
మిర్యాలగూడ,క్రైమ్ మిర్రర్:- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా, ఎలాంటి అంతరాయం లేకుండా జరిగేలా మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని నిమజ్జన కేంద్రాలను అధికారులు శుక్రవారం పరిశీలించారు. నల్లగొండ జిల్లా అదనపు కలెక్టర్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ ఎం. నారాయణ్ అమిత్, డీఎస్పీ కె. రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో అధికారులు నిమజ్జన కేంద్రాల వద్ద ఏర్పాట్లను సమీక్షించారు. దామరచర్ల మండలం వాడపల్లి కృష్ణానది, వేములపల్లి మండలం వేములపల్లి గ్రామం వద్ద నాగార్జునసాగర్ ఎడమ కాల్వ, అనుముల మండలం 14వ మైలు వద్ద సాగర్ ఎడమ కాల్వ, పెద్దవూర మండలం దయ్యాలగండి వద్ద నాగార్జునసాగర్ ప్రాంతాలను సందర్శించారు.నిమజ్జన సమయంలో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, లైటింగ్, బారికేడింగ్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. జనసమూహ నిర్వహణ కోసం పోలీసు సిబ్బంది, అత్యవసర పరిస్థితుల కోసం వైద్య బృందాలు, నిరంతర విద్యుత్ సరఫరా, తగినంత పారిశుద్ధ్య చర్యలు తప్పనిసరిగా అమలు చేయాలని సబ్ కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.“ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, శాంతియుత వాతావరణంలో నిమజ్జనాలు జరగాలంటే అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలి” అని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, పోలీస్, వైద్య, విద్యుత్, ఆర్‌అండ్‌బి శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Read also : ఇక అసెంబ్లీకి రాను: కోమటిరెడ్డి
Read also : పవన్‌ను వెంటాడుతున్న సుగాలి ప్రీతి కేసు.. అసలు ఏం జరిగింది?