశం ఏంటి..? ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఈ చర్చ జోరుగా సాగుతోంది.
రాజకీయ పదవుల్లో ఉన్న నేతలపై నేరారోపణలు వచ్చి అరెస్ట్ అయితే… వారు 30 రోజులు, అంతకంటే ఎక్కువగా జైల్లో ఉంటే.. వారి పదవులు ఆటోమెటిక్‌గా రద్దయినట్టే. ఇది…. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త బిల్లు. ఢిల్లీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్… లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయినా కూడా సీఎం పదవికి రాజీనామా చేయలేదని.. జైలు నుంచే పాలన చేశారని బీజేపీ నేతలు అంటున్నారు. అలాంటివి జరగకుండా.. రాజ్యాంగ సవరణన చేస్తూ… ఈ బిల్లును తెస్తున్నామని చెప్తున్నారు. వారు చెప్తున్న ఉద్దేశం మంచిదే.. కానీ.. దాని వెనుకున్న ఉద్దేశం వేరంటున్నాయి ప్రతిపక్షాలు. ఆ బిల్లు… ప్రతిపక్షపాలిత రాష్ట్రాలను పడగొట్టేందుకే అని ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్షం నేతలు సీఎంగా ఉంటే… వారిపై ఏదో ఒక కేసు పెట్టి నెల రోజులు జైల్లో పెట్టి.. వారిని పదవి నుంచి దించాలన్నదే బీజేపీ ప్లాన్ అని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. అంతేకాదు… NDAలోని మిత్రపక్షాలను బ్లాక్‌మెయిల్ చేసేందుకు కూడా ఈ బిల్లు ఉపయోగించబోతున్నారని ఆరోపిస్తున్నారు. ఒక రకంగా వారి వాదన కూడా ఆలోచించతగ్గదే. ఎందుకంటే.. ఆ బిల్లు పవర్ అలాంటిది మరి.
ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి… ఎవరైనా సరే నేరారోపణలతో 30 రోజులు జైల్లో ఉంటే.. పదవి నుంచి ఉద్వాసన తప్పదంటున్నారు. అలాగే అనుకుందాం. ప్రధాన మంత్రిపై కేసు పెట్టి.. ఆయన జైల్లో ఉంటేనే కదా.. పదవి నుంచి ఉద్వాసన కలిగేది. మనలో మనమాట…. అసలు ప్రధాని మంత్రిపై కేసు పెట్టి విచారణ జరిపడం… ప్రస్తుత రాజకీయాల్లో సాధ్యమేనా..? పోనీ… కేంద్రం అనుమతి లేకుండా కేంద్ర మంత్రులపైనా కేసులు పెట్టడం సాధ్యమేనా..? మరి ఈ బిల్లును కేంద్రం ఇప్పుడు ఎందుకు తెచ్చింది. ప్రతిపక్షాల కోసం కాదా…? ప్రాంతీయ పార్టీల కోసం కాదా…? ఈ చర్చ… సామాన్యుల దగ్గర నుంచి విశ్లేషకుల వరకు జరుగుతోంది.
రాజకీయాల్లో శాశ్వత శత్రువు, మిత్రులు ఉండరంటారు. ఇప్పుడు మిత్రులుగా ఉన్నవారు రేపు… పార్టీ మారొచ్చు. ఇప్పుడు.. బీఆర్‌ఎస్ సీఎం నితీష్‌కుమార్, ఏపీ సీఎం చంద్రబాబు మద్దతుతో కేంద్రంలో NDA సర్కార్ బలంగా ఉంది. వారు తప్పుకుంటే.. అంతే సంగతులు. ఈ పరిస్థితుల్లో… మిత్రులు చేజారిపోకుండా… ఈ బిల్లు రూపంలో బీజేపీ స్కెచ్ వేస్తోందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ఇందుతో ఎంత నిజం ఉందో ఏమో గానీ…? బీజేపీ ఏ పని చేసినా దానికో లెక్కుంటుందన్నది మాత్రం వాస్తవం. ప్రతిపక్షాల ఆరోపణలు, విమర్శల మధ్యనే.. దీనికి సంబంధించిన మూడు కీలక బిల్లులను జాయింట్ పార్లమెంటీ కమిటీ (జేపీసీ)కి పంపింది కేంద్రం.