
Telangana Rains: తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దాని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నిర్మల్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అటు జనగాం, ఆదిలాబాద్, కామారెడ్డి, జనగాం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నల్లగొండ, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్జ్ జారీ చేసింది.
రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
ఇక బుధవారం నాడు కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతాయని అంచనా వేసింది. ఆదిలాబాద్, హన్మకొండ, కామారెడ్డి, ఖమ్మం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని హెచ్చరించింది. ఈ నెల 4న రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.
గత 24 గంటల్లో ఏటూరునాగారంలో అత్యాధిక వర్షపాతం
గత 24గంటల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, కామారెడ్డి, పెద్దపల్లి, మంచిర్యాల, వరంగల్, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ములుగు జిల్లా ఏటూరునాగారంలో 11.7, కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో 15, కొత్తగూడెంలో 19.2, నాగుపల్లెలో 12, మహమూబాబాద్ జిల్లా భూపతిపేటలో 11.9 సెంటీమీటర్ల భారీ వర్షపాతం రికార్డయ్యిందని వాతావరణ అధికారులు తెలిపారు.