ఆంధ్ర ప్రదేశ్రాజకీయం

ఈసారికి జగన్‌ను క్షమిస్తున్నా - శృతిమించితే ఊరుకోమంటూ స్పీకర్‌ అయ్యన్న రూలింగ్‌

వైఎస్‌ జగన్‌ తీరుపై ఏపీ స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. బెదిరింపులు, అభియోగాలతో గత ఏడాది జగన్‌ రాసిని లేఖను శాసనసభలో ప్రస్తావించారాయన. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ అవాకులు, చవాకులు పేలుతున్నారని అన్నారు. స్పీకర్‌కి హైకోర్టు సమన్లు కూడా ఇచ్చినట్టు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. స్పీకర్‌కు దురుద్దేశాలను ఆపాదించడం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని.. అయినా ఈసారికి జగన్‌ను క్షమిస్తున్నానని అన్నారు అయ్యన్న. జగన్‌ ఇలాగే వ్యవహరిస్తే మాత్రం.. ఏం చేయాలో సభకే వదిలి పెడుతానని స్పష్టం చేశారు.

వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్‌ తీరుపై… శాసనసభలో రూలింగ్‌ ఇచ్చారు స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు. 2024, జూన్‌ 24న… ప్రతిపక్ష హోదా కోరుతూ… వైఎస్‌ జగన్‌ తనకు ఒక లేఖ రాశాడని సభ దృష్టికి తెచ్చారు. ఆ లేఖలో అభియోగాలు, ప్రేలాపనలు, బెదిరింపులు చేశారని చెప్పారు. ప్రతిపక్ష హోదా అర్హత ఉందంటూ జగన్‌ అసంబద్ధ వాదన చేస్తున్నారని మండిపడ్డారు. తనకు లేఖ రాసిన కొద్దిరోజుల తర్వాత ఈ అంశంపై జగన్‌ హైకోర్టుకు వెళ్లారని.. ప్రతిపక్ష హోదా కల్పించాలని అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్‌ కార్యదర్శిని ఆదేశించాలని పిటిషన్‌ వేశారని చెప్పారు. ఆ పిటిషన్‌ విచారణకు అర్హత పొందే దశలోనే ఉందని సభకు తెలిపారు స్పీకర్‌. అయితే… ఆ పిటిషన్‌లో స్పీకర్‌, శాసనసభా మంత్రిని మినహాయించాలని అడ్వకేట్‌ జనరల్‌ విజ్ఞప్తి చేయగా.. కోర్టు అనుమతించిందని చెప్పారు. అయినా… స్పీకర్‌ను హైకోర్టు ఆదేశించినట్టు జగన్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు అయ్యన్న పాత్రుడు. విచారణ అర్హత పొందని రిట్‌ పిటిషన్‌పై తప్పుడు ప్రచారం చేయడం విచారకరమని… అందుకే తప్పుడు ప్రచారంపై రూలింగ్‌ ఇస్తున్నా అని చెప్పారు.

2024, జూన్‌ 20 వరకు జగన్‌ ఎమ్మెల్యేగా ఎన్నికైనట్టు స్పీకర్‌ కార్యాలయానికే తెలియజేయలేదని అన్నారు. స్పీకర్‌ ప్రమాణస్వీకారానికి ముందే ప్రతిపక్ష హోదా ఎలా నిర్ధారిస్తారని కూడా ప్రశ్నించారాయన. ప్రతిపక్ష హోదా ఇచ్చే నిర్ణయం పూర్తిగా స్పీకర్‌కే ఉంటుందని సభలో స్పష్టంగా చెప్పారు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు. రాజ్యాంగం, కోర్టు తీర్పులు, సంప్రదాయాల ప్రకారమే ప్రతిపక్షహోదాను నిర్ధారించగలమని తెలిపారు. సెక్షన్‌ 12B ప్రకారం స్పీకర్‌ నిర్ణయానికి తిరుగుండదని.. ప్రతిపక్ష హోదా కావాలంటే 1/10 సభ్యులు ఉండాల్సిందే అన్నారు. ఈ సభలో ఏ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదన్నారు స్పీకర్‌. 5, 7, 8, 16, 17వ లోక్‌సభల్లోనూ ప్రతిపక్ష హోదా ఏ పార్టీకి దక్కలేదన్న విషయాన్ని ప్రస్తావించారు. స్పీకర్‌కు దురుద్దేశాలను ఆపాదించడం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందన్న అయ్యన్నపాత్రుడు… జగన్‌ చేసిన ఆరోపణలను సంధి ప్రేలాపనలుగా భావించి క్షమిస్తున్నానని చెప్పారు. ఇలాగే కొనసాగితే ఏం చేయాలో సభ్యులు నిర్ణయిస్తారని చెప్పారాయన. సభకు వైసీపీ సభ్యులు హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.

స్పీకర్‌ రూలింగ్‌ ఇచ్చిన తర్వాత.. సభ్యులు మాట్లాడారు. వైసీపీ ఆరోపణలపై సభా హక్కుల సంఘం వేయాలని డిమాండ్‌ చేశారు. జనసేన డిమాండ్‌ కూడా ఇదే అని మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. జనసేన డిమాండ్‌ను పరిశీలిస్తామని అన్నారు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు. ఇక… జగన్‌ రాసిన లేఖను బహిర్గతం చేయాలని మంత్రి ఫరూఖ్‌ కోరారు. ఈ వ్యవహారాన్ని ప్రివిలైజ్‌ కమిటీకి సిఫార్సు చేయాలి.. దీనిపై ప్రజల్లో చర్చ జరగాలి అన్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button