
విశాఖపట్నం జిల్లాలోని అవంతి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న బిటెక్ విద్యార్థినికి తీవ్రంగా కలచివేసే అనుభవం ఎదురైంది. అదే కాలేజీలో చదువుతున్న మరో విద్యార్థి పరిచయం పేరుతో ఆమెను నమ్మించి భౌతికంగా, మానసికంగా వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అవంతి ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ చదువుతున్న ఓ విద్యార్థినికి అదే కాలేజీలో ఎంసీఏ చదువుతున్న దిలీప్ అనే యువకుడు ఇన్ స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యాడు. పరిచయం కాస్తా స్నేహంగా మారి, ఇద్దరూ తరచూ చాటింగ్ చేయడం, ఫోన్‌లో మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఈ క్రమంలో జనవరి 21న దిలీప్ తన ప్రేమను వ్యక్తం చేస్తూ ఆమెకు ప్రపోజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
అదే రోజు సాయంత్రం తనతో మాట్లాడాలని చెప్పిన దిలీప్ విద్యార్థిని హాస్టల్ వద్దకు వచ్చాడు. ఆమె నిరాకరించినప్పటికీ బలవంతంగా తన బండిపై ఎక్కించుకుని బయటకు తీసుకెళ్లినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. భీమిలి బీచ్ వద్దకు తీసుకెళ్లి ఆమెపై దాడికి యత్నించినట్లు, నొప్పితో బాధపడుతుండగా హాస్టల్ వద్ద దించుతానని నమ్మబలికి రాళ్లవలస ప్రాంతంలోని ఓ లాడ్జికి తీసుకెళ్లినట్లు తెలిపింది.
అక్కడ ఆమెను భౌతికంగా హింసించడమే కాకుండా అసభ్యకరమైన రీతిలో ఫోటోలు, వీడియోలు తీసినట్లు బాధితురాలు ఆరోపించింది. వాటిని చూపిస్తూ బ్లాక్మెయిల్‌కు పాల్పడిన దిలీప్.. ఎవరికైనా ఈ విషయం చెబితే ఫోటోలు, వీడియోలను కాలేజీ గ్రూప్‌లో పెడతానని బెదిరించినట్లు పేర్కొంది. ఈ క్రమంలో ఆమెపై తీవ్ర అఘాయిత్యానికి పాల్పడినట్లు ఫిర్యాదులో వివరించింది.
అఘాయిత్యం అనంతరం అదే రోజు రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో విద్యార్థినిని తిరిగి హాస్టల్ వద్ద దించినట్లు పోలీసులు తెలిపారు. అయితే మరుసటి రోజు నుంచి దిలీప్ ప్రవర్తన పూర్తిగా మారిపోయిందని బాధితురాలు పోలీసులకు వివరించింది. తనకు, ఆమెకు ఎలాంటి సంబంధం లేదని, ఇకపై తన జీవితంలోకి రావొద్దని హెచ్చరించడమే కాకుండా.. వస్తే ఫోటోలు, వీడియోలను కాలేజీ గ్రూప్‌లో షేర్ చేస్తానని బెదిరించినట్లు తెలిపింది.
ఈ ఘటనతో తీవ్ర మానసిక వేదనకు గురైన విద్యార్థిని భీమిలి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ కేసుపై విశాఖపట్నం పోలీస్ కమిషనర్ స్పందిస్తూ.. దర్యాప్తు వేగంగా కొనసాగుతోందని, నిందితుడిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని వెల్లడించారు. కాలేజీ పరిసరాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సోషల్ మీడియా పరిచయాల విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
ALSO RAED: ప్రియుడి ఇంటికి నిప్పు పెట్టిన ప్రియురాలు





