India-Russia Defence Ministers Meet: భారత్ రక్షణ రంగంలో అద్భుతమైన పురోగతి సాధించేందుకు రష్యా అన్ని విధాలుగా సహకరిస్తుందని, ఆ దేశ రక్షణ మంత్రి ఆండ్రే బెలొసోవ్ వెల్లడించారు. భారత సైనిక దళాల ఆధునికీకరణకు రష్యా కట్టుబడి ఉందన్నారు. భారత్, రష్యా వార్షిక సదస్సుకు ముందు సన్నాహకంగా ఇరుదేశాల రక్షణ మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, ఆండ్రే బెలొసోవ్ ఢిల్లీలో భేటీ అయ్యారు. ఇవాళ జరిగే సదస్సులో ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ అయి తీసుకునే కీలక నిర్ణయాలు, జరగనున్న ఒప్పందాలపై చర్చించారు.
భారత్-రష్యా మధ్య మరింత సహకారం
ఈ సందర్భంగా భారత రక్షణ పరిశ్రమ సామర్థ్యాన్ని పెంచుకోవడంతోపాటు దేశీయ ఉత్పత్తి, ఎగుమతులపై దృఢ సంకల్పంతో ముందుకు సాగుతామని రాజ్‌నాథ్ పునరుద్ఘాటించారు. అధునాతన సాంకేతికతల్లో భారత్, రష్యా మధ్య సహకారాన్ని మరింతగా పెంచుకునేందుకు కొత్త అవకాశాలను అన్వేషిద్దామని ప్రతిపాదించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు ఎంతో నమ్మకమైనవన్నారు.
Delighted to meet with the Russian Defence Minister Mr Andrei Belousov in New Delhi. India-Russia relationship is based on a deep sense of trust, common values and mutual respect, which are the defining principles of the special and privileged strategic partnership, between both… pic.twitter.com/y5bKoo8bCS
— Rajnath Singh (@rajnathsingh) December 4, 2025
భారత్ కు రక్షణగా రష్యా
అటు భారత్ రక్షణ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించేందుకు రష్యా రక్షణ పరిశ్రమ తోడ్పడుతుందని ఆండ్రే బెలొసోవ్ హామీ ఇచ్చారు. భారత సైనిక దళాల ఆధునికీకరణకు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అస్థిరతలు నెలకొన్న సమయంలోనూ భారత్, రష్యా రక్షణ సహకారం బలంగా ముందుకు సాగుతోందన్నారు. భారత్, రష్యా మధ్య దృఢమైన స్నేహం కాలపరీక్షను తట్టుకుని నిలిచిందని.. దక్షిణాసియా ప్రాంతంలో సమతుల్యతకు ఇది మార్గం వేసిందన్నారు. భేటీ అనంతరం రక్షణ శాఖ ఈ వివరాలు వెల్లడించింది. ఈ సమావేశానికి ముందు రాజ్‌నాథ్, బెలోసోవ్ నేషనల్ వార్ మెమొరియల్ వద్ద నివాళి అర్పించారు. కాగా, ఆపరేషన్ సిందూర్‌లో అద్భుత పనితీరు చూపిన రష్యా ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థలు మరిన్నింటిని కొనేందుకు భారత్ నిర్ణయించింది.





