క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స రాజకీయాల నుంచి తప్పుకుంటారా?.. పొలిటికల్ రిటైర్మెంట్ తప్పదా?.. ఇకనుంచి తెరవెనుక రాజకీయాలకే పరిమితం అవుతారా?.. ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇటీవల బొత్స సత్యనారాయణ అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు ప్రచారం నడిచింది. అయితే సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ఆయన ఆసుపత్రిలో చేరినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరోవైపు ఆయన తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని.. అందుకే రాజకీయాల నుంచి తప్పుకుంటారని ప్రచారం నడుస్తోంది. అయితే కుటుంబ సభ్యులను ముందుంచి రాజకీయం చేస్తారని కూడా టాక్ నడుస్తోంది.
సీనియర్ మోస్ట్ లీడర్…
తెలుగు రాష్ట్రాల్లోనే బొత్స సీనియర్ మోస్ట్ లీడర్. ఉమ్మడి రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఒకానొక దశలో ఆయన పేరు ముఖ్యమంత్రి పదవికి వినిపించింది. విజయనగరం జిల్లాలో కోపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన బొత్స.. అనతి కాలంలోనే రాష్ట్రస్థాయి నేతగా ఎదిగారు. 1999లో బొబ్బిలి పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. పార్లమెంట్లో అడుగు పెట్టారు. 2004లో చీపురుపల్లి నుంచి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి గెలిచారు. రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి అయ్యారు. 2009లో అదే చీపురుపల్లి నుంచి రెండోసారి గెలిచి మళ్లీ మంత్రి అయ్యారు. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో ముఖ్యమంత్రి పదవికి బొత్స పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే స్పీకర్ గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ హై కమాండ్ ముఖ్యమంత్రిని చేసింది. ఉత్తరాంధ్రలో బీసీ వర్గానికి చెందిన బొత్స సత్యనారాయణను పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది.
కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత చాలామంది కాంగ్రెస్ పార్టీ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. జగన్మోహన్ రెడ్డి వెంట అడుగులు వేశారు. కానీ బొత్స కుటుంబం మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగింది. 2014 ఎన్నికల్లో మూడోసారి చీపురుపల్లి అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు బొత్స. ఆ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా డిపాజిట్లు రాలేదు. కానీ చీపురుపల్లి నుంచి పోటీ చేసిన బొత్స రెండో స్థానంలో నిలవడం విశేషం. ఇక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి వెళ్లిపోయింది. 2014 ఎన్నికల ఫలితాలు తర్వాత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది బొత్స ఫ్యామిలీ. దీంతో ఉత్తరాంధ్ర పై అ ప్రభావం పడింది. 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. విజయనగరం జిల్లాలో వైసీపీ ఏకపక్షంగా గెలుపొందింది. దీంతో బొత్సకు మంత్రి పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఏకంగా ఐదేళ్లపాటు మంత్రిగా కొనసాగారు బొత్స.
శాసనమండలిలో వైసిపి పక్ష నేతగా..
మొన్నటి ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నుంచి నాలుగోసారి పోటీ చేశారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. కూటమి ప్రభంజనంలో ఓడిపోయారు. కానీ సీనియర్ల సేవలను వినియోగించుకోవాలన్న జగన్ బొత్సను విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. ఆపై శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతగా బాధ్యతలు అప్పగించారు. శాసనసభలో తగినంత బలం లేకపోవడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. కానీ శాసనమండలిలో సంఖ్యాబలం ఎక్కువగా ఉండడంతో ప్రతిపక్ష హోదా దక్కింది. కూటమి ప్రభుత్వాన్ని బొత్స నేతృత్వంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు గట్టిగానే ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో బొత్స పై ఒత్తిడి పెరిగి తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ క్రమంలో బొత్స క్రియాశీలక రాజకీయాలకు దూరం అవుతారని ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులు రాజకీయంగా యాక్టివ్ గా ఉన్నారు. వారిని ముందు పెట్టి బొత్స తెర వెనుక రాజకీయాలకు పరిమితం అవుతారని ప్రచారం నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.
