- పోలీసుల అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే… అర్ధరాత్రి అక్రమ అరెస్టులు చేస్తారా??
- పత్రికా ప్రతినిధుల కుటుంబాలను భయభ్రాంతులకు గురి చేయడం పోలీసులను లక్ష్యమా?
- నల్గొండ జిల్లాలో అవినీతి అధికారుల పనితీరును ప్రశ్నిస్తే, అరెస్టులతోనే సమాధానాలా??
- పోలీసులను ప్రశ్నించే స్వేచ్ఛ ప్రజా (పత్రికా )స్వామ్యానికి లేదా?
- అవినీతి పోలీసు అధికారుల పనితీరును ప్రశ్నించిన పత్రికా ప్రతినిధులను తక్షణమే విడుదల చేయాలి… విడుదలకు ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలి
క్రైమ్ మిర్రర్, ప్రత్యేక ప్రతినిది : అర్ధరాత్రి నల్లగొండ పోలీసులు అక్రమంగా క్రైమ్ మిర్రర్ ప్రతినిధులను వేరువేరు ప్రాంతాలలో ఏకకాలంలో అరెస్టు చేశారు. మిర్యాలగూడ, మర్రిగూడ ప్రాంతాలలో నివసిస్తున్న క్రైమ్ మిర్రర్ ప్రతినిధులను అర్ధరాత్రి పదుల సంఖ్యలో పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకొని, ఎక్కడకు తీసుకు వెళ్తున్నారో కూడా వారి కుటుంబ సభ్యులకు చెప్పలేదు. పాత్రికేయుల కుటుంబాలను కూడా భయభ్రాంతులకు గురి చేసే విధంగా పోలీసుల వ్యవహరించిన తీరు తీవ్ర అమానుషం. అసలు ఇంతకు క్రైమ్ మిర్రర్ జర్నలిస్టులు చేసిన తప్పేమిటి?… ఎందుకు అర్ధరాత్రి నల్లగొండ పోలీసులు అరెస్టు చేయాల్సి వచ్చింది?. అసలు ముందస్తుగా ఎటువంటి నోటీసులు లేకుండా పౌరుల ప్రజాస్వామ్య హక్కును కాలరాస్తూ, నల్లగొండ పోలీసులు వ్యవహరించిన తీరు సిగ్గుచేటు. ఒకవేళ క్రైమ్ మిర్రర్ ప్రతినిధులు ఏదైనా పొరపాటు చేశారు… తప్పు చేశారనుకుంటే , చట్ట ప్రకారం నోటీసులను జారీ చేసి అరెస్టు చేస్తే, ఎవరికీ ఎటువంటి అభ్యంతరం ఉండదు. కానీ, అర్ధరాత్రి ఇళ్లపై దాడి చేసి, నిద్రిస్తున్న వారిని లేపి తీవ్రవాదులను, ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లుగా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?.
