జాతీయం

దేశంలో తగ్గుతున్న జననాలు, పెరుగుతున్న వృద్ధులు!

India’s Birth Rate Down: భారతీయ జనాభాలో వృద్ధుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రతి పది మందిలో ఒకరు 60 ఏళ్ల పైబడిన వారు ఉన్నారు.  ఎస్‌ఆర్‌ఎస్‌- 2023 నివేదికలో ఈ విషయాలు వెల్లడి అయ్యాయి. ఓవైపు పడిపోతున్న జననాల రేటు, మరోవైపు  పెరుగుతున్న వృద్ధులతో భారత్ వృద్ధ దేశం మారుతోందని నిపుణులు వెల్లడిస్తున్నారు. వయోధికుల ఆరోగ్య సంరక్షణ, పింఛన్లు, సామాజిక భద్రత విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తాజా నివేదిక ఏం చెప్తోందంటే?

ఎస్‌ఆర్‌ఎస్‌- 2023 నివేదిక ప్రకారం దేశ జనాభాలో ప్రస్తుతం 60 ఏళ్లు పైబడ్డ వృద్ధులు 9.7 శాతంగా ఉన్నారు. 2011లో అది 8.6గా మాత్రమే ఉంది. 65 ఏళ్లు పైబడ్డ వారిలో పెరుగుదల 6.4 శాతంగా నమోదైంది. 60 ఏళ్లు పైబడిన వయోధికుల జనాభాలో కేరళ 15 శాతంతో అన్ని రాష్ట్రాల కంటే ముందు ఉంది. ఆ తర్వాత స్థానాల్లో తమిళనాడు, హిమాచల్‌, పంజాబ్‌, మహారాష్ట్ర వృద్ధుల జనాభా జాతీయ సగటు 9.7% కంటే ఎక్కువ ఉంది. ఇక బీహార్‌, మధ్యప్రదేశ్‌, యూపీ, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో వయోధికుల జనాభా 8% లోపే ఉంది. అంటే ఈ రాష్ట్రాల్లో జనాభా వృద్ధి బాగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. దక్షిణ, పశ్చిమ భారత రాష్ట్రాల్లో జనాభా తగ్గుముఖం పట్టింది.

నిపుణుల ఆందోళన!

ఇప్పటికీ దేశంలో యువ జనాభా ఎక్కువగానే ఉన్నా.. వృద్ధ జనాభాలో పెరుగుదల, పిల్లల జనాభా తగ్గుదల ఓ హెచ్చరికగా నిపుణులు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వృద్ధుల జనాభా అధికంగా ఉన్న చైనా, జపాన్‌, యూరప్‌ దేశాల సరసన భారత్‌ కూడా చేరడానికి ఎంతో సమయం పట్టదంటున్నారు. వృద్ధులకు సదుపాయాలు కల్పిస్తూనే, యువ జనాభా పెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని తాజా నివేదిక వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button