India-EU Trade Deal: భారత్-ఈయూ ట్రేడ్ డీల్ నేపథ్యంలో మనకు చాలా మేలు జరగనుంది. ఉద్యోగాలు, విద్యతో పాటు అక్కడ ఈయూ దేశాల వస్తువులను చౌక ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
తగ్గనున్న కార్ల ధరలు
యూరప్ నుంచి దిగుమతి అయ్యే కార్లపై ప్రస్తుతం 125శాతం వరకు సుంకాలు ఉన్నాయి. తాజా ఒప్పందం సుమారు రూ.16 లక్షల పైన ధర ఉన్న కార్లపై సుంకాలు 40 శాతానికి తగ్గుతాయి. తర్వాత దశలవారీగా 10శాతానికి తగ్గిస్తారు. దీనితో యూర్‌పకు చెందిన బీఎండబ్ల్యూ, ఆడి, మెర్సిడెజ్, లాంబోర్గిని, పోర్షే వంటి కార్ల ధరలు భారీగా తగ్గుతాయి. ఉదాహరణకు భారత్‌లో లాంబోర్గిని కార్ల ప్రారంభ ధర ప్రస్తుతం సుమారు రూ.3.8 కోట్ల వరకు ఉంది. ఒప్పందం అమల్లోకి వచ్చాక.. సుమారు రూ.2 కోట్లకు ఆ ధర తగ్గిపోయే అవకాశముంది. మరోవైపు భారత్ నుంచి యూరప్ దేశాలకు ఎగుమతి చేసే కార్లపైనా అక్కడి సుంకాలను 10 శాతానికి తగ్గిస్తారు. ఇది భారత కంపెనీలకు ప్రయోజనం కలిగిస్తుంది.
మద్యంపై సుంకాల తగ్గింపు
యూరప్ దేశాల నుంచి భారత్‌కు వచ్చే వైన్, విస్కీ, వోడ్కా, బీర్ వంటివాటిపై 150శాతం వరకు దిగుమతి సుంకాలు ఉన్నాయి. ఒప్పందం అమల్లోకి వస్తే వైన్‌పై 30శాతానికి, వోడ్కా, విస్కీ వంటి ఆల్కాహాల్ ఉత్పత్తులపై 40 శాతానికి, బీర్లపై 50 శాతానికి సుంకాలు తగ్గుతాయి. దీనితో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఫ్రెంచ్, ఇటలీ, స్పెయిన్ వైన్, ఇతర ఆల్కాహాలిక్ ఉత్పత్తులు భారత్‌లో తక్కువ ధరకు దొరుకుతాయి. ఇదే సమయంలో భారత వైన్స్, ఆల్కాహాలిక్ ఉత్పత్తులపై యూరప్ దేశాల్లో సుంకాలు తగ్గుతాయి.
తగ్గనున్న ఔషధాల ధరలు
క్యాన్సర్ ఔషధాలు, బరువు తగ్గించే మందులు సహా కీలక ఫార్మా ఉత్పత్తుల ధరలు 11 శాతం వరకు, వైద్య పరికరాలు ధరలు 25శాతం వరకు తగ్గుతాయి. మందుల తయారీకి వాడే ముడి పదార్థాల ధరలు తగ్గడం వల్ల దేశంలో ఫార్మా కంపెనీలకు ప్రయోజనం కలగనుంది.
అటు విమానాలు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలకా్ట్రనిక్ ఉత్పత్తులపై భారత సుంకాలు తగ్గుతాయి. యూరప్ నుంచి దిగుమతయ్యే ఇనుము, స్టీలు, రసాయన ఉత్పత్తులపై సుంకాలను ఎత్తివేయనున్నారు. దీనితో ఆయా ఉత్పత్తుల ధరలు తగ్గుతాయి. ఇక భారత్ నుంచి యూరప్ దేశాలకు వస్త్రాలు, తోలు ఉత్పత్తులు, ఆభరణాల ఎగుమతులు గణనీయంగా పెరుగుతాయి. బిస్కట్లు, పాస్తా, చాకోలెట్లు, పండ్ల రసాలు వంటి ప్రాసెస్డ్ ఉత్పత్తులు, ఆలివ్ ఆయిల్, ఇతర నూనెలపై సుంకాలు ఎత్తివేయడం వల్ల ధరలు తగ్గే అవకాశం ఉంటుంది.





