ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఖాతాదారుల్లో పీఎఫ్‌కు సంబంధించిన అనేక సందేహాలు తరచూ తలెత్తుతుంటాయి. ముఖ్యంగా పీఎఫ్ బ్యాలెన్స్‌పై వచ్చే వడ్డీపై పన్ను ఉంటుందా లేదా అనే విషయం చాలా మందికి స్పష్టంగా తెలియదు. దేశంలోని ప్రైవేట్ ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కల్పించడమే దీని ప్రధాన లక్ష్యం. ఉద్యోగి జీతం నుంచి 12 శాతం మొత్తాన్ని కట్ చేస్తే, యాజమాన్యం కూడా అదే స్థాయిలో 12 శాతం తన వంతుగా జమ చేస్తుంది. ఈ విధంగా ఉద్యోగి భవిష్యత్తు కోసం ఒక స్థిర నిధి ఏర్పడుతుంది.
ఉద్యోగులు ఒక సంస్థ నుంచి మరొక సంస్థకు మారినప్పుడు కొత్త పీఎఫ్ ఖాతా సంఖ్య రూపొందుతుంది. ఈ సందర్భంలో పాత ఖాతాను కొత్త ఖాతాతో విలీనం చేయకపోతే ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉండే అవకాశం ఉంటుంది. ఈ కారణంగా కొంతమంది తమ ఖాతాకు వడ్డీ జమ కావడం లేదని అపోహపడుతుంటారు. అయితే ఒక ఖాతా మూడు సంవత్సరాల పాటు కాంట్రిబ్యూషన్ లేకుండా ఉంటే అది ఇనాక్టివ్‌గా మారుతుంది. అయినప్పటికీ ఆ ఖాతాలో ఉన్న మొత్తానికి వడ్డీ మాత్రం జమ అవుతూనే ఉంటుంది. ఉద్యోగి 58 ఏళ్ల వయస్సు వరకు ఈ వడ్డీ చెల్లింపు కొనసాగుతుంది. ఆ తర్వాత మాత్రం వడ్డీ జమ కావడం స్వయంచాలకంగా ఆగిపోతుంది.
పన్నుల విషయంలో కూడా చాలామందికి స్పష్టత అవసరం ఉంది. పీఎఫ్‌లో జమ అయిన అసలు మొత్తంపై పన్ను ఉండదు. అయితే ఉద్యోగి చేసిన కాంట్రిబ్యూషన్ తేదీ నుంచి పదవీ విరమణ వరకు పొందిన వడ్డీపై మాత్రం పన్ను వర్తించే అవకాశం ఉంటుంది. అందువల్ల పీఎఫ్ ఖాతాదారులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రతి ఆర్థిక సంవత్సరం చివరలో ఈపీఎఫ్‌వో వడ్డీ రేటును నిర్ణయిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతం వడ్డీ రేటును ఖరారు చేసింది. గత 3 సంవత్సరాలుగా ఇదే రేటు కొనసాగుతుండగా, ఈసారి కూడా ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో పీఎఫ్ ఖాతాదారులకు స్థిరమైన లాభాలు అందుతున్నాయి.
ALSO READ: ఏంటి?.. చేతి వేళ్లను బట్టి క్యారెక్టర్ చేప్పేయొచ్చా?
