
మధ్యప్రదేశ్‌లోని మాండ్సౌర్ జిల్లా ధమనార్ గ్రామంలో రైతులు తమ సమస్యలను ప్రజలకు తెలియజేయడానికి విభిన్నంగా నిరసన తెలిపారు. ఉల్లిగడ్డ ధరలు మార్కెట్లో అత్యధికంగా తగ్గిపోవడంతో, ఉత్పత్తి ఖర్చు కూడా తిరిగి రాకపోవడంతో, రైతులు ఉల్లిపాయలకు వినూత్నంగా అంత్యక్రియల ఊరేగింపునే నిర్వహించారు. పూలతో అలంకరించిన పాడెను, డప్పులు, బ్యాండ్‌తో కలిసి గ్రామ శ్మశానవాటిక వరకు తీసుకెళ్లి ఉల్లిగడ్డల “చివరి యాత్ర” నిర్వహించారు.
దేశంలో పెద్ద ఉల్లిపాయ పండించే ప్రాంతాల్లో ఒకటైన మాల్వా- నిమార్ బెల్టులో రైతులు ప్రస్తుతం కిలోకు కేవలం 1 రూపాయి నుంచి 10 రూపాయల వరకే ధర పొందుతున్నామని చెబుతున్నారు. చాలా చోట్ల ధర కిలోకు 1-2 రూపాయలకే పడిపోగా, ఉత్పత్తి వ్యయం 10-12 రూపాయలు ఉండడంతో భారీ నష్టాలు తప్పడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయపరమైన ధరలు రాకపోవడంతో ఈ నిరసన చేయక తప్పలేదని రైతు బద్రీలాల్ ధాఖడ్ తెలిపారు. ఖర్చులు అంతా రైతులే భరిస్తూ, కనీసం పెట్టుబడి తిరిగి రానప్పుడు ప్రభుత్వం స్పందించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.
మరో రైతు దేవీలాల్ విశ్వకర్మ మాట్లాడుతూ.. ఉల్లిపాయలు తమ పిల్లలలాంటి వారు, కుటుంబ భాగమని చెప్పారు. రెండో పంట అధిక వర్షాల వల్ల నాశనమైందని, ఇప్పుడు ఈ పంట కూడా ‘చనిపోయిందని’ భావించి అంత్యక్రియలు నిర్వహించామని చెప్పారు. ప్రభుత్వం పంట ఖర్చుకైనా సరిపడని ధర ఇస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఉల్లిపాయలపై కొనసాగుతున్న 25 శాతం ఎగుమతి సుంకం కారణంగా భారతీయ ఉల్లిపాయలు అంతర్జాతీయ మార్కెట్లో పోటీ చేయలేకపోతున్నాయని రైతులు చెబుతున్నారు. ఫలితంగా ఎగుమతులు గణనీయంగా తగ్గి, దేశీయ మార్కెట్‌లో నిల్వలు పెరిగి, ధరలు పతనమయ్యాయని పేర్కొన్నారు. పలుమార్లు విజ్ఞప్తి చేసినా, కేంద్ర ప్రభుత్వం సుంకాన్ని తగ్గించలేదని వారు విమర్శించారు. రైతుల నుంచి ప్రతినిధుల పత్రం స్వీకరించిన తహసీల్దార్ రోహిత్ సింగ్ రాజ్‌పుత్, రైతుల డిమాండ్లు కలెక్టర్‌కు నివేదించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని తెలిపారు.
ALSO READ: Polished Rice: పాలిష్ బియ్యం తింటే కలిగే నష్టాలేంటో తెలుసా?





