India Evacuation Plan for Citizens in Iran: గత కొద్ది సంవత్సరాలుగా రాజకీయ, ఆర్థిక, సామాజిక అసంతృప్తులు, మరోవైపు అమెరికా, పశ్చిమ దేశాల కఠిన ఆంక్షలు నేపథ్యంలో ఇరాన్ అగ్నిగుండంలా మారింది. ఇరాన్ ప్రజల ఆందోళనలు, అల్లర్ల నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ ఉన్న భారతీయుల్ని సురక్షితంగా ఇండియాకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. విద్య, వ్యాపారం, ఉపాధి కోసం అక్కడికి వెళ్లి ఆపదలో చిక్కుకున్న వాళ్లను సేఫ్ గా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇరాన్‌లో భారీ నిరసనలు, అల్లర్ల నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుండటంతో మొదటి విడత భారతీయులను ఇవాళ విమానాల్లో తరలించే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.
విదేశాంగశాఖ కీలక ఆదేశాలు
ఇరాన్‌లో ఉన్న భారతీయులు, ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, భద్రతా పరంగా ప్రమాదంలో ఉన్నారని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖ ఇప్పటికే అలర్ట్ జారీ చేసింది. భారతీయులు నిరసన ప్రాంతాలకు దూరంగా ఉండాలని, అవసరమైతే అందుబాటులో ఉన్న విమానాల ద్వారా ఇరాన్ విడిచి రావాలని సూచించింది.
భారతీయుల భద్రతే లక్ష్యంగా చర్యలు
ఇండియన్ ఎంబసీ, టెహ్రాన్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అవసరమైతే ప్రత్యేక విమానాల ద్వారా తరలింపు చేపడతామని కేంద్రం తెలిపింది. పరిస్థితిని బట్టి తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. ఇరాన్‌లో పరిస్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో భారతీయుల భద్రతే అత్యంత ప్రాధాన్యతగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.





