
Telangana Rains: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ జోరు వాన పడుతోంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశాలున్నాయి. రుతుపవన ద్రోణి కూడా కొనసాగుతోంది. ఈ ప్రభావంతో నిన్న ముసురులా మొదలైన వాన, కంటిన్యూగా పడుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలంగాణలో బుధ, గురువారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
హైదరాబాద్ లో నిన్నటి నుంచి భారీ వర్షం
హైదరాబాద్ లో రాత్రి నుంచి కుండపోత వాన పడుతోంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా కాలనీలు నీటమునిగాయి. నగర వ్యాప్తంగా పలు రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ప్రయాణీకులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీళ్లు జామ్ అయిన ప్రాంతాల్లో క్లియర్ చేసేందుకు హైడ్రా బృందాలు రంగంలోకి దిగాయి. ప్రజలకు ఇబ్బందులు కలకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాయి.
మరో 2 రోజుల పాటు వానలు
ఇక ఇవాళ మంచిర్యాల, పెద్దపల్లి, ఆసిఫాబాద్, ములుగు, సిరిసిల్ల, హన్మకొండ, వరంగల్, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, జనగాం, మెదక్, కామారెడ్డి, నిర్మల్, నారాయణపేట్, వనపర్తి జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ నాగరత్న వెల్లడించారు. హైదరాబాద్‌లో మరో 2 రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.