
పటాన్ చెరు, క్రైమ్ మిర్రర్:- 65వ జాతీయ రహదారి పనులను కాంట్రాక్టర్ నాసిరకంగా చేస్తున్నాడని బిఆర్ఎస్ యువ నేత, ఎండిఆర్ ఫౌండేషన్ కో–ఫౌండర్ మాద్రి పృథ్విరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పటాన్ చెరు పట్టణ పరిధిలో మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి మూడు లైన్ల విస్తరణ పనుల్లో తీవ్రమైన నాసిరకం పనులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ రహదారి నిర్మాణ పనులను చేపడుతున్న ఆర్ కె సి ఇన్ఫ్రా బిల్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాంట్రాక్టర్, గతంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి లేవనెత్తిన సూచనలు, హెచ్చరికలను పూర్తిగా పట్టించుకోకుండా మళ్లీ అదే అలసత్వంతో నాసిరకం పనులు కొనసాగిస్తున్నాడని ఆరోపించారు. శనివారం శ్రీరామ్ నగర్ కాలనీ సమీపంలో రహదారి పక్కన వర్షపు నీటి పారుదల కోసం నిర్మించిన కాలువపై వేసిన స్లాబు కేవలం సుమారు 4అంగుళాల మందంతో వేశారని అన్నారు. అది ఒక చిన్న వాహనం వెళ్లగానే కూలిపోవడం కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి ప్రత్యక్ష ఉదాహరణగా పేర్కొన్నారు. ఇది కేవలం నిర్మాణ లోపమే కాకుండా, ప్రజల ప్రాణాలకు నేరుగా ముప్పు కలిగించే ప్రమాదకర పరిస్థితి నెల కొని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
Read also : ‘నా భర్త మగాడు కాదు’.. హనీమూన్ నుంచి వచ్చి నవ వధువు షాకింగ్ నిర్ణయం
భారత జాతీయ రహదారి అథారిటీ నిబంధనల ప్రకారం
డ్రైనేజ్ స్లాబులు నిర్దిష్ట లోడ్ కెపాసిటీతో తగిన మందం, నాణ్యత ప్రమాణాలతో టెక్నికల్ ఇన్స్పెక్షన్ అనంతరం మాత్రమే నిర్మించాల్సి ఉండగా, ఈ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తూ పనులు చేయడం అత్యంత ఆందోళనకరమని పృథ్విరాజ్ ఆక్షేపించారు. ఈ ఘటనను గమనించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు సంఘటనా స్థలాన్ని సందర్శించి, అక్కడ ఉన్న ఇన్‌చార్జ్ అమోల్ ని ప్రశ్నించారు. ఇలాంటి నాసిరకం పనులు కొనసాగితే ప్రజల ప్రాణాలు పోవడం ఖాయమని అన్నారు. వెంటనే లోపాలను సరిదిద్దకపోతే ప్రజా వ్యతిరేకత తప్పదని అన్నారు. అవసరమైతే పనులు నిలిపివేసి, పట్టణ ప్రజలమంతా కలిసి ధర్నా కార్యక్రమాలు చేపడతామని పృథ్వీరాజ్ హెచ్చరికలు జారీ చేశారు. జాతీయ రహదారి వంటి అత్యంత కీలక మౌలిక వసతుల నిర్మాణంలో కాంట్రాక్టర్ అలసత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యత ప్రమాణాలు పాటించే వరకు ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని మాద్రి పృథ్విరాజ్ స్పష్టం చేశారు.
Read also : కొత్త సంవత్సరం 2026కు శుభారంభం కావాలంటే ఒకసారి ఇలా చేసి చూడండి!





