అంతర్జాతీయం

బాయ్ కాట్ టర్కీ.. భారత్ దెబ్బకు పాక్ మిత్ర దేశం ఢమాల్

ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాకిస్థాన్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటించిన టర్కీపై భారత్‌లోని అన్ని వర్గాలు యుద్దం ప్రకటించాయి. ఇండియా- పాక్ యుద్దంలో ప్రపంంచంలోని మెజార్టీ దేశాలు మనకు మద్దతు ఇవ్వగా.. తుర్కియే, అజర్‌బైజాన్‌వంటి ముస్లిం దేశాలు మాత్రమే పాక్ కు సపోర్ట్ చేశాయి. దీంతో భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ కు అండగా నిలిచిన ఈ రెండు దేశాలతో వాణిజ్య సంబంధాలు తెంచుకోవాలని మన దేశంలోని వివిధ సంఘాలు నిర్ణయించాయి. టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాలతో అన్ని వ్యాపార లావాదేవీలను రద్దు చేసుకోవాలని అఖిల భారత రత్నాభరణాల దేశీయ మండలి కోరింది.

అఖిల భారత వ్యాపారుల సమాఖ్య సైతం ఆ రెండు దేశాలతో వాణిజ్య సంబంధాలను తెంచుకోవాలని నిర్ణయించింది. ఆ రెండు దేశాల నుంచి మన ట్రేడర్లు ఎటువంటి దిగుమతులు చేసుకోరని స్పష్టం చేసింది. భారత ఎగుమతిదార్లు, దిగుమతిదార్లు, వ్యాపార వర్గాలు సైతం ఆ రెండు దేశాల్లోని కంపెనీలతో ఎటువంటి సంబంధాలూ పెట్టుకోరని తెలిపింది. ఆ మేరకు ఒక మెమొరాండంను వాణిజ్య, పరిశ్రమల శాఖ, విదేశీ వ్యవహారాల శాఖకు సమర్పించనుంది. ఈ రెండు దేశాల్లో చిత్రీకరణ జరిపే భారతీయ సినిమాలనూ వ్యాపార వర్గాలు దూరం పెడతాయని.. అందువల్ల కార్పొరేట్‌ సంస్థలు అక్కడ ఎటువంటి సినిమాలూ తీయరాదని తెలిపాయి.

టర్కీ ఎయిర్‌లైన్స్‌తో ఇండిగో కుదుర్చుకున్న లీజింగ్‌ ఒప్పందాన్ని నిలిపేయాలని భారత అధికార్లను ఎయిరిండియా కోరుతున్నట్లు సమాచారం. 2023లో కుదిరిన ఈ ఒప్పందం కింద ఢిల్లీ-ముంబయి-ఇస్తాంబుల్‌ మార్గంలో తుర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌ రెండు విమానాలను, కొంత మంది సిబ్బందిని ఇస్తోంది. దీనివల్ల ఆ దేశ పర్యాటకానికి ఊతం లభిస్తోంది. తుర్కియే మార్బుల్స్, యాపిళ్లు, బంగారం, సిమెంట్, రసాయనాలు, సహజ ముత్యాలు, ఉక్కు దిగుమతి చేసుకుంటున్నాం. అజర్‌బైజాన్‌ నుంచి రసాయనాలు, సుగంధ ద్రవ్యాలు, తోళ్లు దిగుమతి అవుతున్నాయి.ఇప్పటికే తుర్కియే కంపెనీ అనుబంధ సెలెబి ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌ ఇండియా లిమిటెడ్‌కు అనుమతులను మన దేశం రద్దుచేసింది. ముంబయి, దిల్లీ, హైదరాబాద్, కోచి, కన్నూర్, బెంగళూరు, గోవా, అహ్మదాబాద్‌ విమానాశ్రయాల్లో టర్కీ సంస్థ సేవలు అందిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button