
-
ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన దివ్యాంగుడిని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్
జగిత్యాల, ఆగస్టు 11 (క్రైమ్ మిర్రర్): జగిత్యాల కలెక్టరేట్‌లో దివ్యాంగుడిపై పోలీసులు అమానవీయంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. ప్రజావాణి కార్యక్రమంలో తన సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు వచ్చిన మల్లాపూర్ మండలం ముత్యంపేటకు చెందిన రాజ గంగారాంను, సిబ్బంది మరియు ఒక పోలీస్ కానిస్టేబుల్ బలవంతంగా ఈడ్చుకెళ్లారు. రాజ గంగారాం గత కొన్ని ఏండ్లుగా తన ఇంటి సంబంధిత సమస్య పరిష్కారం కోసం పోరాడుతున్నాడు. పలు సార్లు అధికారులను కలసి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో, ఈసారి ప్రజావాణి వేదికను ఆశ్రయించాడు.
కలెక్టర్ నిర్లక్ష్యం : ప్రజావాణి కార్యక్రమానికి కలెక్టర్ సత్య ప్రసాద్ రాగానే, భద్రతా సిబ్బంది గంగారాంను ఈడ్చుకెళ్లారు. ఈ సంఘటనను కలెక్టర్ చూసినా, పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వెళ్లిపోయారని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. దివ్యాంగుడిపై ఈ విధంగా ప్రవర్తించడం మానవతా విలువలకు విరుద్ధమని, అధికారుల నిర్లక్ష్యం ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించిందని స్థానికులు మండిపడుతున్నారు.