Indigo Crisis: ఇండిగో సంక్షోభంపై పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సీరియస్ అయ్యారు. ప్రజలను ఇబ్బంది పెట్టే ఏ చర్యలు తాము సమర్థించబోమన్నారు. రాజ్యసభలో విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాదానం చెప్పారు. ఇండిగో విమానాల రద్దుకు ఆ సంస్థ వైఫల్యమే కారణం అన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించిన ఇండిగోపై కఠిన చర్యలు తప్పవన్నారు.
భవిష్యత్తులోనూ ఉల్లంఘనలకు పాల్పడకుండా చర్యలు
‘‘ఇండిగో సిబ్బంది రోస్టరింగ్ సహా అంతర్గత ప్రణాళిక వైఫల్యం కారణంగానే ఈ సంక్షోభం తలెత్తింది. పౌర విమానయాన రంగంలో కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నాం. ఈ నెల 3 వరకు అన్నీ సజావుగానే సాగాయి. తర్వాత ఇబ్బంది తలెత్తింది. విమానాల రద్దుకు దారితీసిన సాఫ్ట్ వేర్ విషయంపై విచారణకు ఆదేశించాం. అన్ని విమాన సంస్థలతోనూ చర్చించాం. విమానాశ్రయాల్లో పరిస్థితులను నియంత్రించాం. దీంతో గత రెండు రోజుల్లో పరిస్థితుల్లో మార్పు స్పష్టంగా కనిపించింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని తేలికగా తీసుకోవడం లేదు. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని రామ్మోహన్‌నాయుడు తెలిపారు. పౌర విమానయాన రంగంలో భవిష్యత్తులో ఉల్లంఘనలకు పాల్పడే వారికి గుణపాఠం చెప్పేలా తమ చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
10 వరకు యథావిధిగా అన్ని సర్వీసులు
అటు ఇండిగో విమాన సర్వీసుల పరిస్థితి నెమ్మదిగా మెరుగుపడుతోంది. మొత్తం 2,300 సర్వీసులకుగాను దేశవ్యాప్తంగా 1,650 సర్వీసులను నిర్వహిస్తోంది. 650 విమానాలు రద్దయ్యాయని ఇండిగో ప్రకటించింది. క్రమక్రమంగా అన్నింటినీ మెరుగుపరుస్తూ వస్తున్నామని, బుధవారానికల్లా పూర్తిస్థాయి సర్వీసులు నిర్వహిస్తామని తెలిపింది.
మొత్తం 138 ప్రాంతాలకుగాను 135 ప్రాంతాలకు సర్వీసులను పునరుద్ధరించినట్టు ఇండిగో వివరించింది. విమానాల రద్దుతో ప్రయాణికులు ఇబ్బందిపడకుండా వీలైనంత ముందుగానే సమాచారం ఇస్తున్నామని పేర్కొంది. రద్దయిన విమానాలకు సంబంధించి ప్రయాణికుల డబ్బును వేగంగా రీఫండ్ చేస్తుమన్నామని తెలిపారు.





