
PM Modi Xi Meeting: భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదాలను సామరస్యంగా, సహేతుకంగా, పరస్పర అంగీకారంతో పరిష్కారం సాధించేంలా కృషి చేయాలని ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ నిర్ణయించారు. ఇరుదేశాల వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే చర్యలపై అంగీకారానికి వచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరుతో ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య అస్థిరత నెలకొన్న సమయంలో మోడీ, జిన్ పింగ్ భేటీలో వాణిజ్యంపై ప్రత్యేకంగా చర్చించడం ప్రాధాన్యం సంతరించుకుంది. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో పాల్గొనేందుకు చైనా వెళ్లిన ప్రధాని మోడీ.. జిన్ పింగ్ తో భేటీ అయి చర్చించారు.
ఉగ్రవాద నిర్మూలన, సహేతుక వాణిజ్యంపై కీలక నిర్ణయం
మోడీ, జిన్ పింగ్ భేటీకి సంబంధించి విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను మరింత పెంచేందుకు, వాణిజ్య లోటును తగ్గించే దిశగా చర్యలు తీసుకునేందుకు ఇరువురు నేతలు అంగీకరించారు. ఉగ్రవాద నిర్మూలన, సహేతుక వాణిజ్యం అంశాలపై అంతర్జాతీయ వేదికలపై పరస్పర అవగాహనతో వ్యవహరించాలనే నిర్ణయానికి వచ్చారు. ప్రపంచ వాణిజ్యంలో స్థిరత్వాన్ని తీసుకురావడంలో ఇరుదేశాల పాత్ర కీలకమని గుర్తించారు. ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలను విస్తరించడానికి రాజకీయ, వ్యూహాత్మక కోణంలో ముందుకు సాగాల్సిన అవసరంపై ప్రత్యేకంగా చర్చించారు.
భారత్-చైనా శత్రువులు కాదు!
భారత్- చైనా శత్రువులు కాదని.. అభివృద్ధి భాగస్వాములని మోడీ, జిన్ పింగ్ అభిప్రాయపడ్డారు. ఇరుదేశాల మధ్య నెలకొన్న భిన్నాభిప్రాయాలు వివాదాలుగా మారవద్దన్నారు. ఇరుదేశాల ప్రజల మధ్య బంధాలను బలోపేతం చేయడానికి వీలుగా.. నేరుగా విమాన సర్వీసుల పునరుద్ధరణ, వీసా ప్రక్రియ సరళతరం చేయడం, పర్యాటక వీసాల జారీ, మానస సరోవర్ యాత్ర పునః ప్రారంభం వంటి చర్యలపై దృష్టిసారించాలని నిర్ణయించారు. ఇరు దేశాల సరిహద్దుల్లో సైన్యాలను వెనక్కితీసుకోవడం, ఉద్రిక్తలను తగ్గించేందుకు తీసుకున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు.