
ఉరవకొండ.. అనంతపురం జిల్లాలోని అసెంబ్లీ సెగ్మెంట్. మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఈ సెగ్మెంట్‌లో పట్టు కోసం వైసీపీ నేతలు పోటీ పడుతున్నారు. ఆధిపత్య పోరు కొనసాగిస్తున్నారు. ఉరవకొండ వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి ఉన్నారు. అయితే… ఆయనకు మరో వైసీపీ నేత, ఎమ్మెల్సీ వై.శివరామరెడ్డితో ఆధిపత్య పోరు నడుస్తోంది. ఎమ్మెల్సీ శివరామరెడ్డి కూడా ఉరవకొండ వైసీపీ ఇన్చార్జ్ పదవి ఆశిస్తున్నారని సమాచారం. దీంతో… ఉరవకొండ వైసీపీలో… రాజకీయ వేడి రగిలింది.
2029, 2024 ఎన్నికల్లోనూ విశ్వేశ్వర్‌రెడ్డికి… వై.శివరామరెడ్డి సహకరించలేదని సమాచారం. విశ్వేశ్వర్‌రెడ్డి ఓటమికి ఇది కూడా ఒక కారణంగా భావిస్తున్నారు. 2024 ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ పొందాలని ఎమ్మెల్సీ శివరామరెడ్డి గట్టిగానే ప్రయత్నించారు. కానీ.. కుదరలేదు. దీంతో… 2029లో టికెట్ కోసం ఇప్పటి నుంచే ఆయన పోటీపడుతున్నట్టు సమాచారం. 2029 ఎన్నికలకు చాలా సమయం ఉండటంతో ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి కాస్త సైలెంట్‌గా ఉన్నారు. కానీ.. ఎమ్మెల్సీ శివరామరెడ్డి మాత్రం ఇదే ఛాన్స్ అనుకుని… గట్టిగా వాయిస్ వినిపిస్తున్నారు. రాజకీయంగా దూకుడు ప్రదర్శిస్తున్నారు.
హంద్రీనీవా కాలువ విషయంలో రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులతో బహిరంగ సవాల్ విసిరారు. కాలువ శ్రీనివాసులు కూడా ఎమ్మెల్సీకి సవాల్ చేశారు. జీడిపల్లి డ్యాం వద్ద చర్చకు రావాలన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ మాత్రం ఉరకొండ శిలాఫలకం దగ్గర రావాలని ఛాలెంజ్ చేశారు. ఈనెల 21న ఇద్దరి మధ్య ఈ సవాళ్ల పర్వం నడిచింది. కాలువ శ్రీనివాసులు జీడిపల్లి వెళ్తే… ఎమ్మెల్సీ శివరామరెడ్డి మాత్రం ఉరవకొండ వెళ్లారు. ఇద్దరూ చెరో చోట కూర్చొని.. అక్కడికే చర్చ జరగాలని పట్టుబట్టారు. దీంతో.. హైడ్రామా తప్ప… చర్చ మాత్రం జరగలేదు. అయితే.. ఈ ఇష్యూతో వైసీపీ ఎమ్మెల్సీ శివరామరెడ్డి తాను అనుకున్న పొలిటికల్ మైలేజ్‌ని మాత్రం సంపాదించుకున్నారు. భవిష్యత్‌లోనూ ఇదే దూకుడు ప్రదర్శించాలని ఆయన అనుకుంటున్నారట. అయితే… ఎమ్మెల్సీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని విశ్వేశ్వర్‌రెడ్డి వర్గీయులు ప్లాన్లు చేస్తున్నారు. ఇద్దరి మధ్య పోటీలో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.