క్రీడలుజాతీయం

Ind Vs SA: వైజాగ్ లో టీమిండియా ఈజీ విక్టరీ, 2-1 తేడాతో సిరీస్ కైవసం!

విశాఖ వేదికగా జరిగిన వన్డేలో భారత్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. 271 పరుగుల విజయ లక్ష్యాన్ని కేవలం ఒకే ఒక్క వికెట్ కోల్పోయి సాధించింది. 2-1 తేడాతో వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది.

విశాఖపట్నం వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఈజీగా విజయం సాధించింది. 271 పరుగుల విజయ లక్ష్యంతో ఛేదనకు దిగిన భారత్.. కేవలం ఒక వికెట్ కోల్పోయి 39.5 ఓవర్లలోనే ఆటను ముగించింది. యశస్వి జైస్వాల్(116) అద్భుత సెంచరీతో చెలరేగాడు. వన్డేల్లో యశస్వికి ఇది ఫస్ట్ సెంచరీ. 75 బంతుల్లో అర్ధ శతకం చేసిన జైస్వాల్.. మరో 36 బంతుల్లోనే సెంచరీ కొట్టేశాడు.

కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ(75) తొలి వికెట్‌గా వెనుదిరిగిన తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ(65) ఆది నుంచి దూకుడుగా ఆడుతూ నాటౌట్‌గా నిలిచాడు. ఈ మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. జైస్వాల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కగా, కోహ్లీకి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ కైవసం చేసుకున్నాడు.

డికాక్‌ సెంచరీ వృథా:

తొలుత బ్యాటింగ్‌కు దిగిన సఫారీలు..డికాక్‌ సెంచరీతో చెలరేగడంతో గౌరవ ప్రదమైన స్కోరు అందుకుంది. రికల్టన్‌(0) వికెట్‌ను తొలుతే కోల్పోయిన దక్షిణాఫ్రికాను డికాక్‌ ఆదుకున్నాడు. కెప్టెన్‌ బవుమా(48)తో కలిసి జట్టును గాడిలో పడేశాడు. వీరిద్దరు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ కీలక పరుగులు జోడించారు. ముఖ్యంగా డికాక్‌..ప్రసిద్ధ్‌ ను లక్ష్యంగా చేసుకుంటూ బౌండరీలతో చెలరేగాడు. ఒకే ఓవర్‌లో 18 పరుగులతో విరుచుకుపడ్డాడు.

అయితే బవుమా ఔటవ్వడంతో సఫారీ జట్టు డీలా పడింది. ఇదే అదనుగా ప్రసిద్ధ్‌ చెలరేగడంతో బ్రిట్జె(24), మార్క్మ్‌(1), డికాక్‌, బ్రెవిస్‌(29) వరుసగా వికెట్లు కోల్పోయారు. 114 పరుగులకు రెండు వికెట్లతో మెరుగ్గా కనిపించిన దక్షిణాఫ్రికా 199 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. ప్రసిద్ధ్‌ కృష్ణ టాపార్డర్‌ ను వెనక్కి పంపితే, లోయార్డర్‌ ను కుల్దీప్‌ భయపెట్టాడు. వచ్చిన బ్యాటర్‌ వచ్చినట్లు పెవిలియన్‌ చేరడంతో 47.5 ఓవర్లలో దక్షిణాఫ్రికా 270 స్కోరుకు పరిమితమైంది.

20 వేల క్లబ్‌లో రోహిత్‌ శర్మ

వైజాగ్ వేదికగా రోహిత్‌శర్మ అరుదైన రికార్డు అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లు కలిసి 20 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన నాలుగో భారత బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button