క్రైమ్ మిర్రర్ ప్రతినిధులనే కాకుండా, ఇన్వెస్టిగేషన్ బ్యూరో చీఫ్ గా వ్యవహరిస్తున్న ఆనంద్ నేతకు సన్నిహితుడైన మరొక వ్యక్తిని కూడా అరెస్టు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటో నల్లగొండ జిల్లా పోలీసులు చెప్పాలి. పోలీసుల అవినీతి, అక్రమాలను ఆధారాలతో సహా ప్రశ్నిస్తే… అరెస్టులే బహుమానంగా ఇస్తారా?. ప్రజా ( పత్రికా )స్వామ్యంలో పోలీసులను ప్రశ్నించడానికి, పౌరులకు, జర్నలిస్టులకు హక్కులే లేవా?. రాజ్యాంగంలో పొందుపరిచిన పీఠక లన్నీ మనం ఉత్తిత్తిగా చెప్పుకోవడానికేనా?… చెప్పుకొని మురిసిపోవడానికేనా? అన్న ప్రశ్న తలెత్తక మానదు. నల్లగొండ జిల్లాలో గత కొంతకాలంగా క్రైమ్ మిర్రర్ దినపత్రిక అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న కొంతమంది అధికారులను లక్ష్యంగా చేసుకొని వార్త కథనాలను ప్రచురించంది. క్రైమ్ మిర్రర్ వార్తా కథనాలు కొంతమంది అధికారులకు కంటగింపుగా మారాయి. దీంతో వార్తా కథనాలను ప్రచురిస్తున్న క్రైమ్ మిర్రర్ పై కక్ష కట్టిన నల్లగొండ జిల్లా లోని కొంతమంది అవినీతి ఖాకీలు ఎలాగైనా క్రైమ్ మిర్రర్ గొంతు నొక్కాలనే ప్రయత్నంలో భాగంగానే తమ పలుకుబడిన వినియోగించి టాస్క్ ఫోర్సును రంగంలోకి దింపి, జిల్లా ప్రతినిధిగా పనిచేస్తున్న తుప్పరి రఘు, మిర్యాలగూడ ప్రతినిధిగా అంజి పనిచేస్తున్న ఇద్దరినీ అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ చేసిన నేరం ఏమిటి అంటే… జిల్లాలోని కొంతమంది అవినీతి పోలీసు అధికారుల గురించి వార్తా కథనాలు ప్రచురిస్తున్న క్రైమ్ మిర్రర్ దినపత్రికలో పనిచేయడమే… అంతకుమించి వారు చేసిన తప్పులేదు… నేరము లేదు. ఈ రకంగా జర్నలిస్టుల అక్రమ అరెస్టుల ద్వారా నల్లగొండ పోలీసులు ఎంతకాలమని పాత్రికేయుల గొంతును నొక్కగలరని క్రైమ్ మిర్రర్ దినపత్రిక సూటిగా ప్రశ్నిస్తోంది.
అక్రమ అరెస్టుల ద్వారా మా మనో ధైర్యాన్ని దెబ్బతీయాలన్న నల్లగొండ పోలీసుల కుటిల నీతిని మేము కచ్చితంగా తిప్పి కొడతాం. అక్రమ అరెస్టులను న్యాయస్థానాలలోనే ప్రశ్నిస్తాం. అలుపెరుగని ఉత్సాహంతో మరిన్ని సజీవ సాక్షాలతో అవినీతి అధికారుల పనితీరును ప్రశ్నిస్తూనే ఉంటాం. నల్లగొండ జిల్లాలో అవినీతి అధికారులపై క్రైమ్ మిర్రర్ కథనాలకు స్పందించి ఉన్నతాధికారులు విచారణ చేపట్టడంతోనే తేలు కుట్టిన దొంగల్లా కొంతమంది పోలీసు అధికారులు, క్రైమ్ మిర్రర్ ప్రతినిధులను భయభ్రాంతులకు గురి చేసే కుటిల ప్రయత్నాన్ని చేసినట్లుగా స్పష్టమవుతుంది. ఇలాంటి బెదిరింపులకు క్రైమ్ మిర్రర్ దినపత్రిక వెరవదు. ఇప్పటికే ఎన్నో కేసులను ఎదుర్కొన్నాం… ఇప్పుడు కూడా ఎదుర్కొంటాం. ప్రజాస్వామ్యవాదులను, ప్రజా సంఘాలను, జర్నలిస్టు సంఘాలను కలుపుకొని పోరాడుతాం. నల్లగొండ జిల్లాలోని కొంతమంది అవినీతి పోలీసు అధికారులకు వ్యతిరేకంగా ఆధారాలతో సహా మా వార్త కథనాల ప్రచురణ యధావిధిగా కొనసాగిస్తాం.
నిఘా వ్యవస్థ నిద్రిస్తే క్రైమ్ మిర్రర్ కాపు…