
Telangana Rains: రాష్ట్రంలో మరో 5 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రుతుపవన ద్రోణి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ ఎత్తులో కొనసాగుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు కీలక ప్రకటన విడుదల చేసింది. ద్రోణి ప్రభావంతో ఈనెల 27 వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలపై ఈ ప్రభావం ఉంటుందన్నారు. అటు నిన్న(గురువారం) పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసినట్టు తెలిపింది.
ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
ఇవాళ (శుక్రవారం) రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వానలు కురుస్తాయని తెలిపింది. గడిచిన 24 గంటల్లో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనథ్‌లో అత్యధికంగా 2.95 సెం.మీ, ములుగు జిల్లా వాజేడులో 2.55 కన్నాయిగూడెంలో 2.33, గట్టులో 1.61 సెం.మీ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెలలో 1.60 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఇప్పటికే రాష్ట్రంలో సాధారణ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.