తెలంగాణ

మొదటి దశలో ఇందిరమ్మ ఇండ్లను అత్యంత నిరుపేదలకు మాత్రమే కేటాయించాలి : సీఎం

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ :-
ఇందిరమ్మ ఇండ్లను మొదటి దశలో అత్యంత నిరుపేదలకు, అర్హులకు మాత్రమే కేటాయించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పథకం పారదర్శకంగా, నిరుపేదలకు న్యాయం చేసేలా అమలు కావాలని ఉద్ఘాటించారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో కలిసి ఇందిరమ్మ ఇండ్ల పై ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. “ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీలు అత్యంత జాగ్రత్తగా పనిచేయాలి. కమిటీలు తయారు చేసిన అర్హుల జాబితాను తహశీల్దార్, ఎంపీడీఓ, ఇంజినీర్లతో కూడిన మండల స్థాయి బృందం క్షేత్రస్థాయిలో స్వయంగా తనిఖీ చేసి, ధృవీకరించాలి.

ఒకవేళ అనర్హులకు ఇండ్లు కేటాయించినట్లు తేలితే, వెంటనే ఇందిరమ్మ కమిటీకి తెలియజేసి, ఆ స్థానంలో అర్హులైన వారికి గృహం మంజూరు చేయాలి. పథకంలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చూడాలి. దందాలకు పాల్పడే వారిపై తక్షణమే కేసులు నమోదు చేయాలి. అనర్హులు ఇండ్లు నిర్మించుకున్నట్లు తేలితే చట్టపరమైన చర్యలతో పాటు, వారు పొందిన నిధులను వసూలు చేయాలి. లబ్ధిదారుల సౌకర్యం కోసం అదనపు సదుపాయాలను కల్పించాలి. గృహ నిర్మాణంలో లబ్ధిదారులు తమ అవసరాలకు అనుగుణంగా 50 శాతం అదనపు స్థలాన్ని నిర్మించుకునే అవకాశం కల్పించాలి.ఇందిరమ్మ ఇండ్లకు సిమెంట్, స్టీల్ వంటి నిర్మాణ సామగ్రిని సరసమైన ధరలకు అందుబాటులో ఉంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరుపేదల జీవితాల్లో వెలుగు నింపే లక్ష్యంతో రూపొందింది కాబట్టి ఈ పథకం అమలులో పారదర్శకత, నిజాయితీ ప్రధానంగా ఉండాలి. అర్హులైన వారికి మాత్రమే ఈ గృహాలు దక్కేలా చూడాలి” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button