
Heavy Rains: రుతుపవనాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 29 వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శుక్రవారం నాడు ఖమ్మం జిల్లా కల్లూరులో 4.5 సెం.మీ వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లా మంగపేటలో 3 సెం.మీ, మెదక్ జిల్లా పాపన్నపేటలో 2.6సెం.మీ, పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 2.5 సెం.మీ, యాదాద్రి జిల్లా పాముకుంట, జగిత్యాల జిల్లా ఎండపల్లిలో 1.8 సెం.మీ చొప్పున, నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లిలో 1.5 సెం.మీ, కరీంనగర్ జిల్లా చొప్పదిండిలో 1.4 సెం.మీ, సిరిసిల్ల జిల్లా వీరన్నపల్లి, నారాయణపేట కోస్గిలో 1.3 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.
ఇవాళ,రేపు వర్షాలు కురిసే జిల్లాలు
ఇవాళ(జూలై 26) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక ఆదివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వర్షాలు కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులు
అటు భారీ వర్షాల నేపథ్యంలో సీనియర్ ఐఏఎస అధికారులను ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు నియామకాల ఉత్తర్వులను జారీ చేశారు. అనంతరం వారితో సచివాలయంలో సమావేశం నిర్వహించారు. వర్షాలు, రేషన్ కార్డుల పంపిణీ, యూరియా సరఫరా వంటి అంశాలనుపై చర్చించారు. వర్షాల నేపథ్యంలో పరిస్థితులను పరిశీలించడానికి జిల్లాల సందర్శనకు వెళ్లాలని ఆదేశించారు. అదే సమయంలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు ఇబ్బందులు లేకుండా అమలయ్యేలా చూడాలని ఆదేశించారు. వర్షాలు, వరదల నేపథ్యంలో అన్ని జిల్లాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో ఆయా జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మరోవైపు వర్షాలం నేపథ్యంలో ‘ఆపద మిత్రా’ బృందాలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్లకు డిజాస్టర్ మేనేజ్ మెంట్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ సూచించారు. ప్రజలకు ఆపద కలకుండా వీరిని సేవలు తీసుకోవాలన్నారు.
Read Also: మొరాయించిన మూసీ గేట్లు.. ఒకదానికి పూజ.. మరొకటి ఓపెన్!