
S-400 Air Defence System: రష్యాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా భారత్ కీలక ముందడుగు వేస్తోంది. ఇందులో భాగంగానే ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన గగనతల రక్షణ వ్యవస్థగా గుర్తింపు తెచ్చుకున్న ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్ కు సంబంధించి మరిన్ని యూనిట్స్ ను కొనుగోలు చేసేందుకు రెడీ అయ్యింది. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే మాస్కోతో చర్చలు మొదలయ్యాయి. భారత్ ఇప్పటికే ఎస్-400 వ్యవస్థలను ఉపయోగిస్తున్నది. ఇటీవలే పాకిస్థాన్‌తో ఘర్షణల సమయంలో ఈ ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసింది. పాకిస్థాన్ డ్రోన్లు, మిసైల్స్‌తో దాడికి ప్రయత్నించగా ఎస్-400 సహాయంతో వాటిని భారత్ విజయవంతంగా కూల్చివేసింది. కచ్చితత్వంతో సరిహద్దు నుంచి వైమానిక ముప్పును ఎదుర్కోవడంలో ఈ వ్యవస్థ సమర్థవంతంగా పని చేసిన నేపథ్యంలో.. భారత్ తన వైమానిక రక్షణ సామర్థ్యాన్ని మరింత విస్తరించేందుకు నిర్ణయం తీసుకుంది.
2018లో రష్యాతో కీలక ఒప్పందం
ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు 2018లో రష్యాతో భారత్ 5 బిలియన్ల డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ ఒప్పందం కింద మొత్తం ఐదు ఎస్-400 వ్యవస్థలను కొనుగోలు చేయాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల సరఫరాలో జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలో భారత్‌కు ఇవ్వాల్సిన మిగిలిన రెండు యూనిట్లను 2026లోగా అందజేసేందుకు కట్టుబడి ఉన్నామని రష్యా ఇటీవలే ప్రకటించింది. ఇప్పుడు ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్ అదనపు యూనిట్స్ కోసం రష్యాతో భారత్ చర్చలు ప్రారంభించింది. ఎస్-400 ట్రయాంఫ్ అనేది భూమిపై నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థ. దీన్ని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కూడా మోహరించవచ్చు. ఆకాశంలో దూసుకొచ్చే శత్రువుల జెట్స్, రాకెట్లను ఇది భూమిపై నుంచే కూల్చివేయగల సామర్థ్యం వీటికి ఉంది. విమానాలు, మానవరహిత వైమానిక విమానాలు, క్రూయిజ్ క్షిపణులను ధ్వంసం చేస్తుంది. ఇది టెర్మినల్ బాలిస్టిక్ క్షిపణి రక్షణ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది.