
మిర్యాలగూడ, క్రైమ్ మిర్రర్ : మిర్యాలగూడ పట్టణంలో ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా అక్రమంగా చిట్ ఫండ్, వడ్డీ వ్యాపారం చేసి ప్రజల సొమ్మును మోసం చేసిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని టూ టౌన్ పోలీస్ ఇన్స్పెక్టర్ జెట్టి సోమనర్సయ్య విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
దామరచర్ల మండలం బొత్తలపాలెం గ్రామానికి చెందిన కటకం సైదిరెడ్డి మిర్యాలగూడ శాంతినగర్‌లో నివాసముంటూ, శాంతినగర్, సంతోష్ నగర్, రెడ్డి కాలనీ తదితర ప్రాంతాల్లో చిట్ ఫండ్ సభ్యులుగా ప్రజలను చేర్చుకున్నాడు. లక్ష నుండి ఐదు లక్షల వరకు చిట్టీలలో డబ్బులు వసూలు చేసి, ఆ మొత్తాలతో బియ్యం వ్యాపారం, వడ్డీ వ్యాపారం చేస్తూ, తరువాత ఆ మొత్తాలను తిరిగి బాధితులకు ఇవ్వకుండా దాటేసినట్టు తెలుస్తోంది.
కటకం సైదిరెడ్డితో పాటు కటకం వెంకట్ రెడ్డి, మామిల్ల వెంకన్న, గుణగంటి జానయ్యలు కలిసి సుమారు కోటి రూపాయల వరకు ప్రజలను మోసం చేసినట్టు పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, స్థానిక శ్రీమన్నారాయణ ఫంక్షన్ హాల్ వెనుక అనుమానాస్పదంగా తిరుగుతూ ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. తరువాత వారిని కోర్టులో హాజరుపరిచారు.
ఈ కేసును వేగంగా పరిష్కరించిన పోలీసులను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు అభినందించారు. సమావేశంలో ఎస్ఐలు బి.రాంబాబు, హరీష్ రెడ్డి కూడా పాల్గొన్నారు.