దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ ఇండిగో క్రైసిస్.. విమాన ప్రయాణీకులు మీద తీవ్రంగా పడింది. ఒక్కసారిగా వందలాదిగా విమానాలు రద్దు కావడం అందరినీ ఆందోళనకు గురి చేసింది. అయితే, ఇండిగో సంక్షోభం వెనక చాలా కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకీ అవేంటంటే..
ఇండిగో సంక్షభానికి కారణాలు ఇవే!
ఇండిగో సంక్షోభానికి ముఖ్య కారణం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తీసుకొచ్చిన కొత్త నిబంధనలు. పైలట్లకు, ఇతర సిబ్బందికి తగినంత విశ్రాంతి లేకపోవడం విమాన ప్రమాదాలకు కారణమని గుర్తించిన డీజీసీఏ గత ఏడాది జనవరిలో కొత్తగా నిబంధనలను తీసుకొచ్చింది. ఈ ఏడాది నవంబరు నుంచి ఈ నిబంధనలను పూర్తిస్థాయిలో అమల్లోకి తెచ్చింది. విమాన సిబ్బందికి వారాంతపు విశ్రాంతి వ్యవధి గతంలో కంటే పెరిగింది. గతంలో డ్యూటీ షెడ్యూల్‌లో కనీసం ఆరు నైట్ షిఫ్టులు ఉండగా.. ప్రస్తుతం వాటిని రెండుకు కుదించారు. రాత్రి వేళల్ని గతంలో కంటే ఒక గంట అదనంగా పెంచారు. ప్రయాణికులకు చౌకగా సేవలు అందించడానికి వీలుగా ఇండిగో ఎక్కువగా రాత్రి సర్వీసులను నడుపుతూ వస్తోంది. కొత్త నిబంధనలతో రాత్రి వేళల్లో పని చేయడానికి తగినంత మంది సిబ్బంది లేకుండా పోయారు.
రాత్రి పూటే ఎక్కువ సర్వీసులు
ఇండిగో రోజుకు సగటున 2,200 దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుపుతోంది. భారీ సంఖ్యలో, అది కూడా రాత్రి వేళల్లో ఎక్కువగా విమానాలు నడపడంతో డీజీసీఏ నిబంధనల ప్రభావం ఇండిగోపై తీవ్రంగా పడింది. దీని ఫలితంగానే విమానాల రద్దు, షెడ్యూళ్ల మార్పు, ఆలస్యం కొనసాగుతున్నాయి. ఇండిగో సంక్షోభం వెనక ఆ సంస్థ తప్పుకూడా ఉందని పైలట్ల సంఘాలు విమర్శిస్తున్నాయి. ఫ్లయిట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ ను అమలు చేయడానికి డీజీసీఏ రెండేళ్ల సమయం ఇచ్చినప్పటికీ ఇండిగో తగిన ప్రణాళికలు రూపొందించుకోలేదని విమర్శిస్తున్నారు. అందుకే, ఈ గందరగోళం తలెత్తిందంటున్నారు.
సమస్యను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం
గత మూడు రోజులుగా తమ సంస్థ విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారని, వారికి కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్తున్నట్లు ఇండిగో తెలిపింది. ఈమేరకు ఇండిగో సీఈవో పీటర్ ఎల్ బర్స్ కీలక ప్రకటన చేశారు. ఆపరేషనల్ సమస్యలు, టెక్నికల్ సమస్యలు, షెడ్యూళ్లలో మార్పులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, కొత్తగా అమల్లోకి వచ్చిన ఫ్లయిట్ డ్యూటీ నిబంధనల కారణంగా సంక్షోభం తలెత్తిందన్నారు. త్వరలోనే సేవలు సాధారణ స్థితికి వస్తాయన్నారు.
ఇండిగో సంక్షోభంపై కేంద్రం సమీక్ష
ఇండిగో విమానాల రాకపోకల్లో అంతరాయాలపై కేంద్ర పౌర విమానయాన శాఖ సమీక్ష నిర్వహించింది. వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఆ సంస్థకు సూచించింది. ఈ పరిస్థితిని సాకుగా తీసుకొని విమాన చార్జీలు పెంచకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది.





